తనుశ్రీ ఆరోపణలపై స్పందించిన గణేష్‌ ఆచార్య | Ganesh Acharya Response Over Tanushree Dutta Allegations On Nana Patekar | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 8:41 PM | Last Updated on Wed, Sep 26 2018 8:45 PM

Ganesh Acharya Response Over Tanushree Dutta Allegations On Nana Patekar - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై ప్రముఖ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ ఆచార్య స్పందించారు. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదని ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తనుశ్రీ మాట్లాడుతూ.. హార్న్‌ ఒకే ప్లీజ్‌ చిత్రంలో ఓ సోలో సాంగ్‌ చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్‌ను పక్కకుబెట్టి.. నానా పటేకర్‌ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని తెలిపారు. అది సోలో సాంగ్‌ అయినప్పటికీ.. అందులో అతనితో సన్నిహితంగా నటించాలని నానా పటేకర్‌ తనను లైంగిక వేధించినట్టు ఆమె ఆరోపించారు. తాను దానికి అంగీకరించలేదని తెలిపారు. ఆ సమయంలో నానా పటేకర్‌ రాజకీయ పార్టీలకు చెందిన కొందరిని పిలిచి సెట్లో గొడవకు కూడా దిగాడని ఆమె పేర్కొన్నారు. అందువల్ల తాను ఆ చిత్రం నుంచి తప్పుకున్నానని అన్నారు.

కాగా, ఆ చిత్రానికి కొరియోగ్రఫీ అందించిన గణేష్‌ ఆచార్య మాట్లాడుతూ.. తనుశ్రీ ఆరోపణల్లో నిజం లేదన్నారు. అది చాలా పాత విషయమని.. అందువల్ల ఆ సాంగ్‌ తనకు అంతగా గుర్తుకు లేదని తెలిపారు. తనకు గుర్తున్నంత వరకు అది సోలో కాదని.. డ్యూయేట్‌ సాంగ్‌ అని వెల్లడించారు. ఆ రోజు ఏదో జరగడం వల్ల షూటింగ్‌ మూడు గంటల పాటు నిలిచిపోయిందని తెలిపారు. అక్కడ అపార్థం చేసుకోవడం వల్ల ఏదో జరిగిందని.. కానీ తనుశ్రీ చెప్పినట్టుగా నానా పటేకర్‌ అసభ్యకరంగా ప్రవర్తించడం కానీ, రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులను తీసుకువచ్చి సెట్లో దాడికి దిగడం కానీ జరగలేదని పేర్కొన్నారు. షూటింగ్‌లో అలా ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘చిత్ర నిర్మాతలు రిహార్సల్‌ అప్పుడే నానా పటేకర్‌ కూడా ఆ సాంగ్‌లో ఉన్నారని నాతో చెప్పారు. ఆ సమయంలో నాకు చిత్ర యూనిట్‌తో ఎలాంటి ఒప్పందం లేదు.. ఎందుకంటే అప్పట్లో నేను మాట మీదే పనిచేశాను. అయినా ఆ పాటలో ఎలాంటి అసభ్యకరమైన దృశ్యాలు లేవు.. అది పూర్తిగా డ్యాన్స్‌తో కూడిన పాట’ అని అన్నారు. ఆ సాంగ్‌ షూటింగ్‌ నుంచి తనుశ్రీ వెళ్లిపోవడంతోనే రాఖీ సావంత్‌ తీసుకువచ్చారనే దానిపై స్పందిస్తూ.. అది పూర్తిగా నిర్మాతల నిర్ణయమేనని తెలిపారు. అంతేకాకుండా నానా పటేకర్‌ చాలా మంచి వ్యక్తి అని పేర్కొన్నారు. తనుశ్రీ ఆరోపించినట్టు ఆయన ఏనాడూ ప్రవర్తించలేదని అన్నారు. నానా పటేకర్‌ చిత్ర పరిశ్రమలో ఎంతో మందికి సహాయం చేశారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement