దేవరాట్టం చిత్రం తనను కాపాడుతుందనే నమ్మకాన్ని ఆ చిత్ర కథానాయకుడు గౌతమ్ కార్తీక్ వ్యక్తం చేశారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన భారీ చిత్రం దేవరాట్టం. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ముత్తయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్, మంజిమా మోహన్ జంటగా నటించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే ఒకటవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ దర్శకుడు ముత్తయ్యతో తాను నిర్మించిన రెండవ చిత్రం దేవరాట్టం అని చెప్పారు. ఆయన చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారన్నారు. ఇంత భారీ యాక్షన్ చిత్రాన్ని ఏకధాటిగా పని చేసి పూర్తి చేయడం సాధారణ విషయం కాదన్నారు. చిత్ర నిర్మాణాన్ని కూడా అంతా ఆయనే చూసుకున్నారన్నారు. ఇది మదురై నేపధ్యంలో సాగే కథ, ఈ కథకు గౌతమ్‌కార్తీక్, మంజిమా మోహన్‌లు సరిపోతారా? అన్న భయం తనకు కలిగిందన్నారు. ఈ చిత్రం అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు.
చిత్ర కథానాయకుడు గౌతమ్‌కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తనను కాపాడుతుందని అన్నారు. తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం రావడానికి ముఖ్య కారణం నిర్మాత జ్ఞానవేల్‌రాజా అని తెలిపారు. దర్శకుడు ముత్తయ్య తనకు మదురై ప్రజల భాషను వారి ప్రవర్తనను, జీవన విధానాన్ని నేర్పించారని చెప్పారు. నటి మంజిమా మోహన్ చాలా సపోర్టు చేశారని చెప్పారు. అనంతరం దర్శకుడు ముత్తయ్య మాట్లాడుతూ ఇది జాతి గురించి చర్చించే కథా చిత్రం అనే అపోహ పడుతున్నారనీ, నిజానికి దేవరాట్టం అనేది ఒక కళ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment