
సీనియర్ ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయమవుతోన్న విషయం తెలిసిందే. రాము కొప్పుల దర్శకత్వంలో దివ్య విజయ్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఈ మాయ పేరేమిటో’ అనే టైటిల్ ఖరారు చేశారు. కావ్యా థాపర్ కథానాయిక. సినిమాలోని కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ– ‘‘నన్ను ఎంతో ఆదరించిన ఇండస్ట్రీకి మా అబ్బాయి రాహుల్‌ని హీరోగా, అమ్మాయి దివ్యని నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది.
రాము కొప్పులగారు మంచి కథను అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయి, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అన్నారు రాము కొప్పుల. ‘‘రాముగారు సినిమాను అందంగా తీశారు. ఈ చిత్రం అందరూ ఎంజాయ్ చేసేలా ఎంటర్‌టైనింగ్‌గా, కూల్‌గా ఉంటుంది’’ అన్నారు రాహుల్ విజయ్. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు దివ్యా విజయ్. ఈ చిత్రానికి ఫైట్స్: విజయ్, ఎడిటర్: నవీన్ నూలి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు.
Comments
Please login to add a commentAdd a comment