దుమ్మురేపుతున్న 'ఫిదా' వసూళ్లు
బాక్సాఫీస్ వద్ద 'ఫిదా' జోరు కొనసాగుతోంది. మూడు వారంలోనూ ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతుండడంతో కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా విడుదలైన సినిమాలేవి కనీస పోటీ ఇవ్వలేకపోడంతో 'ఫిదా'కు తిరుగులేకుండా పోయింది. జూలై 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రెండు వారాల్లో రూ. 60 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండో వారంలో రూ.11.05 కోట్ల షేర్ అందుకుంది.
ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో సెకండ్ వీక్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది. బాహుబలి 2, ఖైదీ నంబర్ 150 సినిమాలు దీనికంటే ముందున్నాయి. రెండో వారం కలెక్షన్లలో ఫిదా కంటే కాటమరాయుడు, డీజే- దువ్వాగ జగ్ననాథం వెనుకబడివున్నాయి.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'ఫిదా' అమెరికాలోనే రెండు వారాల్లో రూ.11.10 కోట్లు రాబట్టింది. ఓవర్‌సీస్‌లో 2 మిలియన్ల మైలురాయిని చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రేక్షకుల ఆదరణ ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమని భావిస్తున్నారు.