రౌడీ కామెడీ | Gabbarsingh comedians and their background | Sakshi
Sakshi News home page

రౌడీ కామెడీ

Published Mon, Oct 24 2016 11:15 PM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

రౌడీ కామెడీ - Sakshi

రౌడీ కామెడీ

పవన్‌కల్యాణ్‌గారు మా అందర్నీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టిన రోజుని జీవితంలో మేం మరచిపోలేం. సాధారణంగా ఒంటిగంటకు భోజనం చేసే ఆయన.. రెండింటి వరకూ తినకుండా వెయిట్ చేశారు. ‘ఈ రోజు మీరు నా అతిథులు’ అని చెప్పి స్వయంగా ఆయనే ప్లేట్స్ ఇచ్చి వడ్డించారు. భోజనాలు పూర్తయిన తర్వాత రెండు గంటల పాటు మాతో మాట్లాడారు.
 
బస్ ఎక్కితే చేసేది ఇదే.. పిక్నిక్‌లో చేసేది ఇదే..
ఏం తోచకపోతే చేసేదీ ఇదే.. భరించలేని ధ్వని..
కానీ, తెలిసిన రాగం.. మేనత్త కావొచ్చు.. కోడలు కావొచ్చు.. కూతురు కావొచ్చు.. బావగారు కావొచ్చు..
ఎవరు పాడినా చప్పట్లు కొడతారు. కానీ, రౌడీలు పాడారండీ... ఆ అంత్యాక్షరికి చిందులు వేశాం. ఈ రౌడీల
వెనకాల ఎన్ని ‘ఢీ’లు... ‘సాక్షి’కి ఎక్స్‌క్లూజివ్.


 
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా... - ఆంజనేయులు

మాది తణుకు. చిన్నప్పుడు చదువుకోవడం మానేసి సినిమాలు చూసేవాణ్ణి. స్టేజీల మీద డ్యాన్స్ చేస్తూ మిమిక్రీ చేసేవాణ్ణి. కామెడీ ఆర్టిస్టుగా చేయాలని ఉండేది. అవకాశాలు వెతుక్కుందామని నా భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేశాను. ఫిల్మ్‌నగర్ ఆఫీసుల చుట్టూ తిరిగేవాణ్ణి. బస్సుల్లో తిరగాలంటే టికెట్లకే బోల్డంత డబ్బు అయిపోతుంది. నా జేబులు ఎప్పుడూ ఖాళీయే. అందుకే స్టూడియోలు ఎంత దూరమైనా నడ్చుకుంటూ వెళ్లేవాణ్ణి. కృష్ణానగర్‌లో ఓ రేకుల గదిలో ఉండేవాణ్ణి. అద్దె 75 రూపాయలు. తినడానికి, అద్దె కట్టడానికి డబ్బులుండేవి కాదు.

వేషాల కోసం ఎదురు చూస్తే కష్టం అని, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాను. రోజుకి వంద రూపాయలు ఇచ్చేవారు. నెలకి ఓ పది రోజులు పని ఉండేది. ఒక్కోసారి ఆ పని కూడా దొరికేది కాదు. ఈ గ్యాప్‌లో నటుడిగా అవకాశాల కోసం తిరిగేవాణ్ణి. కాస్ట్యూమ్ వర్క్ చేస్తూనే చాలా సినిమాల్లో వెనక అటూ ఇటూ తిరిగే క్యారెక్టర్లు చేశాను. బాబు పుట్టడంతో ఫ్యామిలీ గడవడం కష్టమైంది. ఆ తర్వాత రెండో బాబు కూడా పుట్టాడు. షూటింగ్ ఉంటే నేనక్కడ తినేవాణ్ణి. ఇంట్లో మా ఆవిడ, పిల్లల పరిస్థితి దారుణంగా ఉండేది. పిల్లలకు పాలు కొనలేని పరిస్థితి. ఊరెళ్లిపోయి పొలం పనులు చేసుకుందామనుకున్నా.

‘ఇక్కడే ఉందాం... నేనూ పని చేస్తా’ అని మా ఆవిడ ఇళ్ల పనులు చేయడం మొదలుపెట్టింది. నాలుగేళ్ల క్రితం వరకూ తను పనులు చేసింది. డ్యాన్స్ అంటే ఇష్టం ఉండటంతో సినిమాల్లో నటిస్తూ, డ్యాన్సర్‌గానూ చేస్తుండేవాణ్ణి.  ఇప్పటివరకూ పలు సినిమాల్లో నటించా. మా పెదబాబు కంప్యూటర్ ఇంజినీరింగ్ చేశాడు. ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. చినబాబు డిగ్రీ ఫైనలియర్‌లో ఉండగా యాక్సిడెంట్‌లో మరణించాడు. జీవితాంతం వెంటాడే బాధ ఏదైనా ఉందంటే అది మా అబ్బాయి మరణమే.

‘గబ్బర్ సింగ్’ తర్వాత ఆర్థిక కష్టాలు తప్పాయి. అవకాశాలు పెరిగాయి. ఆదాయం పెరిగింది. ఇప్పుడు ఏ సినిమా చేసినా రోజుకి పదివేలు ఇస్తున్నారు. నేను రాజశేఖర్‌గారి దగ్గర పనిచేశా. ‘గబ్బర్ సింగ్’లో ఆయన్ని ఇమిటేట్ చేస్తూ, చేసిన ‘రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా..’ చూసి.. ‘నాకన్నా నువ్వే బాగా చేశావ్’ అన్నారు. ఇప్పుడో ఇల్లు కొనుకున్నాను. పెద్దబ్బాయి పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేయాలనుకుంటున్నాం.
 
మల్లె తీగెకు పందిరి వోలె... - రమేశ్
మాది హైదరాబాద్ పాతబస్తీ. పదో తరగతి వరకూ చదువుకున్నా. నా ముఖం చూసి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదు. అప్పుడు సినిమాలపై ఆసక్తి లేదు. రామ్‌గోపాల్ వర్మగారి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసే మహేశ్ అన్న మా ఇంటి దగ్గర ఉండేవారు. ఆయనే నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ‘షాక్’ సినిమా అప్పుడు హీరోయిన్‌కి బాడీగార్డుగా చేశా. మోహన్‌బాబుగారితో పాటు పలువురి దగ్గర బాడీగార్డుగా పనిచేశా. ‘ఢీ’ నుంచి యాక్టింగ్ మొదలైంది. పదేళ్ల పాటు మెయిన్ విలన్ వెనక రౌడీ క్యారెక్టర్లు చేశాను.

నెలలో పది రోజులు షూటింగ్ ఉండేది. ‘గబ్బర్ సింగ్’తో లైమ్‌లైట్‌లోకి వచ్చా. ఆ సినిమాలో చేసిన ‘మల్లె తీగెకు పందిరి వోలె..’ పాట చూసి, నారాయణమూర్తిగారు మెచ్చుకున్నారు. బాడీగార్డుగా పనిచేసినప్పుడు ‘ఇప్పటిదాక కుర్సీలో కూసున్నాం. ఏ రోజైనా క్యార్‌వ్యాన్ ఎక్కాలి మనం. కష్టపడి ఆ స్టేజికి రావాలి’ అనుకున్నా. ‘గబ్బర్ సింగ్’ తర్వాత కొన్ని చిన్న సినిమాలకు, టీవీ షోలకు  క్యార్‌వ్యాన్ ఇచ్చారు. నా ఆశ నెరవేరింది.
 
నాది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. మేనమామ కూతుర్ని చేసుకున్నా. మామ ఇంట్లో వాళ్లందరూ ‘షూటింగులకు పోతే ఏమొస్తది’ అన్నారు. బంధువులు కూడా చాలా మాటలన్నారు. దాంతో పిల్లనివ్వడానికి మామవాళ్లు భయపడ్డారు. నా మరదలే ఒప్పించింది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘వాడు మావాడే’ అని గర్వంగా చెబుతున్నారు. ప్రేక్షకులు కూడా ‘గబ్బర్ సింగ్’ విడుదలకు ముందు మా బ్యాచ్ దగ్గరకి రావడానికి భయపడేవారు. ఇప్పుడు ‘అన్నా.. ఓ సెల్ఫీ’ అంటున్నారు. చిన్నపిల్లల్లో మాకు ఫ్యాన్స్ ఎక్కువ.

ఇండస్ట్రీకి రాకముందు టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్, సెటిల్‌మెంట్లు చేసేవాణ్ణి. నాతో తిరగొద్దని మా ఫ్రెండ్స్ వాళ్లింట్లో గొడవ చేసేవారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత ‘మా అబ్బాయిని కూడా తీసుకు వెళ్లొచ్చు కదా’ అంటున్నారు. హరీశ్ శంకర్ సర్ ‘గబ్బర్ సింగ్’లోనే కాదు.. ‘రామయ్యా వస్తావయ్యా’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో పెద్ద క్యారెక్టర్లు ఇచ్చారు. ఆయన ప్రతి సినిమాలోనూ నేనుంటా. ఇప్పుడు చాన్సులు బాగానే ఉన్నాయి.
 
 
జలక్ దిక్‌లాజా... - రెమ్‌సన్ రాజు
మాది చార్మినార్ దగ్గర యాకుత్‌పుర. పదో తరగతి ఫెయిలయ్యా. జిమ్‌కు వెళ్లడం.. ఫ్రెండ్స్‌తో తిరగడం.. ఇవే పనులు. మా చిన్నమ్మ కొడుక్కి ఇండస్ట్రీతో టచ్ ఉంది. ‘గొడవలు, గట్రా ఎందుకురా.. నాతో రా, నిన్ను సినిమాల్లో తీసుకుంటారు’ అన్నాడు. ‘ఊకో అన్నా.. నన్నెవరు తీసుకుంటారు’ అన్నాను. రాధాకృష్ణ అనే సార్‌తో కలిసి ‘చక్రం’ షూటింగ్ చూడ్డానికి వెళ్లా. కృష్ణవంశీగారు చూసి, రౌడీ బ్యాచ్‌లో ఒకడిగా తీసుకున్నారు. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చిన ప్రసాద్ అన్న వాళ్లింటి పక్కన ఓ అమ్మాయి ఉండేది. నేను అమ్మాయిలతో అస్సలు మాట్లాడేవాణ్ణి కాదు. దాంతో సతాయిద్దామని ఫోన్ చేసి, మా అన్నయ్యవాళ్లు ఆ అమ్మాయికి ఇచ్చారు. ‘మీరు సినిమాల్లో చేస్తారు కదా. నేను మీకు పెద్ద ఫ్యాన్. నెట్‌లో మీ నంబర్ తీసుకున్నా’ అని చెప్పింది. ‘చిన్న చిన్న రౌడీ క్యారెక్టర్లు చేస్తా. నా నంబర్ నెట్‌లో పెట్టేంత సీన్ లేదు. ఫోన్ పెట్టు’ అన్నాను.

మళ్లీ తెల్లారి ఫోన్ చేసి అవే మాటలు. ‘ఓవర్ యాక్షన్ చేయకు’ అని తిట్టా. ఆ తర్వాత మెల్లగా ఫ్రెండ్ అయ్యింది. ఆ టైమ్‌లోనే ఆ అమ్మాయికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ‘అతను పైసల్.. అని వేధిస్తున్నాడు. ఇంట్లోవాళ్లు బాధపడతారని ఒప్పుకున్నా. నాకతను నచ్చలేదు’ అంది. ఆ అమ్మాయికో లవర్ ఉందని ఆ అబ్బాయికి చెప్పించా. నిశ్చితార్థం జరిగిపోయింది కాబట్టి, వెనక్కి తగ్గేది లేదని పెద్దలన్నారు. దాంతో ‘నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం’ అంది. ‘ఎప్పుడో ఇష్టం’ అన్నాను. మేం పెళ్లి చేసుకున్నాం. ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్ అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లలో ‘నాలుగు రోజులు అవుట్ డోర్ షూటింగ్ ఉంది’ అని చెప్పి మాతో వచ్చేశారు.

గొడవలు జరిగాయి. మన సంతోషం కోసం ఆలోచించి.. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులందర్నీ కష్టపెట్టడం తప్పని అర్థమైంది. ఇప్పుడంతా కాంప్రమైజ్ అయింది. ఇప్పుడెవరైనా లవ్ మ్యారేజ్ అంటే నేను వద్దని చెప్తా. మా పెళ్లయి ఆరేళ్లయింది. మాకు ఇద్దరు అబ్బాయిలు. ‘గబ్బర్ సింగ్’ 50వ రోజున బాబు పుట్టాడు. వాడికి ‘గబ్బర్ సింగ్’ అనే నిక్‌నేమ్ పెట్టాను. ఆ సినిమాలో చేసిన ‘జలక్ దిక్‌లాజా..’ పాట నన్ను చాలా పాపులర్ చేసింది. ప్రస్తుతం నా పొజిషన్ ఫర్వాలేదు. సినిమాలు చేస్తున్నాను. పెద్ద సినిమాలకు పదివేలు ఇస్తున్నారు. చిన్న సినిమావాళ్ల రిక్వెస్ట్‌ను బట్టి తీసుకుంటున్నా.
 
నన్ను కొట్టకురో bతిట్టకురో.... - సాయిబాబా
మాది సికింద్రాబాద్. ఒకటి, మూడు తరగతులు నాలుగుసార్లు, రెండో తరగతి రెండుసార్లు ఫెయిలయ్యా. స్కూల్లో ఇంటర్వెల్‌కి గోడ దూకి 47 బస్ ఎక్కి అపోలో దగ్గరకు వచ్చేవాణ్ణి. నడుచుకుంటూ నానక్‌రామ్‌గూడా వెళ్లి కృష్ణగారి ‘మాయలోడు’ షూటింగ్ చూసేవాణ్ణి. ఓసారి  గోడ దూకుతుంటే మేడమ్ పట్టుకున్నారు. ‘నీ కొడుకు చదువుకు పనికిరాడు. బస్తాలు మోయడానికి పనికొస్తాడు’ అని నాన్నకు చెప్పారు. ఓ రోజు కోపం వచ్చి పేపర్లు రౌండ్‌గా ఉండ చుట్టి మేడమ్‌ను కొట్టా. పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ ఇచ్చి, సస్పెండ్ చేశారు. ఆల్ఫా హోటల్ పక్కన పెట్రోల్ పంపులో జాడూ కొడుతూ, టైర్లలో గాలి పడుతూ ఓ ఏడాది చేశా.

తర్వాత అక్కడే హెల్పర్‌గా, క్యాషియర్‌గా చేశా. ఓనర్‌కి నాపై నమ్మకం పెరగడంతో మేనేజర్‌ని చేశారు. మోహన్‌బాబుగారి దగ్గర పనిచేసే రాజుతో పరిచయమైంది. నాకు షూటింగులంటే ఇష్టం. పెట్రోల్ పంపులో పనిచేస్తూనే.. మోహన్‌బాబుగారి ఆడియో ఫంక్షన్స్, ఇంకేవి జరిగినా రాజు వెనకుండి ఆయన పనులు చేసేవాణ్ణి. హైట్, బాడీ బాగుందని ‘శివశంకర్’లో చిన్న వేషం ఇచ్చారు. ఓ నెల రోజులు సెలవు పెట్టేశా. ఓనర్ నన్ను పెట్రోల్ పంపు నుండి వెళ్లగొట్టారు. చేసేదేం లేక సినిమాల్లో కంటిన్యూ అయిపోయా. చిన్నప్పుడు అమ్మాయిలంటే చాలా సిగ్గు. బోనాలు, గణేశ్ చతుర్థి, అయ్యప్ప పూజలు చేయడంతో ఓ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఓ పేపర్‌పై లవ్ సింబల్ వేసి నా పేరు, తన పేరూ రాిసి పంపింది. నాకు చదవడం రాదు.

ఇంకో పిల్లగాడితో చదివించుకున్నా. తర్వాత ‘ప్రేమదేశం’ పాటల క్యాసెట్ అడిగి మళ్లీ సేమ్ లవ్ సింబల్, పేర్లు రాసి పంపింది. కాస్ట్ ఫీలింగ్‌తో మా ఇంట్లోవాళ్లు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ‘ఆ అమ్మాయిని చేసుకుంటే, ఇద్దరు సిస్టర్స్‌కి సంబంధాలు రావు’ అని భయపెట్టారు. వేరే అమ్మాయితో పెళ్లి చేశారు. నేనంటే ఆ అమ్మాయికీ, తనంటే నాకూ ఇష్టం లేదు. పెళ్లైన నెలకు ఆ అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి గ్రీటింగులు పంపించడం స్టార్ట్ చేశాడు. గొడవలు మొదలయ్యాయి. ఏడాది తిరక్కుండానే విడాకులు ఇచ్చేశా. ఆ తర్వాత మా అమ్మే, నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమ్మంది.

అలాగే చేసుకున్నా. మాకు ముగ్గురు పాపలు. ‘గబ్బర్ సింగ్’లో చేసిన ‘నన్ను కొట్టకురో.. తిట్టకురో..’ పాట నాకు మంచి పేరు తెచ్చింది. మా నాన్న సినిమాలు బాగా చూసేవారు. ‘నువ్ మంచి హైట్ ఉన్నావ్‌గా, సినిమాల్లో ట్రై చేయ్’ అని నాన్న చెప్పేవారు. నేను పెట్రోల్ పంపులో జాబ్ చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆయన ముగ్గురు అక్కలకు పెళ్లి చేస్తే, నేను ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేశా. నా డెవలప్‌మెంట్ చూడకుండా నాన్న చనిపోయారని నా బాధ.


అమ్మా చూడాలి నిన్నూ నాన్నను చూడాలి - ప్రవీణ్
మాది హైదరాబాద్ ఉప్పుగూడా రైల్వే స్టేషన్ దగ్గర. రామ్‌కోఠిలోని ఓ షాపులో టూ వీలర్ ఫైనాన్స్ కలెక్షన్ చేసేవాణ్ణి. హీరో రవితేజగారి బాడీగార్డ్ కుమార్ అన్న నాకు తెలుసు. ‘పోకిరి’ షూటింగ్‌కి వస్తావా? అన్నారు. సరే.. అన్నా. షూటింగ్ అంటే 9 గంటలకు జాబ్‌కు వెళ్లడమే అనుకుని పడుకున్నా. తెల్లారక ముందు వచ్చి నిద్రలేపారు. ‘ఇప్పుడేం షూటింగ్ అన్నా. నేను రాను పో’ అని చెప్పా. ‘ఆరింటికే షూటింగ్ స్పాట్’లో ఉండాలని చెప్పి తీసుకువెళ్ళారు. విలన్స్ బ్యాచ్‌లో గన్ పట్టుకుని నిలబడమన్నారు. నేను నవ్వుతున్నా. ‘సీరియస్‌గా ఉండాలమ్మా’ అని చెప్పారు. ఆ తర్వాత ‘ఆట’ చేశా. అప్పట్నుంచి సినిమాల్లో కంటిన్యూ అవుతున్నా. విలన్స్ బ్యాచ్‌లో ఉండేవాణ్ణి. షూటింగ్ లేదంటే  కలెక్షన్ చేసేవాణ్ణి.

ఓ టైమ్‌లో జాబ్ మానేశాను. కానీ, నెలలో పది రోజులు షూటింగ్ ఉంటే 20 రోజులు ఖాళీగా ఉండేవాణ్ణి. ఇబ్బంది అవుతోందని మళ్లీ కలెక్షన్ జాబ్ షురూ చేశా. మొదట్లో ఇంట్లోవాళ్లు సినిమాలు వద్దన్నారు. ‘ఏం చేస్తున్నావ్ రా’ అని తిట్టేవాళ్లు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. థియేటర్లో సినిమా చూసిన తర్వాత వాళ్లు ఫుల్ ఖుషీ. ‘గబ్బర్ సింగ్’లో అంత్యాక్షరి ఎపిసోడ్‌కి, ‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..’ పాటలో నా యాక్టింగ్‌కు అంత మంచి పేరొస్తుందని ఊహించలేదు. సినిమా విడుదలైన రోజున ఫైనాన్స్ కలెక్షన్ చేస్తుంటే... ‘అరే, ‘గబ్బర్ సింగ్’లో మంచిగా చేశావ్’ అని చాలామంది ఫోన్లు చేశారు. నాకింకా పెళ్లి కాలేదు. మా అన్నకు పెళ్లైన తర్వాత నాదే. మొదట్లో మనల్ని చూసి ఎవరు లవ్ చేయలే.

అందరూ భయపడుతుండే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత చాలామంది ఫోన్లు చేసి ‘మీరంటే ఇష్టం’ అని టార్చర్ చేశారు. నాకు భయమైంది. ‘నాకు ఇసువంటివి నచ్చవ్. వద్దు’ అని చెప్పా. అవన్నీ పట్టించుకోలేదు. అంతకు ముందు మా మామవాళ్లు పిల్లను ఇవ్వడానికి వెనకాడారు. ఇప్పుడు ‘మా బిడ్డను చేసుకో..’ అని అడుగుతున్నారు. ఇంట్లో అమ్మానాన్నలు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే.. తనని చేసుకుంటా. ఒకప్పుడు ఎవడైనా ఏమైనా అంటే.. గొడవపడుతుండే. ఇప్పుడు ‘ఓయ్.. గిట్లరా. ఓ ఫొటో దిగుదాం’ అనడిగినా గమ్మునుంటున్నా.
 
 - ‘సాక్షి’ సినిమా డెస్క్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement