మన్మథ రేఖ నా ఆలోచనే!
‘‘బాహుబలి’ మినహా ఇటీవల తెలుగులో పెద్దగా సీక్వెల్స్ రాలేదు. ఏదైనా సినిమాకు సీక్వెల్ తీస్తే బాగుంటుందనిపించింది. పైగా, నాకు ఎప్పటి నుంచో గ్రామీణ నేపథ్యంలో ఓ చిత్రంతో పాటు, వంశీగారితో ఓ సినిమా చేయాలని ఉండేది. ఆ రెండూ ‘ఫ్యాషన్ డిజైనర్’తో సెట్ అయ్యాయి’’ అని దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ అన్నారు. ‘స్నేహగీతం, ఇట్స్ మై లవ్‌స్టోరీ’ తదితర చిత్రాల ద్వారా అభిరుచి ఉన్న దర్శకుడిగా, ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, ఒక మనసు’ వంటి వైవిధ్యమైన చిత్రాల ద్వారా మంచి నిర్మాతగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’కు సీక్వెల్‌గా ఆయన నిర్మించిన ‘ఫ్యాషన్ డిజైనర్’ ఈ శుక్రవారం విడుదల కానుంది.
ఇందులో సుమంత్ అశ్విన్ హీరో. అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస హీరోయిన్లు. ‘మధుర’ శ్రీధర్ మాట్లాడుతూ – ‘‘ఫ్యాషన్ డిజైనర్’కు, ‘లేడీస్ టైలర్’కు సంబంధం లేదు. ఫ్యాషన్ డిజైనర్ డిఫరెంట్ కాన్సెప్ట్. సుందరం కొడుకు గోపాలం ఇప్పుడేం చేస్తుంటాడు? అన్నదే కథ. ఇది రాజేంద్రప్రసాద్‌గారు చేసిన రోల్, వంశీగారు డైరెక్ట్ చేస్తున్నారని సుమంత్ జాగ్రత్తగా చేశాడు. తన నటనకు నేను సంతృప్తి చెందా. వంశీగారిని లోతుగా అర్థం చేసుకుంటే ప్రయాణం హ్యాపీ, సరదాగా పని చేయొచ్చు. ‘ఫ్యాషన్ డిజైనర్’లో హీరోకి మన్మథ రేఖ ఉంటుంది. మన్మథ రేఖ ఉండటం అనే ఆలోచనే నాదే. ఆ రేఖ ఉన్నవాళ్లు అమ్మాయిలతో కాసేపు మాట్లాడితే ఇంప్రెస్ అయిపోతారు. సిటీకొచ్చి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఆశ హీరోకి ఉంటుంది. మణిశర్మ సంగీతం, రీ–రికార్డింగ్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు’’ అన్నారు.