ఈ సినిమాకు ముందు ఆమెను అనుకోలేదు
హైదరాబాద్: రాణీ రుద్రమదేవి అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. చదువుకొనేటపుడే కాకతీయుల రాణి రుద్రమదేవి శౌర్య, పరాక్రమాల గురించి విన్నప్పుడు చాలా గొప్పగా అనిపించిందని, ఆ కథ అలా తనను వెన్నాడుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అందుకే ఎంత కష్టమైనా రుద్రమదేవి కథను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాని ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోసం తొమ్మిదేళ్లు పరిశోధనలు చేశానన్నారు. ఇది కాకతీయుల పరిపాలన, చరిత్రకు సంబంధించిన సినిమా కాబట్టి ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే పలువురు సినీపెద్దలు, చరిత్రకారులతో చర్చించానన్నారు. వారి సూచనలు, సలహాలు పాటిస్తూ చాలా ప్రతిష్ఠాత్మకంగా రుద్రమదేవి కథను తెరకెక్కిస్తున్నామని గుణశేఖర్ ప్రకటించారు. వాస్తవాలను ప్రతిబింబిస్తూ చాలా సమగ్రంగా, పరిపూర్ణంగా సినిమాను చిత్రీకరించామన్నారు.
అలాగే ఈ సినిమా కోసం అసలు ముందు అనుష్క గురించి ఆలోచించలేదని తెలిపారు. స్నేహితులు, ఇండస్ట్రీ పెద్దల సలహాతో అనుష్కను రుద్రమదేవి పాత్ర కోసం ఎంచుకున్నామని తెలిపారు. ఆమె రుద్రమదేవి పాత్రకు న్యాయం చేకూర్చారన్నారు. నిజంగా అనుష్క సహకారం లేకపోతే రుద్రమదేవి ఇంత బాగా తీయలేకపోయేవాడినని అనుష్కపై ప్రశంసలు కురిపించారు.
కాగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' సినిమాను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు దర్శకుడు గుణశేఖర్ ప్రకటించారు. దీన్ని ముందు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పారు. 3డీ సీజీ టెక్నాలజీలో తెరకెక్కించామని అజయ్ విన్సెంట్ కెమెరా పనితనం, ఇళయరాజా రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ పాయింట్లు అవుతాయని అభిప్రాయపడ్డారు. కథను ఇళయరాజా అద్భుతంగా ఎలివేట్ చేశారన్నారు. ఈ సందర్భంగా 'రుద్రమదేవి' ఆండ్రాయిడ్ యాప్ విడుదల చేశారు. రానా, అల్లు అర్జున్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కేథరీన్ త్రెసా తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.