
4 హీరోలు,3 హీరోయిన్లతో గౌతమ్‌మీనన్ చిత్రం
కోలీవుడ్ సంచలన దర్శకుల్లో గౌతమ్ మీనన్ ఒకరని చెప్పవచ్చు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల కాస్త వెనుకపడ్డారనే చెప్పాలి.అయితే చేతి నిండా చిత్రాలతో బిజీగానే ఉన్నారు. కానీ ఏదీ అనుకున్న తేదీకి షూటింగ్ పూర్తి కావడం లేదు, విడుదల కావడం లేదు.ప్రస్తుతం శింబు హీరోగా అచ్చంయంబదు మడమయడా(తెలుగులో నాగచైతన్య హీరోగా సాహసమే శ్వాసగా సాగిపో)చిత్రం నిర్మాణంలో ఉంది. అది విడుదల కాకుండానే ధనుష్ హీరోగా ఎన్నై నోకి పాయుమ్ తూటా చిత్రం మొదలెట్టారు.
ఇక నిర్మాతగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎస్‌జే.సూర్య హీరోగా నెంజమ్ మరుప్పదిల్లై చిత్రం చేస్తున్నారు. ఇవన్నీ నిర్మాణ దశలో ఉండగా తాజాగా మరో చిత్రానికి సిద్ధమవుతున్నారని సమాచారం.ఈ చిత్రాన్ని ఆయన నలుగురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట. ఇందులో మలయాళంకు చెందిన పృథ్వీరాజ్,తెలుగు నటుడు సాయి ధరణ్ తేజ్, కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించనున్నారట. తమిళ భాషకు చెందిన నటుడెవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు.
ఇక హీరోయిన్లుగా అం దాల భామ అనుష్క, మిల్కీబ్యూటీ తమన్నా ఎంపికైనట్లు సమాచారం. మూడో హీరోయిన్ కోసం చెన్నై చిన్నది సమంతను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట.అయితే త్వరలో వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్న సమంత తను గురువుగా భావించే దర్శకుడు గౌతమ్‌మీన న్ ఆఫర్‌ను అందుకుంటారా? లేక సారీ అంటారా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ వచ్చే ఏడాది ప్రారంభించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.