బ్యాంకాక్‌లో పాటల గుర్రం ఎగిరింది!
‘‘ఇలా పాటల వేడుకను విభిన్నంగా బ్యాంకాక్‌లో నిర్వహించడం చాలా బావుంది. ఇలాంటి వేడుకలు సాంస్కృతిక సమ్మేళనానికి ఉపకరిస్తాయి. థాయ్ ప్రజలకు మన పాటలు నచ్చుతాయి. ఓ థాయ్ పాపులర్ సాంగ్‌ను, నా పాపులర్ సాంగ్‌ను కలిపి ఫ్యూజన్ సాంగ్‌లా విడుదల చేయాలని ఉంది’’ అని కీరవాణి చెప్పారు. ఆయన స్వరాలందించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ ఆడియో వేడుక ఇటీవల బ్యాంకాక్‌లో జరిగింది. సుమంత్, పింకీసావిక జంటగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో పూదోట సుధీర్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని ఆరు పాటల్ని, మూడు బిట్ సాంగ్స్‌ని బ్యాంకాక్‌లోని 9 విభిన్న ప్రదేశాల్లో విడుదల చేశారు. బ్యాంకాక్‌లో ఆడియో ఆవిష్కరణ జరుపుకున్న తొలి తెలుగు సినిమా తమదే అయినందుకు చాలా ఆనందంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. కీరవాణిగారితో పనిచేయడం ఇదే తొలిసారి అని సుమంత్ చెప్పారు. వేల్ రికార్డ్స్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ఈ వేడుకలో ఇంకా కథా రచయిత కాంచీ, గీత రచయిత చైతన్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.