పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా! | Gang Leader Pre Release Event At Visakhapatnam | Sakshi
Sakshi News home page

పదేళ్లుగా వైజాగ్‌ను ప్రేమిస్తున్నా!

Published Wed, Sep 11 2019 12:42 PM | Last Updated on Wed, Sep 11 2019 2:33 PM

Gang Leader Pre Release Event At Visakhapatnam - Sakshi

హాయ్‌ వైజాగ్‌.. నాని అభివాదం, హీరోయిన్‌ ప్రియాంక

సాక్షి, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘పదేళ్ల కిందట వైజాగ్‌ అమ్మాయితో ప్రేమలో పడ్డా. అప్పటి నుంచి విశాఖ ప్రేక్షకులతో ప్రేమలోనే ఉన్నా’ అని హీరో నాని చెప్పారు. పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తున్నారు గాని ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకల ను గురజాడ కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పదకొండేళ్ల క్రితం అష్టాచెమ్మా సినిమా విడుదల ముందు విశాఖలో కార్యక్రమంలో పాల్గొని సినీరంగంలో స్థిరపడ్డానని, ఇప్పుడు మరో 11 ఏళ్లపాటు ఈ రంగంలో తనకు ఢోకా ఉండదని చమత్కరించారు. సినిమా విడుదలయ్యే సెప్టెంబర్‌ 13న టికెట్‌ ముక్క కూడా దొరకకుండా చేయాలని ప్రేక్షకులను కోరారు.

‘మనం’ సినిమా నుంచి తాను విక్రమ్‌ సినిమా చేయాలని అనుకున్నామని, ఇప్పటికి గ్యాంగ్‌లీడర్‌ లాంటి అద్భుతమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌తో తర్వాత చిత్రం చేయాలని అనుకున్నా కానీ రెండో సినిమా కూడా అతడితో చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. హీరోయిన్స్‌ను పరిచయం చేయడం నా పనిగా మారిందనుకుంటున్నా.. ప్రియాంక కుడా నా చిత్రంతో పరిచయం కావడం సంతోషంగా ఉంది.’ అని చెప్పారు. కార్తికేయను దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చెప్తున్నానని.. టాలీవుడ్‌లో ఇంకో మంచి నటుడు వచ్చినట్టేనని తెలిపారు. తర్వాత చేయబోయే సినిమాలో కార్తికేయ హీరోగా, తాను విలన్‌గా చేస్తామని చెప్పారు. సినిమాలోని డైలాగులు చెప్పి ప్రేక్షకులను అలరించారు.

నిన్న చిరు.. నేడు నాని
కార్తికేయ మాట్లాడుతూ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటులుగా స్థిరపడాలనుకున్న వారికి నిన్నటి తరంలో చిరంజీవి, ఇప్పటి తరంలో నాని గుర్తొస్తారని ప్రశంసించారు. నానితో నటించడం తన జీవితంలో మరువలేని జ్ఞాపకమన్నారు. అందరు డైరెక్టర్లను భిన్నంగా పని చేసి హిట్‌ కొడుతున్న డైరెక్టర్‌ విక్రమ్‌ అని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినిమాలోని డైలాగ్‌లు చెప్పి శభాష్‌ అనిపించారు. డైరెక్టర్‌ విక్రమ్‌ మాట్లాడుతూ నాని అద్భుతమైన నటుడని, మంచి మిత్రుడని చెప్పారు. ప్రియాంక చాలా బాగా నటించిందన్నారు. ఈ సినిమాలోని కార్తికేయ నటన కారణంగా భవిష్యత్తులో మరిన్ని విభిన్న చిత్రాల్లో అవకాశాలు వస్తాయని చెప్పారు. హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ డైరెక్టర్‌ విక్రమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నానితో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. 

అనిరుధ్‌ పాట.. నాని ఆట
మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ స్టేజి మీదకు వచ్చి తన పాటలతో ప్రేక్షకుల్లో ఆనందాన్ని నింపారు. నాని గ్యాంగ్‌లీడర్‌ వచ్చాడో లెగండో.. పాటతో అందరిలో ఊపు తెచ్చారు. పాటలు హోరెత్తుతూ ఉండగా, నాని, కార్తికేయ, ప్రియాంకల చేత స్టెప్పులేయించారు. ఈ సందర్భంగా డ్యాన్సర్లు రసవత్తరమైన నాట్యాలతో అందరినీ ఉరకలెత్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement