'ఫిదా' మూవీ రివ్యూ | Fidaa Movie Review | Sakshi
Sakshi News home page

'ఫిదా' మూవీ రివ్యూ

Published Fri, Jul 21 2017 1:38 PM | Last Updated on Tue, Sep 5 2017 4:34 PM

Fidaa Movie Review

టైటిల్ : ఫిదా
జానర్ : రొమాంటిక్ లవ్ స్టోరీ
తారాగణం : వరుణ్ తేజ్, సాయి పల్లవి, సాయి చంద్, రాజా, శరణ్య ప్రదీప్
సంగీతం : శక్తికాంత్
దర్శకత్వం : శేఖర్ కమ్ముల
నిర్మాత : దిల్ రాజు



మెగా వారుసుడిగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్, చాలా కాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆనంద్, హ్యాపిడేస్ లాంటి సినిమాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తరువాత ఫాం కోల్పోయి కష్టాల్లో పడ్డాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిదా. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఫిదా.. వరుణ్ కు కమర్షియల్ స్టార్ ఇమేజ్ తీసుకురావటంతో పాటు, దర్శకుడు శేఖర్ కమ్ములను సక్సెస్ ట్రాక్ ఎక్కించిందా..?


కథ :
అమెరికాలో డాక్టర్ చదువుతున్న వరుణ్ (వరుణ్ తేజ్).. అన్న రాజా, తమ్ముడు బుజ్జితో కలిసి ఉంటుంటాడు. తల్లీ తండ్రి లేకపోవటంతో వరుణ్, బుజ్జిలే రాజాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఉండే రేణుక (శరణ్య ప్రదీప్) అనే అమ్మాయితో రాజా పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం ఇండియాకు వచ్చిన వరుణ్, పెళ్లి కూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) తో ప్రేమలో పడతాడు. భానుమతికి కూడా వరుణ్ అంటే ఇష్టం కలుగుతుంది.

కానీ తన తండ్రిని వదిలి వెళ్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అదే సమయంలో వరుణ్ తన మామయ్య కూతురు శైలుతో క్లోజ్ గా ఉండటం చూసి మరింతగా దూరమవుతుంది. రాజా పెళ్లి తరువాత అన్నా వదినలతో కలిసి అమెరికా వెల్లినా వరుణ్, భానుమతిని మర్చిపోలేకపోతాడు. చివరకు భానుమతికి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ భానుమతి వరుణ్ కి నో చెపుతుంది. తరువాత వరుణ్, భానుమతి మనసు ఎలా గెలుచుకున్నాడు..? తండ్రి వదిలి వెల్లటం ఇష్టం లేని భానుమతి, వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుందా..? అన్నదే మిగతా కథ.


నటీనటులు :
వరుణ్ తేజ్.. ఎన్నారై అబ్బాయిగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. లవర్ బాయ్ లుక్స్ తో అదరగొట్టాడు. రొమాంటిక్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లోనూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన మలయాళీ బ్యూటీ సాయి పల్లవి అందరినీ ఫిదా చేసింది. తెలంగాణ అమ్మాయిగా రఫ్ అండ్ టఫ్ రోల్ లో మెప్పించింది. అల్లరి అమ్మాయిగా బబ్లీగా కనిపిస్తూనే ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సాయిచంద్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర పాత్రల్లో రాజా, శరణ్య ప్రదీప్, సత్యం రాజేష్ లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
కొంత గ్యాప్ తరువాత ఫిదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ చూపించారు. క్యూట్ లవ్ స్టోరిని తనదైన టేకింగ్ లో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించారు. తన స్టైల్ లోనే ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా సాగే కథలో అద్భుతమైన ఎమోషన్స్ పండించారు. ఇప్పటి వరకు కాలేజ్, కాలనీ బ్యాక్ డ్రాప్ లనే ఎక్కువగా ఎంచుకున్న శేఖర్, ఈ సినిమాతో తెలంగాణ పల్లెటూళ్లను మరింత అందంగా చూపించాడు. కేవలం పరిస్థితులు, యాస మాత్రమే కాదు సాంప్రదాయాలను కూడా చాలా బాగా తెరకెక్కించాడు. శక్తికాంత్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని పెంచాయి. తెలంగాణ బాణీలో సాగే 'వచ్చిండే..' పాట విజువల్గా కూడా సూపర్బ్. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్, తెలంగాణ పల్లె వాతావరణాన్ని, అమెరికా లోకేషన్స్ ను చాలా అందంగా చిత్రీకరించాడు. మార్తండ్ కె వెంటేష్ ఎడిటింగ్ పరవాలేదు. సినిమా నిడివి ఇంకాస్త తగ్గించి ఉంటే మరింత ఆకట్టుకునేది. దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా రిచ్ గా సినిమాను తెరకెక్కించాడు.



ప్లస్ పాయింట్స్ :
వరుణ్, సాయి పల్లవి నటన
కామెడీ, ఎమోషనల్ సీన్స్

మైనస్ పాయింట్స్ :
సినిమా నిడివి
క్లైమాక్స్

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement