
కమలహాసన్‌ను అభినందిస్తున్న ప్రముఖ నటుడు ప్రభు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్
ఐదేళ్ల నుంచి ఆరు పదుల వరకు సినీ కళామతల్లికి విశేష సేవలందిస్తున్న వారెవరైనా ఉన్నారంటే వారిలో ఆద్యుడు కమలహాసన్. కళామతల్లి ఆరాధ్యుడు. నటననే శ్వాసిస్తూ నటన అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా జీవిస్తున్న కమలహాసన్‌కు అత్యుత్తమ అవార్డులు వరించడంలో విశేషం ఏముంది. అవార్డులకే అలంకారంగా మారిన ఈ సకల కళావల్లభుడు చేయని పాత్ర ఉందనే సాహసం ఎవరూ చేయలేరు. ఇప్పటికే గౌరవ డాక్టరేట్, కలైమామణి, ఫిలింఫేర్, పద్మశ్రీ వంటి అవార్డులకు సొంతం చేసుకున్న కమలహాసన్ తాజాగా పద్మభూషణ్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
కమలహాసన్‌కు పద్మభూషణ్ రావడంపై పలువురు చిత్ర ప్రముఖులు శుక్రవారం అభినందనల జల్లు కురిపించారు. ఆయన్ను అభినందించిన వారిలో సీనియర్ దర్శకుడు ఎస్‌పీ ముత్తురామన్, ప్రభు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, ఉదయనిధి స్టాలిన్, నిర్మాత టి.శివ, త్యాగరాజన్, జ్ఞానవేల్‌రాజ, వెంకట్ ప్రభు, సుబ్బు, ధరణి, రచయిత వెన్నెల కంటి, శశికుమార్, కార్తీక్‌రాజా, ఎస్.వి.శేఖర్, క్రేజీ మోహన్ ఉన్నారు.