కీరవాణి, రామారావు, మండలి బుద్ధప్రసాద్, కృష్ణచైతన్య, యస్పీ బాలసుబ్రహ్మణ్యం
‘‘ఘంటసాలగారికి సంబంధించిన నిజాలు చాలామందికి తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా సి.హెచ్.రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల’ సినిమా తెరకెక్కుతోంది. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో, ఆయన సతీమణి మృదుల ఘంటసాల సతీమణి పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంగీతంలో పద్యాలు ఎలా పాడాలో నాకు నేర్పించింది ఘంటసాలగారే. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ఎంత వినయంగా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలనే విషయాలను ఆయన దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే అందరికీ ఘంటసాలగారు గుర్తొస్తారు. సినిమాల్లోకి రాక మునుపు ఆయన స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఆరేళ్ల పాటు జర్నీ చేసి, ఐదారు సినిమాలకు పనిచేశా. ఘంటసాలగారిని నా తండ్రి సమానుడిగా భావిస్తా. ఆయన విగ్రహావిష్కరణ సమయంలో నేను పడ్డ కష్టాలెన్నో నాకే తెలుసు.
ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఘంటసాల తర్వాతే.. ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఆయనంత గొప్పగా పాడుతున్నారని చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. ఈ చిత్రం సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి బయోపిక్ ఘన విజయం సాధించాలి’’ అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ‘‘ఘంటసాలగారిపై సినిమా చేస్తే నేనే చేయాలనే స్వార్థంతోనే ఈ సినిమా చేశా. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సి.హెచ్.రామారావు. ‘‘ఘంటసాలగారితో పోల్చదగ్గ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంగారు మాత్రమే’’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment