Relangi Narasimha Rao
-
ఊ అంటావా మావా!
యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ కీలక పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘తెలుగులో ఇప్పటి వరకూ రాని కామెడీ, హారర్ థ్రిల్లర్ చిత్రమిది. మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘రేలంగి నరసింహారావుగారి 76వ చిత్రం ఇది. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. పాటలు చక్కగా కుదిరాయి’’ అన్నారు ప్రసన్నకుమార్. -
రాకింగ్ రాకేష్ హీరోగా 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'..
Oo Antava Mava Oo Oo Antava Mava Movie Title Launch: యశ్వంత్, రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ముఖ్య తారలుగా రేలంగి నరసింహా రావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’. తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ఫిల్మ్ ఛాంబర్’ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్‌లు ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ–‘‘కామెడీతో కూడుకున్న హారర్ సినిమా ఇది. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘76 సూపర్ హిట్స్ ఇచ్చిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా హిట్ అవుతుంది’’ అన్నారు తుమ్మల ప్రసన్నకుమార్. చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, కెమెరా: కంతేటి శంకర్. చదవండి:👇 నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ? వెనక్కి తగ్గిన నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' రిలీజ్లో మార్పు అనసూయ కొత్త చిత్రం 'అరి'.. టైటిల్ లోగో ఆవిష్కరణ.. ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'.. -
‘పుష్ప’ ఐటం సాంగ్ టైటిల్‌తో సినిమా
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలోని ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ’ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆ పాట పేరుతోనే ఓ సినిమా తెరకెక్కుతుంది. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మిగిలిన రెండు పాటల షూట్ కోసం కశ్మీర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమం చేపట్టింది. నిర్మాత మాట్లాడుతూ ‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది. బ్యాలెన్స్ రెండు పాటలను కాశ్మీర్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం. జూలై చివరివారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం. అందరూ ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా రేలంగి నరసింహారావు గారు గత సినిమాల రికార్థులను ఈ సినిమా అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ..ఇప్పటి వరకు చేసిన కామెడీ సీనిమాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. ఇది కామెడీ తో కూడుకున్న హార్రర్ సినిమా. కాశ్మీర్ లో జరిగే పాటల షూట్ తో సినిమా పూర్తి చేసుకొని జులై చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు అజయ్ కుమార్, రాజా వన్నెం రెడ్డి, సత్య ప్రకాష్, ఆచంట గోపినాథ్, దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖుల చమక్కులతో పుస్తకం
‘‘జయకుమార్, నేను కలిసి మద్రాస్‌లో ఒకే రూంలో ఉండేవాళ్లం. అప్పటి నుంచి కూడా ఆయనకు సాహిత్యం మీద చాలా అభిలాష ఉండేది’’ అని డైరెక్టర్ రేలంగి నరసింహారావు అన్నారు. ఆనాటి సినీ ప్రముఖులు, రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల మధ్య వివిధ సందర్భాల్లో జరిగిన సంభాషణలను సేకరించిన సహదర్శకులు కనగాల జయకుమార్ ‘సినీప్రముఖుల చమక్కులు’ పేరిట ఓ పుస్తకాన్ని ముద్రించారు. హీరో శ్రీకాంత్ ఈ బుక్‌ని ఆవిష్కరించగా, వాసిరెడ్డి విద్యాసాగర్ స్వీకరించారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు జయకుమార్‌ని చాలా గౌరవించేవారు. రెండుసార్లు ఆయనకు డైరెక్టర్‌గా అవకాశాలు వచ్చినా కూడా ఎందుకో డైరెక్టర్ కాలేకపోయారు. జయకుమార్ చక్కని పాటలు, కవితలు రాస్తారు’’ అన్నారు. ‘‘జయకుమార్‌గారు, నేను కలిసి కొంతకాలం పని చేశాం. ఆయన ఎప్పుడూ టెన్షన్ పడరు. ఈ పుస్తకం పార్ట్ –2 తీసుకురావాలన్నది చాలా మంచి ఆలోచన’’ అన్నారు డైరెక్టర్ శివనాగేశ్వరరావు. ‘‘జయ్‌కుమార్‌గారు నా సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పుస్తకం చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హీరో శ్రీకాంత్. ‘‘40ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ఆనందం వేరే ఎందులోనూ ఉండదు. విద్యాసాగర్‌గారు ఫిల్మ్ అప్రిసియేషన్ క్లాసెస్ అని తన కళాశాలలో నాకు ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించారు. నేను అడగకుండానే నా పుస్తకాలను ప్రచురించినందుకు చాలా కృతజ్ఞతలు’’ అని రచయిత జయకుమార్ అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్‌రావు, జడ్జి కరపాల సుధాకర్, నటుడు హేమసుందర్, మరుధూరి రాజా, రాంప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్
పృథ్వీ దండమూడి, మైరా దోషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఐఐటీ కృష్ణమూర్తి ’. శ్రీ వర్థన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రేమ్‌కుమార్ పాట్ర సమర్పణలో క్రిస్టోలైట్ మీడియా క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ నేకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను నిర్మాత కె.ఎస్ రామారావు విడుదల చేశారు. డైరెక్టర్ రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘ఐఐటి కృష్ణమూర్తి’ టైటిల్ వెరైటీగా ఉంది. ఈ చిత్రం టీజర్ ఇంటెన్స్‌గా చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్. యూత్ అంతా కలిసి చేసిన ఈ సినిమా నిర్మాతకు సక్సెస్‌ను అందించాలి’’ అన్నారు. ‘‘కార్పొరేట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న చిత్రమిది. నేటి తరానికి నచ్చేలా ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉంటుంది. ప్రేక్షకులందరికీ మా ‘ఐఐటి కృష్ణమూర్తి’ నచ్చుతాడని నమ్ముతున్నా’’ అని శ్రీ వర్ధన్ అన్నారు. ‘‘నాకు సినిమా ఫీల్డ్ కొత్త. ఈ చిత్ర దర్శకుడు, రైటర్ పట్టుదల, కథ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది’’ అని ప్రసాద్ నేకూరి అన్నారు. ‘‘నేను హీరో అయినా, మా టీమ్ మెంబర్సే ఈ చిత్రానికి రియల్ హీరోస్’’ అని పృథ్వీ దండమూడి అన్నారు. చిత్ర సమర్పకులు ప్రేమ్‌కుమార్ పాత్ర, సంగీత దర్శకుడు నరేష్ కుమారన్, నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, సురేష్ కొండేటి, సాయి వెంకట్, రమేష్ మద్దినేని, బాబ్జీ, రామ్ రావిపల్లి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యేసు.పి, లైన్ ప్రొడ్యూసర్: ఎల్.వి. వాసుకి. -
సాగర తీరంలో....
‘‘దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దగ్గర ధర్మారావు పని చేశాడు. టాలెంట్ ఉన్న దర్శకుడు. ‘సాగర తీరంలో’ ట్రైలర్ చాలా బాగుంది. భోలె చక్కటి సంగీతం అందించాడు. ఈ సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. దిశాంత్, ఐశ్వర్య అడ్డాల జంటగా ధర్మారావు జగతా దర్శకత్వంలో తడాలా వీరభద్రరావు నిర్మించిన చిత్రం ‘సాగర తీరంలో ’. ఈ చిత్రం పాటలను రేలంగి నరసింహారావు, నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ‘‘అమలాపురం, ముమ్మిడివరం, యానాం, ఎన్. రామేశ్వరం, ఓడలరేవు, కొమరగిరిపట్నం తదితర తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశాం. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు దర్శక, నిర్మాతలు. -
హాస్య, కుటుంబ కథా చిత్రాలంటే ఎంతో ఇష్టం
నెల్లూరు(బృందావనం): ప్రముఖ దర్శకులు దాసరినారాయణరావు శిష్యుడిగా తాను హాస్యానికి ప్రాధాన్యమిస్తూ కుటుంబ పరమైన చిత్రాలను నిర్మించినందుకు ఎంతో సంతృప్తిని పొందుతున్నానని ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. శతవసంతాల చిత్ర దర్శకుడు కేఎస్ఆర్ దాస్ జయంతిని పురస్కరించుకుని మనం చారిటబుల్ట్రస్ట్, కొండాసోదరుల సంయుక్త ఆధ్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకునేందుకు ఆదివారం ఆయన నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు. తన సొంత ఊరు పాలకొల్లు అని ఫొటోగ్రఫీపై ఉన్న ఆసక్తితో సినిమారంగంలో ప్రవేశించానన్నారు. తొలినాళ్లలో దాసరినారాయణరావు దగ్గర ఫొటోగ్రఫీలో మెళకువలు తెలుసుకున్నానన్నారు. పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్‌గా పనిచేసినట్లు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగంలో 1981 ప్రవేశించిన తాను ఇప్పటి వరకు 75సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించానన్నారు. ఇందులో 24చిత్రాలు చంద్రమోహన్‌తో 32 చిత్రాల రాజేంద్రప్రసాద్‌తో ఉన్నాయన్నారు. తమిళంలో ఒకటి, కన్నడంలో ఏడు చిత్రాలు నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం రెండు చిత్రాలను నిర్మించనున్నానని వివరించారు. తనకు హాస్య, కుటుంబ కథా చిత్రాల నిర్మాణ సమయంలో చంద్రమోహన్, కాశీవిశ్వనాథ్, పూసల సహకరించారన్నారు. తనకు హాస్యమన్నా, కుటుంబ అంశమన్నా ఎంతో ఇష్టం కావడంతో తన చిత్రాలన్నీ హాస్యభరిత కుటుంబ చిత్రాలేనన్నారు. నేడు వస్తున్న చిత్రాలు యువతకోసంగా ఉన్నాయని, కుటుంబపరంగా లేవన్నారు. -
'నా సినీ జీవితానికి ఆయనే మార్గదర్శి'
విజయవాడ: రేలంగి నరసింహారావు తెలుగు చిత్రసీమలో హాస్యచిత్రాలకు బ్రాండ్ అంబాసిడర్. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రాలకు దర్శకత్వం వహించిన హాస్య చక్రవర్తి ఆయన. కెమెరామెన్ కావాలని చిత్రసీమలో ప్రవేశించి సహాయ దర్శకునిగా జీవితాన్ని ప్రారంభించి స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి దర్శకత్వ బాధ్యలు చేపట్టి 75కు పైగా చిత్రాలకు దర్శతక్వం వహించారు. రేలంగి స్కోర్‌మోర్ సంస్థ ప్రదానం చేసే హాస్యరత్న పురస్కారం అందుకోవటానికి విజయవాడ వచ్చిన సందర్భంలో సాక్షితో ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి : 45 ఏళ్లు సినీప్రస్థానంలో మీరు ఏమి నేర్చుకున్నారు? నరసింహారావు : క్రమశిక్షణ, వృత్తిపట్ల అంకితభావం, వ్యసనాలకు దూరంగా ఉండటం. సాక్షి : మీరోల్ మోడల్? నరసింహారావు : దర్శకరత్న దాసరి నారాయణరావు, నా సినీ జీవితానికి ఆయనే మార్గదర్శి. సాక్షి : మీ తొలి సంపాదన? నరసింహారావు : సహాయ దర్శకునిగా 125 రూపాయలు సాక్షి : సీనియర్ దర్శకునిగా నేటి సినిమాలను చూస్తే మీకేమనిపిస్తోంది.? నరసింహారావు : అప్పట్లో సినీ రంగంలో టీమ్ వర్కు ఉండేది. ఇప్పుడంతా మనీ మైండ్. సాక్షి : తెలుగు సినిమాల పరిస్థితి? నరసింహారావు : చిన్న సినిమాల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. రిలీజ్‌కు థియేటర్లు లేవు. సాక్షి : సినిమా పరిశ్రమంతా ఐదు కుటుంబాల చేతిలోనే ఉందన్న నిజాన్ని అంగీకరిస్తారా? నరసింహారావు : తప్పక అంగీకరిస్తా. పరిశ్రమేకాదు.. థియేటర్లు కూడా వారి చెప్పుచేతల్లోనే ఉన్నాయి. సాక్షి : మీ విజయానికి కారణం? నరసింహారావు : నేను దర్శకత్వం వహించిన ‘నేను మా ఆవిడ’ విజయంతో విజయాల దారి తెలిసింది. సాక్షి : ప్రతి వాని విజయం వెనుక ఎవరో ఒకరు ఉంటారు కదా? మీ వెనుక ఎవరున్నారు? నరసింహారావు : దాసరి. ఆయన తెరిచిన పుస్తకం. నడిచే సినీ దేవాలయం. ఆయన లేని రేలంగి లేడు. సాక్షి : మీరు మర్చిపోలేని సంఘటన? నరసింహారావు : ఏంటిబావా మరీను చిత్రంలో కాస్త శృంగారం శృతి మించింది. విజయవాడలోని ఒక మీట్లో ఒకామె అడిగారు మీనుంచి మేం ఆశించేది ఇటువంటి సినిమాలు కాదని నాబాధ వర్ణనాతీతం. దీంతో అటువంటి చిత్రాలు తియ్యడం అదే మొదలు.. అదే చివర. -
ఎలుకతో ఫుల్ కామెడీ!
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే దర్శకులు రేలంగి నరసింహారావు. చాలా గ్యాప్ తరువాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో బ్రహ్మానందం, వెన్నెల కిశోర్, రఘుబాబు, పావని ప్రధాన పాత్రల్లో మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో హీరోగా ఎవరిని ఎంచుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘వెన్నెల’ కిశోర్ అయితే బాగుంటుందని చాలామంది చెప్పారు. అతడు నటించిన సినిమాల డీవీడీలు చూసి నా చిత్రానికి బాగా యాప్ట్ అవుతాడనిపించి మా గురువుగారు దాసరికి చెప్పాను. ఆయన కూడా ఓకే చెప్పారు. ఈ సినిమాలో ఎలుకకు గొప్ప సెంటిమెంట్ ఉంది. ఎలుకదే ప్రధాన పాత్ర. అదేంటో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నాగేంద్ర కుమార్, సంగీతం: బల్లేపల్లి మోహన్. -
ఇండియాలోనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్ రేలంగి
- రాజేంద్రప్రసాద్ ‘‘చాలా సంవత్సరాల తర్వాత నా శిష్యుడైన రేలంగి నరసింహారావు ఈ సినిమా డెరైక్ట్ చేశాడు. ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి బాగోలేకపోవడంతో తను ఈ సినిమా చేయకూడదని అనుకున్నాడు. నేను చెప్పడంతో చేశాడు. గొప్ప సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మానందం, పావని ముఖ్య పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బల్లేపల్లి మోహన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి నారాయణరావు ఆవిష్కరించి, తొలి సీడీని రాజేంద్రప్రసాద్‌కు అందించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ-‘‘ రేలంగి నరసింహారావుగారు తీసిన 75 సినిమాల్లో 35 సినిమాల్లో నేనే హీరో. ఇండియాలోని అతి గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్స్‌లో ఆయన ఒకరు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరోగా ఎవ రైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో నాకు ‘వెన్నెల’ కిశోర్ గురించి కొంత మంది చెప్పారు. అతనికి మంచి కామెడీ టైమింగ్ ఉంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో నటులు గిరిబాబు, సీనియర్ నరేశ్, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 30న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: దీప్తీ భట్నాగర్ (నటి), రేలంగి నరసింహారావు (దర్శకుడు), షాన్ (సింగర్) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి ఉత్సాహవంతంగా ఉంటుంది. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టుల నుంచి ఈ సంవత్సరం లాభం గడిస్తారు. నలుగురిని కలుపుకుని కొత్త టెక్నాలజీతో కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులు చేపడతారు. విందు వినోదాలతో గడుపుతారు. పార్ట్నర్షిప్ వ్యవహరాలు లాభిస్తాయి. వివాహయోగం, సంతానయోగం వంటి శుభపరిణామాలు సంభవిస్తాయి. పాత స్నేహితులతో తిరిగి స్నేహం బలపడుతుంది. పుట్టిన తేదీ 30. ఇది గురువుకు సంబంధించిన సంఖ్య కాబట్టి ఈ సంవత్సరం గురు చంద్రుల ప్రభావం వల్ల గజకేసర యోగం ఏర్పడి సంఘ గౌరవం పొందుతారు. సంగీతం, నాట్యం లాంటి లలిత కళలలో సృజనాత్మకతతో కొత్త పుంతలు తొక్కుతారు. ప్రజలలో గుర్తింపు పొందుతారు. ఉదర సంబంధ వ్యాధులు, గ్యాస్ సమస్యలు వచ్చే వకాశం ఉన్నందువల్ల ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. లక్కీ నంబర్స్: 1,2,3,6,9; లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డ్, ఎల్లో, శాండిల్. సూచనలు: తల్లిని, తల్లి తరఫు వారిని ఆదరించడం, అమ్మవారిని ఆరాధించడం, పేద కన్యల వివాహానికి సాయం చేయడం, రోజూ కొంతసేపు వెన్నెలలో విహరించడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
బాబోయ్... ఎలుక!
కామెడీ సినిమాల స్పెషలిస్ట్ డైరక్టర్ రేలంగి నరసింహారావు, కొంత విరామం తర్వాత తీసిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిషోర్, పావని జంటగా నా ఫ్రెండ్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ -‘‘ఎలుక ప్రధానంగా ఇంతవరకూ హాలీవుడ్‌లోనే వచ్చాయి. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. నేను కామెడీ చిత్రాలు మాత్రమే చేశాను. కానీ సీజీ వర్క్ నేపథ్యంలో సాగే హాస్యరస చిత్రం చేయడం ఇదే ఫస్ట్ టైమ్. వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’అని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: దివాకర్‌బాబు, మాటలు: ‘గంగోత్రి’ విశ్వనాథ్, గ్రాఫిక్స్: సత్య. -
మళ్లీ రేలంగి మార్క్ సినిమా
కామెడీ సినిమాలు తీయడంలో రేలంగి నరసింహారావుది ఓ ప్రత్యేకమైన శైలి. ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు’, ‘ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు తెరపై తిరుగులేని విజయాల్ని దక్కించుకున్నారాయన. కొంత విరామం తరువాత ఆయన మళ్లీ మెగాఫోన్ చేతపట్టనున్నారు. హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ హీరోగా ఓ చిత్రం రూపొందించనున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పాటను రికార్డ్ చేశారు. నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ పతాకంపై మారెళ్ల నరసింహారావు, వడ్డెళ్ల శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలుమాట్లాడుతూ ‘‘ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. ఇందులో బ్రహ్మానందం, ఓ ఎలుక ప్రధాన పాత్రధారులు’’ అని తెలిపారు. మోనికా సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రంలో రఘబాబు, తిరుపతి ప్రకాశ్ ముఖ్య తారాగణం. -
ఒక్క చిత్రంతో...గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా!
ఉన్నత చదువులు చదివి... గొప్ప ఉద్యోగం చేయాలనుకున్న వ్యక్తి సినీదర్శకుడు అవడమేంటి? తొలి సినిమానే సరైన సమయానికి విడుదల కాలేదు. అలాంటి వ్యక్తి... 73 సినిమాల దర్శకునిగా ఎదగడమేంటి? ‘వీడు గనుక దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి చంపేస్తాడ్రా’ అని అందరితో అనిపించుకున్న వ్యక్తి ముప్ఫై ఏళ్ల పాటు జనాలను ఏకధాటిగా నవ్వించడమేంటి? ఇన్నాళ్ల ఆ నవ్వుల ప్రయాణం వెనుక చెరగని ఆ కన్నీటి మరక ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనుందా! అయితే చదవడం మొదలుపెట్టండి. దర్శకుడు రేలంగి నరసింహారావు కామెడీ వెనుక ఎంత కథ ఉందో, ఎంత కష్టం ఉందో, ఎంత కన్నీరుందో... తెరపై మీదో ప్రత్యేక సంతకం కదా! మీరిలా సెలైంటయ్యారే? 1996 నుంచి వరుసగా నాలుగేళ్లు కన్నడ సినిమాలు చేశా. తెలుగు సినిమా పూర్తి స్థాయిలో హైదరాబాద్‌కు షిఫ్టయ్యింది అ టైమ్‌లోనే. కన్నడంలో కమిట్మెంట్లు పూర్తి చేసుకొని 1999లో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాను. అప్పటికే జరగకూడని డామేజీ జరిగిపోయింది. నా గ్యాప్ ఇక్కడ భర్తీ అయిపోయింది. ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి బిజీ అయ్యారు. ఒక్కసారి వెనుక పడ్డాక, ముందుకెళ్లడం చాలా కష్టం. ట్రెండ్ కూడా మారింది. పైగా ‘రేలంగి నరసింహారావు కన్నడంలో స్థిరపడిపోయాడు’ అనే వార్తలు అప్పటికే పేపర్లలో వచ్చాయట. నిజానికి నేను అక్కడ సెటిల్ అవ్వలేదు. మా అత్తగారి ఊరు బెంగళూరు. అందుకే కొన్ని రోజులు అక్కడే ఉండి సినిమాలు చేశా. దానికి ప్రతిఫలమే ఈ విరామం. ఇక్కడకు రాగానే రాజేంద్రప్రసాద్‌తో ‘అమ్మో బొమ్మ’ తీశా. ఆడలేదు. ఆ తర్వాత ‘ప్రేమించుకున్నాం పెళ్లికి రండి’ తీశా. అదీ ఆడలేదు. తర్వాత దుకాణం తెరిచి ఉంచినా మన దగ్గరకు ఎవరూ రాలేదు. ఏం చేస్తాం. వరుసగా సినిమాలు చేసిన మీకు ఈ విరామం ఇబ్బందిగా లేదా? నా అదృష్టం ఏంటంటే.. ఇంకా నా పేరు మరుగున పడలేదు. ‘ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం, పోలీసుభార్య, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, బ్రహ్మచారి మొగుడు’ లాంటి చిత్రాలు టీవీల్లో వస్తుంటే జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమా హిట్టయినా మళ్లీ పూర్వ వైభవం వస్తుందని నా నమ్మకం. త్వరలో మా గురువు గారైన దాసరి గారి బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నా. స్క్రిప్ట్ రెడీ. త్వరలోనే సెట్స్‌కి వెళతాం. అసలు దర్శకునిగా మీ తొలి అడుగు ఎలా పడింది? మా నాన్నగారు రేలంగి శ్రీరంగనాయకులు మా ఊళ్లో పేరున్న వైద్యులు. నన్ను కూడా డాక్టర్‌గా చూడాలనేది నాన్న కోరిక. అందుకే బీఎస్సీలో చేర్పించారు. మార్కులు సరిగ్గా రాలేదు. నిరుత్సాహానికి లోనై, ‘డాక్టర్ చదువుకి నేను పనికిరాను’ అని నాన్నకు నిర్మొహమాటంగా చెప్పేశాను. నా పరిస్థితిని గమనించిన నాన్న.. ‘ఇష్టమైన రంగంలోనే ప్రోత్సహించడం కరెక్ట్’ అనుకొని మద్రాస్ తీసుకెళ్లారు. రవిరాజా పినిశెట్టి తండ్రి పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారు మా నాన్నకు మంచి మిత్రుడు. నన్ను ఆయన వద్దకు తీసుకెళ్లారు. అక్కడే గురువుగారు దాసరిగారిని తొలిసారి చూశా. రామ్మూర్తిగారి రికమెండేషన్‌తో ‘మహ్మద్‌బీన్ తుగ్లక్’ సినిమాకు దర్శకుడు బీవీ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. ఆ చిత్రానికి దాసరిగారే రైటర్. అప్పట్నుంచీ ఆయనతో టచ్‌లో ఉండేవాణ్ణి. తర్వాత నేను కేఎస్ఆర్ దాస్‌గారి దగ్గర ‘ఊరికి ఉపకారి’ చిత్రానికి అసిస్టెంట్‌గా చేరాను. అప్పుడే గురువుగారి ‘తాతామనవడు’ మొదలైంది. ‘వచ్చేస్తాను సార్’ అన్నాను. ‘సినిమా మధ్యలో వదిలిపెట్టి రావద్దు. మంచి పద్ధతి కాదు. కష్టమైనా నష్టమైనా ఒప్పుకున్న సినిమాను పూర్తి చేసి రావడం ధర్మం’ అని కచ్చితంగా చెప్పేశారు గురువుగారు. గురువుగారి రెండో సినిమా నుంచీ నేను ఆయన బృందంలో చేరిపోయాను. అలా 1973 నుంచి 1979 వరకూ దాసరిగారితో నా ప్రయాణం సాగింది. ‘సర్కస్‌రాముడు’ నిర్మాత కోవై చెళియన్ గురువుగారితో ఓ సినిమా చేయాలనుకున్నారు. గురువుగారికేమో విపరీతమైన కమిట్మెంట్లు. దాంతో ‘మా నరసింహారావు చేస్తాడు లెండీ. నేను పర్యవేక్షిస్తాను’ అని దర్శకునిగా నాకు ప్రమోషన్ ఇప్పించారు గురువుగారు. అలా ‘చందమామ’తో దర్శకుణ్ణి అయ్యాను. మరి మీ తొలి సినిమా ‘చందమామ’కు ఇబ్బందులొచ్చాయట.. నిర్మాత చెళియన్గారికి, పంపిణీదారులకీ మధ్య మనస్పర్థలొచ్చాయి. వాళ్లే తన దగ్గరకొస్తారని ఆయనా, ఆయనే వస్తారని పంపిణీదారులు భీష్మించుకొని కూర్చోవడంతో సినిమా విడుదల ఆగింది. అప్పుడు గురువుగారు కలుగజేసుకొని నిర్మాతకు, పంపిణీదారులకూ మధ్య రాజీ కుదిర్చారు. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత సినిమా విడుదలైంది. అప్పటికే నా దర్శకత్వంలో ‘నేనూ మా ఆవిడ, ఏమండోయ్ శ్రీమతిగారు’ చిత్రాలు విడుదలై నాకు కామెడీ ఇమేజ్ వచ్చేసింది. దాంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. నిజానికి అది చాలా మంచి కథ. సీరియస్ సబ్జెక్ట్. మురళీమోహన్, మోహన్‌బాబు, సరిత, ఫటాఫట్ జయలక్ష్మి ఇలా హేమాహేమీలు నటించారు. సరైన సమయంలో అది విడుదలైతే, నా ప్రయాణం వేరేలా ఉండేది. బహుశా నా నుంచి సీరియస్ సినిమాలే వచ్చేవేమో! అసలు కామెడీ బాట ఎలా పట్టారు? ‘చందమామ’ తర్వాత అనుకోకుండా కామెడీ కథ చేయాల్సొచ్చింది. రాంబాబుగారని.. ఎన్టీఆర్‌గారి బావమరిదికి బావమరిది. తను నిర్మాత. గురువుగారు దర్శకత్వ పర్యవేక్షణ. సినిమా పేరు ‘నేను - మా ఆవిడ’(1980). ఓ బ్రహ్మచారి కథ అది. పెద్ద హిట్. వందరోజులాడింది. ఆ సినిమా పుణ్యమా అని నాకు కామెడీ ఇమేజ్ పడిపోయింది. కామెడీకే అంకితమైపోయానని ఎప్పుడైనా బాధపడ్డారా? ఆ ఫీలింగ్ నాకెప్పుడూ లేదు. ఇప్పటికీ నాకు నేను అదృష్టవంతునిగా ఫీలవుతా. సాధారణంగా సినీరంగంలో పోటీ ఎక్కువ. కానీ.. నాకు జంధ్యాల మాత్రమే పోటీ. జంధ్యాల తెలుగుకే పరిమితం అయ్యారు. నేను ఇతర భాషల్లోనూ చేశా. కన్నడంలో ఏడు సినిమాలు చేశాను. తమిళంలో నగేశ్ గారబ్బాయి ఆనంద్‌బాబుతో ‘ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్’ రీమేక్ చేశాను. హిందీలో కూడా అదే సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది. రిషి కపూర్ హీరో. కానీ జస్ట్ మిస్. లేకపోతే హిందీలో కూడా నాది ఓ సినిమా ఉండేది. వంద సినిమాలకు దగ్గర పడుతున్నట్లున్నారు... లేదండీ... 73 సినిమాలు చేశాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంద సినిమాలు చేయడం కష్టమే. కన్నడంలోకి వెళ్లకపోతే మాత్రం కచ్చితంగా వందకు దగ్గర పడేవాణ్ణి. ఏంటండీ... ఒక్క 1989లోనే నావి 11 సినిమాలు విడుదలయ్యాయంటే నమ్ముతారా!. ఏడాదికి 11 సినిమాలతో ఓ మలయాళ దర్శకుడు అప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉన్నాడు. కృష్ణంరాజుగారి ‘యమధర్మరాజు’ సినిమా నిర్మాణం పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది. అయితే... ఆ సినిమా ఆ మరుసటేడు 1990లో విడుదలైంది. అలా ఒక్క చిత్రంతో గిన్నిస్ రికార్డ్ మిస్సయ్యా. లేకపోతే, దాసరిగారితోపాటు వారి శిష్యుల్లో కూడా ఒకరు గిన్నిస్ రికార్డ్‌లో ఉండేవారన్నమాట? గురువుగారితో పోలిక వద్దండీ. ఆయన మహానుభావుడు. నా తొలి సినిమా ‘నేనూ మా ఆవిడ’ ఇంకొన్ని రోజుల్లో ప్రారంభోత్సవం అవుతుందనగా... ఎన్టీఆర్‌గారు అన్నమాట నాకింకా గుర్తు. ‘అందరు గురువుల్లాంటి గురువు కాదండీ మీ గురువు. అందరూ విద్య నేర్పి వదిలేస్తారు. కానీ మీ గురువు మీ అభ్యున్నతికి కూడా బాటలు వేస్తారు. అరుదుగా ఉంటారు అలాంటి గురువులు. నేను నీ తొలి సినిమా ప్రారంభోత్సవానికి వస్తాను. మొదటి కొబ్బరికాయ నేనే కొడతాను’ అని దీవించారు. అన్నట్లుగానే వచ్చి దీవించారు. రామారావుగారు అన్నారని కాదు కానీ... మా గురువుగారు నిజంగా అంతటి గొప్పవారే. కొంతమంది గురువులు శిష్యులు పైకొస్తున్నా తట్టుకోలేరు. కానీ మా గురువుగారికి అలాంటి అసూయ ఇసుమంత కూడా ఉండదు. ఎప్పడూ మమ్మల్ని ప్రేమించారు. ఆయనకు తీరిక లేకపోతే... మా పేర్లు సూచించిన సినిమాలు చాలా ఉన్నాయి. గురుధర్మాన్ని గొప్పగా అవలంబించేవారాయన. ఆ గొప్పతనాన్ని దగ్గరగా చూశాం కాబట్టే మా అందరికీ ఆయన దైవం అయ్యారు. పరిశ్రమ పచ్చగా ఉండాలనే దృక్పథంతో సాధ్యమైనంతవరకూ ఎక్కువ సినిమాలు చేసేవారు. ఆయన దారినే అనుసరిస్తూ శిష్యులమైన మేము కూడా గణనీయంగా సినిమాలు చేశాం. నేను 73 సినిమాలు చేస్తే... కోడి రామకృష్ణ తీసినవాటి సంఖ్య ఇప్పటికే 130 దాటిపోయింది. రవిరాజా పినిశెట్టి యాభైకి పైనే తీశాడు. ఇదంతా మా గురువుగారి ప్రేరణే. అన్నట్లు... కోడి రామకృష్ణ, మీరూ చిన్ననాటి దోస్తులటకదా? అవును.. కోడిరామకృష్ణ నా క్లాస్మేట్, రూమ్మేట్, బెంచ్‌మేట్ కూడా. పాలకొల్లులో మాది లంకంత ఇల్లు. మా తాతయ్యకు ఏడుగురు కొడుకులు. ఇంకో తాతయ్యకు అయిదుగురు కొడుకులు. అందరికీ ఒకటే వరండా. అక్కడ చదువు సాగడం చాలా కష్టం. అందుకని బయట రూమ్ తీసుకున్నా. కోడి రామకృష్ణ, నేను, మా ఇంకో మిత్రుడు సుబ్రహ్మణ్యం ఆ రూమ్‌లో ఉండేవాళ్లం. మొదట్నుంచీ రామకృష్ణకి సినిమాలపైనే దృష్టి. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని కలలు కనేవాడు. నాకేమో ఉన్నత చదువులు చదవాలని ఉండేది. నాటకాల రిహార్సల్స్ అంటూ ఎవరెవరినో గదికి తెస్తుండేవాడు. దాంతో నాకు, నా మిత్రుడు సుబ్రమణ్యంకి చిర్రెత్తుకొస్తుండేది. ఒక్కోసారి నేను, సుబ్రమణ్యం కలిసి రామకృష్ణను తెగ తిట్టేవాళ్లం. ‘అస్తమానం సినిమాలేంటి? నాటకాలేంటి? ఎప్పుడూ రూమ్ నిండా ఈ జనాలేంటి? అసలు నువ్వు మా రూమ్‌లో వద్దు. బయటకుపో’ అని సామాన్లు విసిరి కొట్టేవాళ్లం. కానీ... రామకృష్ణకు విపరీతమైన సహనం. అస్సలు కోపం రాదు. చిన్నప్పట్నుంచీ అంతే. ఎంత తిట్టినా.. ‘రేపట్నుంచి ఉండదులే. బయట చూసుకుంటాం. ఈ ఒక్కరోజే’ అని ఎలాగోలా మభ్య పెట్టేవాడు. అవన్నీ మరిచిపోలేని రోజులు. ఇంతకీ మీ అమ్మగారి గురించి చెప్పనే లేదు? మా అమ్మ గృహిణి. పేరు శివరావమ్మ. అమ్మంటే నాకు చాలా ఇష్టం. కానీ ఓ చిన్న విషయం వల్ల మేం పదేళ్ల పాటు దూరమయ్యాం. చిన్న పిల్లలు కొట్టుకోవడం, తిట్టుకోవడం సహజం కదా! అలాగే, ఓ సారి మా తమ్ముణ్ణి కొట్టాను. అమ్మ తిట్టింది. ‘ఎందుకురా... పెద్దాడివై ఉండి... చిన్నాణ్ని పట్టుకొని అలా కొట్టడం. తప్పు కదా’ అని మందలించింది. ఆ చిన్న కారణం వల్ల పదేళ్ల పాటు అమ్మతో నాకు మాటల్లేవ్. బహుశా ఊళ్లో ఉంటే మాట్లాడేవాణ్ణేమో. నేను 1970లోనే మద్రాస్ వెళ్లిపోయా. దాంతో ఇక అమ్మతో మాట్లాడలేకపోయాను. ‘అమ్మ’ అనే పిలుపుకు కూడా ఆమెను దూరం చేశాను. 1968లో జరిగింది ఈ గొడవ. అమ్మ 1978లో చనిపోయింది. అంత కోపం ఎందుకొచ్చింది? అజ్ఞానం. తర్వాత తెలిసింది అది అజ్ఞానం అని. దాని వల్ల ఎంత పోగొట్టుకున్నానో తర్వాత తెలిసింది. 1978లో అమ్మ చనిపోయిందని మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఆదుర్దాగా బయలు దేరాను. తెల్లారి పొద్దున్నే ఊళ్లోకి దిగాను. ఇంటి ముందు పందిరేసుంది. బయట బల్లలు పెట్టి ఉన్నాయి. కానీ అమ్మ భౌతిక కాయం మాత్రం అక్కడ లేదు. గుండె బరువెక్కింది. ‘అమ్మ ఏది?’ అని అక్కడున్నవాళ్లను కంగారుగా అడిగాను. ‘లేదయ్యా... రాత్రి అమ్మకు మళ్లీ ఊపిరొచ్చింది’ అని చెప్పారు. దాంతో పరుగు లాంటి నడకతో హాల్లోకి వెళ్లాను. అమ్మ పడుకొని ఉంది. మంచం చుట్టూ బంధువులు గుమిగూడి ఉన్నారు. కానీ... అమ్మ నా వైపే చూస్తోంది. నేను దగ్గరకు వెళ్లాను. అప్పటికే అమ్మకు మాట పడిపోయింది. నన్ను పట్టుకొని ‘ఆ... ఆ...’ అని ఏదో అంటోంది. నాకేం అర్థం కాక పక్కవాళ్ల వంక చూశాను. ‘ఏమీ లేదయ్యా... ఒక్కసారి ‘అమ్మా’ అని పిలవమంటోంది’ అన్నారంతా. ‘అమ్మా...’ అని పిలిచాను. అంతే... ఆమె కళ్లల్లో ఎప్పుడూ చూడనంత ఆనందం... బొటబొటా... కన్నీరు కార్చేసింది. నన్ను గట్టిగా కౌగిలించేసుకుంది. ‘ఇంకేం బాధ లేదు బాబూ... ఈ ఆనందంలో బతికేస్తుంది’ అన్నారంతా. కాసేపయ్యాక నేను లోపలకెళ్లి స్నానం చేసి వచ్చాను. ఇంతలో ఘొల్లున ఏడుపులు వినిపించాయి. ఏంటి? అంటే ‘అమ్మ చనిపోయింది’. నిజానికి అమ్మ ఆ ముందురోజు రాత్రే చనిపోయిందట. బయట పడుకోబెట్టేశారు. దండలు కూడా వేసేశారట. కానీ.. కేవలం నాతో ‘అమ్మా’ అని పిలిపించుకోవడం కోసమే ఆమె మళ్లీ బతికింది. వైద్యశాస్త్రం ఇది అసంభవం అనొచ్చు. కానీ... కర్మ సిద్ధాంతాన్ని నమ్మే దేశంలో పుట్టిన వ్యక్తిగా దాన్ని నేను నమ్ముతాను. (కళ్లల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా..) అమ్మ విషయంలో నా తప్పు తెలుసుకున్నాను. కానీ... తప్పు తెలుసుకునేలోపే అమ్మే నాకు కరువైపోయింది. ఆ భగవంతుడు నాకు వేసిన పెద్ద శిక్ష అమ్మను దూరం చేయడం. బాధపడకండి సార్... అమ్మ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అది సరే.. రేలంగి వెంకట్రామయ్యగారు మీకేమైనా బంధువా? మా నాన్నకు కజిన్ రేలంగి గారు. నాకు పెదనాన్న అవుతారు. అయితే... నాకు ఆయనతో పరిచయం లేదు. ఆయన్ను తొలిసారి నేను చూసింది ‘రాధమ్మపెళ్లి’ షూటింగ్లో. గురువుగారే దర్శకుడు. అందులో రేలంగి గారిది మంచి వేషం. టి.నగర్‌లోని ఆయన ఇంటి దగ్గరే షూటింగ్. నేను ఆయన బంధువునైనా ఏనాడూ ఆయన ఇంటికి కూడా వెళ్లలేదు. బంధుత్వం కలుపుకొని ఎదగాలనుకునే తత్వం కాదు నాది. అయితే... షూటింగ్ గ్యాప్‌లో ఓ సారి ఆయనే ‘ఏవయ్యా... ఇలా రా’ అని పిలిచారు. వెళ్లాను. ‘నీ పేరు రేలంగి నరసింహారావా? ఏ ఊరు నీది’ అనడిగారు. ‘పాలకొల్లండీ’ అని చెప్పాను. ‘ఎవరబ్బాయివేంటి?’ అనడిగారు. ‘రేలంగి రంగనాయకులుగారి అబ్బాయిని’ అని చెప్పాను. ‘ఓ హో... రంగడి కొడుకువా? వెరీగుడ్ వెరీగుడ్’ అనీ... ‘ఏమీ లేదయ్యా... మీ గురువు... నిన్ను తిడుతున్నాడో నన్ను తిడుతున్నాడో అర్థం కావడం లేదు. అయినా... నన్ను తిట్టేంత ధైర్యం అతనికి ఎక్కడుంది కానీ... నువ్వు ఓ పనిచేయ్. ‘నరసింహారావు’ అని పిలిపించుకో. రేలంగిని నేను ఉన్నానుగా’ అన్నారు ఆయన శైలిలో. నాకేమో ఓ వైపు నవ్వు, మరో వైపు... టెన్షన్. ‘అలా కాదండీ... గురువుగారి దగ్గరకెళ్లి అలా చెప్పలేనండీ’ అన్నాను. ‘అయితే ఓ పని చేసేయ్. ఈ సినిమా వరకు మానేయ్’ అన్నారు. ‘మా గురువుగారు మధ్యలో మానొద్దన్నారండీ’ అన్నాను. ‘ఏం గురువుగారయ్యా... అస్తమానం గురువుగారు.. గురువుగారు అనీ... పోనీ ఓ పనిచెయ్. పక్కనున్నవాళ్లతోనైనా ‘నరసింహారావు’ అని పిలిపించుకో. అప్పుడు మీ గురువు కూడా ‘నరసింహారావు’ అనే పిలుస్తాడు ఏమంటావ్’ అన్నారు. ‘సరే సార్’ అన్నాను. ఓ రెండ్రోజుల తర్వాత నిదానంగా గురువుగారికే ఈ విషయం చెప్పాను. ఆయన తాపీగా... ‘అలా అన్నారా!’ అన్నారు. అప్పట్నుంచీ షూటింగ్ అయ్యేంతవరకూ నన్ను ‘ఇదిగో ఇలా రా!’ అని పిలిచేవారు కానీ... ‘రేలంగీ...’ అనేవారు కాదు. రేలంగి గారితో నా తొలి అనుభవం అది. మీ కుటుంబం గురించి చెప్పండి? నా భార్య పేరు సాయిలక్ష్మి. పెద్దబ్బాయి హిప్నో థెరీపీ కోర్స్ చేశాడు. పాస్ట్‌లైఫ్ థెరపీ కూడా చేస్తాడు. ప్రస్తుతం చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిన్నవాడు అమెరికాలోని లాస్ఏంజిల్స్లో ఉద్యోగం. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. మనవళ్లు, మనవరాళ్ళు కోసం ఎదురుచూస్తున్నా. - బుర్రా నరసింహ ఆ విషయంలో చంద్రమోహనే నా గురువు! దర్శకునిగా నాకు గురువు దాసరిగారైతే.. కామెడీ విషయంలో మాత్రం చంద్రమోహన్‌గారు గురువు. ఆయనతో 24 సినిమాలు చేశాను. అన్నీ హిట్లే. బయట కూడా అద్భుతంగా నవ్విస్తారాయన. ఆయన్నుంచే నాకు హ్యూమర్ అలవడింది. గురువుగారి దగ్గర నాతోపాటు పనిచేసిన వారందరూ ఈ రోజు నన్ను చూసి ఆశ్చర్యపడుతుంటారు. ‘వీడు దర్శకుడైతే... సీరియస్ సినిమాలు తీసి జనాల్ని చంపేస్తాడ్రా’ అనేవాళ్లు అప్పుడంతా. అంత సీరియస్‌గా ఉండేవాణ్ణి. అలాంటి నేను కామెడీ డెరైక్టర్ని అయ్యానంటే... అదంతా దైవ నిర్ణయం. ఒక్క రాజేంద్రప్రసాద్గారితోనే 32 సినిమాలు చేశాను. నాకు నచ్చిన నా చిత్రాలు 1. సంసారం 2. చిన్నోడు పెద్దోడు 3. పోలీసు భార్య 4. ఎదురింటి మొగుడు-పక్కింటి పెళ్లాం 5 ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ 6. బ్రహ్మచారి మొగుడు 7. దాగుడు మూతల దాంపత్యం 8. పెళ్లానికి ప్రేమలేఖ-ప్రియురాలికి శుభలేఖ 9. మానసవీణ 10. మామా అల్లుడు