రొమాంటిక్.. థ్రిల్లింగ్.. హీరో
విజయాలు చాలామందికి వస్తాయి. కానీ, ఆ విజయాల కోసం సాగించే ప్రయాణం కూడా ఆహ్లాదంగా, వైవిధ్యంగా ఉండడం కొందరికే సాధ్యం. యువ హీరో నాని... ఇప్పుడు ఇలా విజయాలతో పాటు ఆ ప్రయాణమూ ఆహ్లాదంగా ఉండేలా చూసుకొంటున్న కొద్దిమంది నటుల్లో ఒకరు. మధ్యలో కొంత జోరు తగ్గినట్లనిపించినా, సహజమైన నటనతో, యువతరానికి బాగా దగ్గరై, వరుసగా మూడు విజయాలతో ఊపు మీద ఉన్నారు.
ఇటీవల ఆయన నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘భలే భలే మగాడివోయ్’, తాజాగా ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ - మూడూ వైవిధ్యభరిత కథలు, పాత్రలే! ఈ వైవిధ్యానికీ, సక్సెస్ లకూ తగ్గట్లే మరో కొత్త చిత్రంతో సిద్ధమవుతున్నారు. గతంలో ‘అష్టాచమ్మా’ ద్వారా కెరీర్‌కు కొత్త ఊపు తెచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు. ‘చిన్నోడు - పెద్దోడు’తో నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టి, ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ లాంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత.
సురభి, నివేదా థామస్‌లు హీరోయిన్లు. ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు కావడంతో, ఈ చిత్రంలో నాని లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ ఈ చిత్ర విశేషాలు తెలియజేస్తూ, ‘‘ఇదొక అందమైన రొమాంటిక్ థ్రిల్లర్. థ్రిల్‌కు గురి చేసే అంశాలు, మంచి రొమాన్స్, సెంటిమెంట్, వినోదం - ఇలా అన్నీ ఈ కథలో కుదిరాయి’’ అన్నారు. డేవిడ్ నాథన్ కథ అందించగా, మోహనకృష్ణ స్క్రీన్‌ప్లే, మాటలు రాశారు. మణిశర్మ బాణీలకు సీతారామశాస్త్రి, రామ జోగయ్యశాస్త్రి, కృష్ణకాంత్ సాహిత్యం సమకూరుస్తున్నారు.
అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, ‘సత్యం’ రాజేశ్ తదితరులు పాత్రధారులు. పరుచూరి మోహన్, రషీద్ అహ్మద్‌ల నిర్మాణ నిర్వ హణలో డిసెంబర్ 2న మొదలైన ఈ చిత్రం ఇప్పటిదాకా హైదరాబాద్ పరిసరాల్లో షూటింగైంది. ‘‘ఇప్పటికి 40 శాతం పూర్తయింది. ఈ 22 నుంచి మార్చి 6 వరకు కొడెకైనాల్‌లో కొంత టాకీ, పాట చిత్రీకరిస్తున్నాం. మార్చి 14 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిపే షెడ్యూల్‌తో సినిమా దాదాపు పూర్తి అవుతుంది’’ అని కృష్ణప్రసాద్ తెలిపారు.
ఇంకా టైటిల్ ప్రకటించని ఈ చిత్రాన్ని మే చివరి వారానికి ప్రేక్షకుల ముందుకు తేవాలని ప్రయత్నం. నాని కూడా ‘అష్టాచమ్మా’తో తనను తీర్చిదిద్దిన ఇంద్రగంటి, సహనటుడు అవసరాల శ్రీనివాస్‌లతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. బర్త్‌డే బాయ్ లుక్... యూనిట్‌లోని నట, సాంకేతిక నిపుణుల జాబితా చూస్తుంటే, నాని సక్సెస్‌ట్రాక్‌లో ముందుకు సాగడం ఖాయమే!