
ఎలుకతో ఫుల్ కామెడీ!
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే దర్శకులు రేలంగి నరసింహారావు. చాలా గ్యాప్ తరువాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, పావని ప్రధాన పాత్రల్లో మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో హీరోగా ఎవరిని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘వెన్నెల’ కిశోర్ అయితే బాగుంటుందని చాలామంది చెప్పారు.
అతడు నటించిన సినిమాల డీవీడీలు చూసి నా చిత్రానికి బాగా యాప్ట్ అవుతాడనిపించి మా గురువుగారు దాసరికి చెప్పాను. ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ సినిమాలో ఎలుకకు గొప్ప సెంటిమెంట్ ఉంది. ఎలుకదే ప్రధాన పాత్ర. అదేంటో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్ర కుమార్, సంగీతం: బల్లేపల్లి మోహన్.