అడ్డంకులు తొలగి.. 'పులి' విడుదల
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన పులి ఆర్థిక పరమైన సమస్యల కారణంగా కాస్త ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. గురువారం ఉదయం 4 గంటల షోతోనే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా క్యూబ్ సంస్థకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించని కారణంగా ఆలస్యం అయినట్టు చెపుతున్నారు. బుధవారం పులి యూనిట్ సభ్యుల ఇళ్ల పై జరిగి ఆదాయ పన్ను దాడులే ఈ ఆలస్యానికి కారణంగా భావిస్తున్నారు.
నిర్మాతలతో పాటు హీరో విజయ్, ఇతర యూనిట్ సభ్యులు చొరవ తీసుకోవటంతో బెనిఫిట్ షోస్ మిస్ అయినా మార్నింగ్ షో టైంకు కొన్ని ప్రాంతాలలో సినిమా విడుదలైంది. అయితే అన్ని ప్రాంతాల్లో విడుదలకు మాత్రం మరి కాస్త సమయం పట్టనుంది. ప్రస్తుతానికి మదురై, సేలం లాంటి ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన మొదలైనట్టు హీరోయిన్ హన్సిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
కోలీవుడ్లో సాధారణంగా పెద్ద హీరోల సినిమాలను తెల్లవారుజామున 4 గంటలకు, 5 గంటలకు ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తారు. కానీ గురువారం ఇవేవీ ప్రదర్శించలేదు. అనుకున్న సమయానికి సినిమా విడుదల కాకపోవడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ధర్మపురి, సేలంలో థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళన చేశారు. మదురైలో బస్సులను ధ్వంసం చేశారు.
ఐటీ దాడుల కారణంగా ఎగ్జిబిటర్లకు చెల్లింపులు చేయడానికి ఆదాయపన్ను అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉందని, అందువల్లే సినిమా ఆలస్యం అయినట్టుగా తెలుస్తుంది. బ్యాంకులు తెరిచిన తర్వాత చెల్లింపులు జరిగి, ఆ తర్వాతే సినిమా విడుదలైందని అంటున్నారు. భారీ బడ్జెట్ తో విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తుండగా, శ్రీదేవి, సుధీప్, ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
All issues sorted ... It's time to Roar . It's time for #puli ☺️☺️ it's #showtime