నిధి అగర్వాల్, సారా అలీఖాన్, శివానీ రాజశేఖర్, తారా సుతారియా
సిల్వర్ స్క్రీన్‌పై తొలిసారి నేమ్‌కార్డ్ చూసుకోక ముందే రెండో సినిమాకి అవకాశం వస్తే.. ఆ మజానే వేరు. ఒక సినిమా సెట్‌లో ఉండగానే ఇంకో అవకాశం వచ్చేస్తే గెట్ సెట్ గో అంటూ హుషారుగా పని చేస్తారు. ఇప్పుడు అలా జోరు మీద ఉన్న నలుగురు ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం.
ఫస్ట్ సినిమానే సెకండ్ సినిమా!
కథానాయికగా నటించిన తొలి సినిమా ‘కేదార్‌నాథ్’ రిలీజ్ కాకముందే బంపర్ చాన్స్ కొట్టేశారు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్. ఏకంగా రణ్‌వీర్ సింగ్ సరసన నటించే చాన్స్ కొట్టేశారు. ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందుతున్న ‘సింబా’ సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. అయితే సారా ఫస్ట్ నటించింది ‘కేదార్‌నాథ్’ చిత్రంలోనే అయినా ‘సింబా’ చిత్రం ముందు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ చిత్రం 80 శాతం కూడా పూర్తయింది. డిసెంబర్‌లో రిలీజ్ ఉంది. అటువైపు ‘కేదారనాథ్’ పలు వాయిదాల తర్వాత మార్చిలో రిలీజ్ అంటున్నారు. లెక్క ప్రకారం ఏ సినిమా ముందు రిలీజైతే అదే ఆ ఆర్టిస్ట్‌కి ఫస్ట్ సినిమా అంటారు. సో.. ‘సింబా’ని తన తొలి చిత్రంగా సారా చెబుతారేమో. ఏది ఏమైనా ఒక్క సినిమాతో కూడా వెండితెరపైకి రాకముందే రెండో సినిమాకి అవకాశం దక్కించేసుకున్నారు సారా.
తారానందం
ప్రస్తుతం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో కథానాయికగా బిజీగా ఉన్న తారా సుతారియా‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లోనూ నటించాల్సి ఉంది. బిజీగా ఉండి, డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయారంతే. అలా ఒక సినిమా కోసం వేరే సినిమా వదులుకున్న బాధ తారకు ఇక లేదు. ఎందుకంటే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సెట్స్‌లో ఉండగానే రెండో అవకాశం ఆమె డోర్ తట్టింది. ఈ రెండో సినిమా స్టార్ట్ అయ్యే సమయానికి డైరీలో డేట్స్ ఖాళీగా ఉన్నాయట. అందుకని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. సిద్ధార్ధ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్ హీరోలుగా మిలప్ జవేరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో తారకు మంచి రోల్ కూడా దక్కిందట. ఇక కరణ్ జోహర్ నిర్మిస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాలో టైగర్ ప్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. ఇందులో తారాతో పాటు కొత్తమ్మాయి అనన్య పాండే మరో కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది మేలో రిలీజ్ కానుంది.
అటు సాంబార్.. ఇటు గోంగూర
ఏదైనా ఒక లాంగ్వేజ్‌లో సినిమా రిలీజైన తర్వాత అందులో హీరోయిన్ బాగా యాక్ట్ చేసిందని పేరు వస్తే కానీ వేరే ఇండస్ట్రీలో చాన్స్ రాదు. కానీ రాజశేఖర్–జీవితల పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ మాత్రం ఆ రూల్‌ను బ్రేక్ చేశారు. తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘2 స్టేట్స్’ రిలీజ్ కాకముందే కోలీవుడ్ పిలుపు అందుకున్నారామె. తమిళ నటుడు విష్ణు విశాల్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు శివాని. వెంకటేశ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక తెలుగు ‘2 స్టేట్స్’ విషయానికి వస్తే.. ఇటీవల ‘గూఢచారి’ సినిమాతో మంచి హిట్ సాధించిన అడవి శేష్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. వెంకట్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో హిట్ సాధించిన ‘2 స్టేట్స్’ సినిమాకు ఇది రీమేక్. మేజర్‌గా కోల్‌కతాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. త్వరలో రిలీజ్‌కు సంబంధించిన వివరాలను తెలియజేయడానికి చిత్రబృందం రెడీ అవుతున్నారు. ఇలా ఇటు తెలుగు అటు తమిళ చిత్రం చేస్తూ కొన్ని రోజులు గోంగూర, కొన్ని రోజులు సాంబార్ టేస్ట్ చేస్తున్నారు శివాని.
అరుదైన అవకాశం
బాలీవుడ్‌లో ప్రూవ్ చేసుకున్న తర్వాత సౌత్ ఇండస్ట్రీకి వచ్చి... ఇక్కడ ఒక్క సినిమా రిలీజ్ కాకపోయినా సెకండ్ సినిమా చాన్స్‌ను దక్కించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. కానీ బాలీవుడ్‌లో ఒకే సినిమాలో నటించి, అదీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వనప్పుడు సౌత్‌లో తొలి సినిమా రిలీజ్ కాకుండానే రెండో చాన్స్ కొట్టేసిన హీరోయిన్స్ లిస్ట్‌ను తయారుచేస్తే అందులో కథానాయిక నిధి అగర్వాల్ ఉంటారు. సాబిర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘మున్నా మైఖేల్’లో నటించారు నిధి అగర్వాల్. కానీ సరిగ్గా ఆడలేదు. వెంటనే సౌత్ డోర్ కొట్టారు. నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘సవ్యసాచి’ ద్వారా సౌత్‌లో హీరోగా పరిచయం కానున్నారు. ఈ సినిమా నవంబర్ 2న విడుదల కానుంది. ఈ బొమ్మ థియేటర్‌లో పడకముందే ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో నటిస్తున్నారు నిధి అగర్వాల్. విశేషం ఏంటంటే.. ముందు నాగచైతన్య సరసన నటించిన నిధి రెండో సినిమాలో అతని తమ్ముడు అఖిల్‌తో జతకట్టారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ని కూడా రిలీజ్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘మిస్టర్ మజ్ను ’సినిమా డిసెంబర్‌లో విడుదల కానుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ రెండు సినిమాల్లో నిధి నటనకు మంచి మార్కులు పడితే ఆమె ఖాతాలో మరిన్ని సినిమాలు వచ్చి పడే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment