సైజ్ తగ్గాలని కాదు ఫిట్‌నెస్ కోసమే!
ముంబై: కఠిన వ్యాయామాలతో చెమటోడ్చి.. శరీర బరువు తగ్గించుకోవడం ద్వారా ఈ మధ్య బాలీవుడ్ చిన్నది పరిణీతి చోప్రా వార్తల్లో ఎక్కింది. దీంతో ఏంటి సైజ్‌జీరో శరీరాకృతి కోసం కష్టపడుతున్నారా? అంటే అదేమీ లేదని ఈ భామ చెప్తోంది. సన్నబడటం కంటే శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యమిస్తానని అంటోంది.
బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటినుంచి బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మగానే పరిణీతి చోప్రా పేరు తెచ్చుకుంది. తన తోటితారామణులు సన్నగా మెరుపుతీగలా ఉండటానికి ప్రాధాన్యమిస్తున్నా.. తను మాత్రం బొద్దు అందాలతో ఆఫర్లు తెచ్చుకుంది. ఈ మధ్య ఈ అమ్మడి వేగం తగ్గింది. చేతిలో పెద్దగా ఆఫర్లు కూడా లేవని టాక్. దీంతో తను కూడా కాస్తా చెమటోడ్చి.. తోటి హీరోయిన్ల మాదిరిగానే సన్నబడిందని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలను పరిణీతి కొట్టిపారేసింది.
'అవి చాలా వికృత విమర్శలు. సన్నబడటం వేరే విషయం. నేను మాత్రం స్టామినాను పెంచుకొని శరీరం మీద అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను' అని స్టార్‌డస్ట్ అవార్డ్స్ వేడుక సందర్భంగా ఆమె తెలిపింది. సన్నగా ఉండటం కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యమని తెలిపింది. ఆరు నుంచి ఎనిమిది నెలలు కష్టపడి వ్యాయామాలు చేసినందుకు ఇప్పుడు ఫలితం కనిపించడం ఆనందం కలిగిస్తోందని ఈ భామ చెప్పింది. అన్నట్టు సన్నబడ్డాక పరిణీతి చోప్రా 'బిల్ట్ దట్ వే' హాట్‌హాట్ ఫొటోషూట్‌తో కనువిందు చేసింది.