అన్నానగర్: చెన్నైలో గురువారం నటుడు విజయ్ సినిమా షూటింగ్ సెట్‌లో అగ్నిప్రమాదం ఏర్పడింది. వివరాలు.. విజయ్ నటిస్తున్న 63వ సినిమాను డైరెక్టర్ అట్లి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నై మీనంబాక్కంలోని బిన్నిమిల్లు ప్రాంతంలో ఆలయం, ఆస్పత్రి, మెడికల్ దుకాణాలు, పాఠశాల సెట్ వేశారు. కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతూ వచ్చింది. ఈ స్థితిలో గురువారం మధ్యాహ్నం సమయంలో షూటింగ్ కోసం కొత్తగా సెట్ వేసే పనిలో కార్మికులు నిమగ్నమయ్యారు. ఇనుప కమ్మీలను వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు అక్కడున్న ఎండిన ఆకులపై పడి మంటలు వ్యాపించాయి. క్రమంగా మంటలు సెట్ అంతటా వ్యాపించాయి. వెంటనే కార్మికులు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగమండలంగా మారింది.
దీనిపై సమాచారం అందుకున్న గిండి, తాంబరం, శానిటోరియం ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి సుమారు నాలుగు గంటల సేపు పోరాడి మంటలను అదుపుచేశారు. గురువారం సినిమా షూటింగ్ లేకపోవడం వల్ల ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదంలో రూ. లక్షల విలువైన సామగ్రి, సినిమా సెట్ కాలి బూడిదయ్యాయి. దీనిపై మీనంబాక్కం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment