ఇండియాలోనే గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్ రేలంగి
- రాజేంద్రప్రసాద్
‘‘చాలా సంవత్సరాల తర్వాత నా శిష్యుడైన రేలంగి నరసింహారావు ఈ సినిమా డెరైక్ట్ చేశాడు. ప్రస్తుతం చిన్న సినిమాల పరిస్థితి బాగోలేకపోవడంతో తను ఈ సినిమా చేయకూడదని అనుకున్నాడు. నేను చెప్పడంతో చేశాడు. గొప్ప సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు చెప్పారు. ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మానందం, పావని ముఖ్య పాత్రల్లో రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘ఎలుకా మజాకా’. బల్లేపల్లి మోహన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దాసరి నారాయణరావు ఆవిష్కరించి, తొలి సీడీని రాజేంద్రప్రసాద్‌కు అందించారు.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ-‘‘ రేలంగి నరసింహారావుగారు తీసిన 75 సినిమాల్లో 35 సినిమాల్లో నేనే హీరో. ఇండియాలోని అతి గొప్ప స్క్రీన్‌ప్లే రైటర్స్‌లో ఆయన ఒకరు. సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో హీరోగా ఎవ రైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో నాకు ‘వెన్నెల’ కిశోర్ గురించి కొంత మంది చెప్పారు. అతనికి మంచి కామెడీ టైమింగ్ ఉంది’’ అని దర్శకుడు అన్నారు. ఈ వేడుకలో నటులు గిరిబాబు, సీనియర్ నరేశ్, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.