ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడను: సుబ్బరాజు
హైదరాబాద్: డ్రగ్స్ రాకెట్ వ్యవహారంలో తన పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని టాలీవుడ్ నటుడు సుబ్బరాజు అన్నారు. తనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి నోటీసులు అందినట్లు ఆయన తెలిపారు. సుబ్బరాజు మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ పోలీసు అధికారి ఇంటికి వచ్చి నోటీసులు నేరుగా చేతికే అందజేశారు. నాకు ఇచ్చిన నోటీసులు ఇంట్లో ఉన్నాయి. అందులో కొన్ని డ్రగ్స్ జాబితాను పేర్కొన్నారు. దాదాపు ఆరేడు రకాల డ్రగ్స్ పేర్లున్నాయి. విచారణకు ఈ నెల 21న రావాలని ఉంది. సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్‌తో సంబంధాలుంటాయనే విషయం చిన్నప్పటి నుంచీ వింటున్నాను. ఇంకా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీ వాళ్లకు మాత్రమే కాదు ప్రతి ఇండస్ట్రీకి డ్రగ్స్ అలవాటు ఉంటుందని' ఆయన అభిప్రాయపడ్డారు.
పది మంది డ్రగ్స్ తీసుకున్నారని వారికి నోటీసులు అందాయని చెబుతున్నారు కానీ తనకు తెలిసినంత వరకు ఈ జాబితాలో ఎవరూ డ్రగ్స్ తీసుకోరని సుబ్బరాజు చెప్పారు. ఆరోగ్యం పట్ల నేను ఎంత శ్రద్ధ తీసుకుంటానో సినీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసునన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడని తనకు డ్రగ్స్ అలవాటు చేసుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. ఎక్స్‌ట్రా సంతోషం తనకు అవసరం లేదని, ప్రస్తుతం హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు.
ఇండస్ట్రీకి చెందిన వాళ్ల ఫోన్ నెంబర్లు చాలా మంది దగ్గర ఉంటాయని, అదే విధంగా కెల్విన్ అనే వ్యక్తి మొబైల్‌లో తన ఫోన్ ఫోన్ నెంబర్ ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. కెల్విన్ నుంచి డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు, పూరీ నుంచి ఇతరులకు డ్రగ్స్ అందాయన్న ఆరోపణలను సుబ్బరాజు కొట్టిపారేశారు. మాకు సంబంధం ఉందని భావిస్తే ఆధారాలతో ప్రూవ్ చేయాలన్నారు. వ్యవస్థకు తాను ఎప్పుడూ వ్యతిరేకంగా వెళ్లనని విచారణకు కచ్చితంగా హాజరవనున్నట్లు ఆర్టిస్ట్ సుబ్బరాజు తెలిపారు.