ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నట్లనిపించింది! | Exclusive Interview With Hero Ram | Sakshi
Sakshi News home page

ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నట్లనిపించింది!

Published Thu, Oct 1 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నట్లనిపించింది!

ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నట్లనిపించింది!

 స్మయిల్... స్టయిల్... ఎనర్జీ... ఈ మూడింటినీ మిక్స్ చేస్తే రామ్. ఆన్‌స్క్రీన్‌లోనైనా, ఆఫ్ స్క్రీన్‌లోనైనా రామ్ చురుకుదనం చూస్తే... చిన్నప్పుడు బూస్ట్, హార్లిక్స్, బోర్నవిటా, కాంప్లాన్ అన్నీ కలగలిపి తాగేశాడేమో అనిపిస్తుంది. యూత్, మాస్ హార్ట్స్‌లో తనదైన సిగ్నేచర్ చేసిన రామ్ రేపు ‘శివమ్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా గురించి, కెరీర్ గురించి బోలెడన్ని క్వశ్చన్స్ అడిగితే టకటకా ఆన్సర్లు చెప్పేశారు రామ్.
 
  సరిగ్గా నాలుగు నెలల క్రితం పండగ చేసుకున్నారు. ఇప్పుడు శివమెత్తడానికి రెడీ అయ్యారు..?
 (నవ్వుతూ...) అవునండి. నాలుగు నెలల గ్యాప్‌లో రెండు సినిమాలతో తెరపై కనిపించడం హ్యాపీగా ఉంది. ‘పండగ చేస్కో’ హిట్టవడం ఎంకరేజింగ్‌గా అనిపించింది. శ్రీనివాస రెడ్డి డెరైక్ట్ చేసిన ‘శివమ్’ కూడా బాగుంటుంది.
 
  ‘శివమ్’లో ఏం చేస్తారేంటి?
 లైఫ్‌లో పుట్టుకా, చావనేది మన చేతుల్లో ఉండదు. కానీ, పెళ్లి మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకని నచ్చిన అమ్మాయి దొరికితే, ఆ అమ్మాయిని దక్కించుకోవడం కోసం ఫైట్ చెయ్ అని ఈ చిత్రంలో చెబుతాం. కొంతమంది అగ్రెసివ్‌గా ఉంటారు. ఆ క్షణంలో ఏదనిపిస్తే, అది చేసేస్తారు. ఇందులో నేను అలాంటి అబ్బాయిని. అందులోనే ఫన్ ఉంటుంది.  
 
  రాశీఖన్నాతో మీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి?
 ‘పండగ చేస్కో’ కోసం తొమ్మిది కిలోలు తగ్గా. ఈ సినిమాకి పెరిగా. ఈ చిత్రానికి రాశీ ఖన్నాను అనుకున్నప్పుడు, బబ్లీగా ఉంటుంది కాబట్టి, మా జంట బాగుంటుందా అనుకున్నాం. కానీ, నేను కూడా బరువు పెరగడంతో పెయిర్ బాగుంది.
 
  ఆ మధ్య మీరు నటించిన చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ సమయంలో ఎలా ఫీలవుతుంటారు?
 ఫ్యాన్స్‌నీ, బయ్యర్స్‌నీ డిజప్పాయింట్ చేశాం అని రెండు, మూడు రోజులు గిల్టీగా ఉంటుంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ ఫీలింగ్ ఎక్కువగా ఉండేది. ‘జగడం’ అప్పుడు చాలా బాధపడ్డాను. ఎవరితోనూ మాట్లాడే వాణ్ణి కాదు. రెండు నెలలు ఎవర్నీ కలవలేదు.  ఆ రెండు నెలలు లవ్ ఫెయిల్యూర్‌లో ఉన్నట్లనిపించింది. నాకూ, సుక్కూ (దర్శకుడు సుకుమార్)కీ ఆ సినిమా మీద చాలా నమ్మకం. కానీ, మా నమ్మకం వమ్ము అయింది.
 
  మీ రీసెంట్ హిట్ ‘పండగ చేస్కో’ పూర్తి సంతృప్తి మిగిల్చిందా?
 కమర్షియల్‌గా హ్యాపీ. కానీ, చిన్న వెలితి ఉంది. అది ఏంటనేది తెలియదు. ఇంకొంచెం డిఫరెంట్‌గా ఉంటే బాగుండేది.
 
  సెకండాఫ్‌లో విలనింట్లో హీరో సెటిలవడం రొటీన్ అనిపించిందేమో!
 నిజమే. అదే వెలితి అనిపించిందేమో. యాక్చువల్‌గా ముందు కథలో అది లేదు. ఆ తర్వాత అలా అయిపోయింది. ‘శివమ్’లో మాత్రం ఎవరింట్లోనూ దూరను (నవ్వుతూ). రాబోయే చిత్రాల్లో అలాంటి ఎపిసోడ్స్ లేకుండా జాగ్రత్త పడతా.
 
 జనరల్‌గా మీరు కథలు సెలక్ట్ చేసుకునే తీరు ఎలా ఉంటుంది?
 కథ వినే ముందే సినిమా చూడ్డానికి వెళుతున్నట్లుగా అనుకుంటా. కథను విజువలైజ్ చేసుకుంటా. సో... కథ వింటు న్నప్పుడే సినిమా చూసేస్తా. బాగుందనిపిస్తే, ఒప్పుకుంటా.
 
  మీరెక్కువ కమర్షియల్ ఫిల్మ్స్‌కే పరిమితమవుతున్నట్లున్నారు.
 చాలా ప్రయోగాలు కూడా చేశా. అవి ఆదరణ పొందక పోవడంతో హిట్ అయిన నా కమర్షియల్ సినిమాలే గుర్తుంటు న్నాయి. ‘దేవదాసు’ కమర్షియల్ హిట్. ‘జగడం’ ఓ ప్రయోగం. ‘రెడీ’ ఓ ట్రెండ్ సెట్టర్. ‘మస్కా’ రెగ్యులర్ కమర్షియల్ మూవీ. ‘గణేశ్’ పిల్లల కోసం చేశా. ’ఎందుకంటే ప్రేమంట’ ఓ ప్రయోగం. ‘కందిరీగ’ కమర్షియల్ మూవీ. ‘ఒంగోలు గిత్త’ మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్‌తో చేశాం. ‘మసాలా’లో చేసిన ‘గే’ పాత్ర కూడా ప్రయోగమే. ‘పండగ చేస్కో’ కమర్షియల్ హిట్ మూవీ. నేను చేసిన ప్రయోగాలు హిట్ కాకపోవడంతో వెలుగులోకి రావడంలేదు.
 
  ఇక ప్రయోగాలకు దూరమా?
 దూరంగా ఉండను. కానీ, కమర్షియల్ ఎలి మెంట్స్ ఉండేలా చూసుకుంటా. ‘ఎందుకంటే ప్రేమంట’ ఈ తరహా మూవీనే. టీవీల్లో వచ్చినప్పుడు చూసి, చాలా బాగుంది అంటుంటారు. థియేటర్లో ఎందుకు చూడలేదో తెలియడం లేదు. టీవీలో చూసి, బాగుందన్నప్పుడు కోపం వస్తుంది (నవ్వుతూ).
 
  ఓకే. ‘పండగ చేస్కో’, ‘శివమ్’, ‘హరికథ’... ఒకేసారి మూడు సినిమాలు చేయడం కష్టం అనిపించలేదా?
 ఏప్రిల్ 10న పొల్లాచ్చిలో ‘హరికథ’, 11న హైదరాబాద్‌లో ‘శివమ్’, 12న ఆర్‌ఎఫ్‌సీలో ‘పండగ చేస్కో’ షూటింగ్స్ చేశా. అంటే మూడు రోజుల్లో మూడు రకాల పాత్రల్లో ఒదిగిపోవా లన్నమాట. కొంచెం టైర్డ్‌గానే ఉంటుంది. కానీ, దర్శకులు ఇచ్చే జోష్‌తో అలసటపోతుంది. ఈ చిత్రాల దర్శకులు అలాంటివాళ్ళే.
 
 మీరెక్కువగా మీ సొంత సంస్థలోనే చేస్తుంటారు. కారణం?
 డెరైక్టర్ కథ చెప్పడానికి వచ్చినప్పుడు నిర్మాతను కూడా సెలక్ట్ చేసుకుంటే వాళ్లకే ఓకే చెప్పేస్తాను. కేవలం కథతో మా దగ్గరకు వస్తే, అప్పుడు మా బేనర్లోనే చేస్తాం. కథలు కూడా ముందు పెదనాన్నగారు (స్రవంతి రవికిశోర్) వింటారు. ఆయన ముప్ఫయ్యేళ్ల అనుభవం నాకు హెల్ప్ అవుతుంది.
 
 హీరోగా మీ స్థానం ఏంటి?
 ప్రతి శుక్రవారం మారిపోయే స్థానం గురించి పెద్దగా పట్టించుకోను. ఇక్కడ హిట్ ముఖ్యం. స్థానం గురించి ఆలోచించే బదులు మంచి స్క్రిప్ట్స్ వెతుక్కునే పని మీద ఉంటే మంచిది. అలా కాకుండా స్థానాన్ని ఎనలైజ్ చేసుకుంటూ ఉంటే స్క్రిప్ట్స్ చేజారిపోతాయ్. రజనీ కాంత్ రేంజ్‌కి వెళ్లినా ఇంకా పెరిగితే బాగుంటుంది అనిపిస్తుంది. రేంజ్ అనేది ‘నెవర్ ఎండింగ్ ప్రాసెస్’. చేసే పాత్రలను నేనెక్కువగా ఎనలైజ్ చేసుకుంటూ ఉంటా. ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది? అనే విషయం మీద దృష్టి పెడతాను.
 
 ‘హరికథ’ ఎందాకా వచ్చింది?
 కిశోర్ తిరుమల దర్శకత్వంలో తయారవుతున్న ‘హరికథ’ 70 శాతం పైగా పూర్తయ్యింది. డిసెంబర్‌లో విడుదల చేస్తాం.
 
  తమిళంలో మంచి  ఇంట్రడక్షన్ కోసం చూస్తున్నా!
 చెన్నైలో పుట్టి, పెరగడం వల్ల నాకు తమిళం బాగా వచ్చు. ఎంత బాగా అంటే, ‘ఎందుకంటే ప్రేమంట’ డబ్బింగ్‌కి తెలుగులో వారం రోజులు తీసుకుంటే, తమిళంలో రెండు రోజుల్లో చెప్పేశాను. తెలుగులో ‘దేవదాస్’ నాకు మంచి ఇంట్రడక్షన్ అయ్యింది. తమిళంలో కూడా అలాంటి చిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుంది. ఆరేడేళ్లుగా తమిళంలో మంచి సినిమా చేయాలనే ప్రయత్నం మీద ఉన్నా.
 
 ‘ర్యామ్’డమ్ థాట్స్
  ఎందులో ఆనందం ఉందో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుని పని చేస్తే జీవితం ఆనందంగా ఉంటుంది.   ఒక సీన్ ఎలివేట్ అయ్యేలా డైలాగ్స్ రాసేవాడు రైటర్. ఒక డైలాగ్ ఎలివేట్ అయ్యేలా సీన్ తీసేవాడు డెరైక్టర్.  ఎవరైనా ఏదైనా అన్నా... అనుకున్నా... అనకుండా ఉన్నా... నువ్వు అనుకున్నదేదో చేసెయ్.  ప్రాణం చాలా విలువైనది. దాన్ని బలి చేయకు. నీ కోసం బ్రతకడం ఇష్టం లేనప్పుడు, అవతలివాళ్ల కోసం బ్రతకడం మొదలుపెట్టు.  ఐయామ్ గుడ్ అనుకుంటే పైకి వస్తావ్. ఐయామ్ గాడ్ అనుకుంటే పైకి పోతావ్. ఒక్క అక్షరమే తేడా.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement