gantasala
-
అతను నాకు అంతగా ఇష్టం లేదు : బాలమురళీకృష్ణ
-
ఘంటసాల గారి పాటలన్నా ఆయనన్నా చాలా ఇష్టం నాకు
-
అమెరికాలో ఘంటసాల వర్ధంతి.. నివాళులర్పించిన ప్రవాసులు
ఘంటసాల గాయకుడే కాదు మానవతా వాది, స్వాతంత్య్ర సమరయోథులని ఎన్ఆర్ఐలు కొనియాడారు. ఫిబ్రవరి 11న ఘంటసాల వర్ధంతి సందర్భంగా అమెరికాలో ఘంటసాల వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఘంటసాల సంగీత కళాశాల ఇంటర్నేషనల్ (GSKI) న్యూజెర్సీ ఆధ్వర్యంలో అన్నా మధుసూదనరావు అద్యక్షతన ఫిభ్రవరి 11న స్థానిక సంగం చెట్టినాడ్ రెష్టారెంట్లో ఈ కార్యక్రమం జరిగింది. సాయిదత్తపీఠం శివ విష్ను టెంపుల్ ఛైర్మన్ రఘుశర్మ శంకరమంచి వేదమంత్రాల ఉచ్ఛారణ తో జ్యోతి వెలిగించి ప్రార్థనాగీతాలతో సభను ప్రారంభించారు. అనంతరం రవి మరింగంటి, రాజ రాజేశ్వరి కలగా, కృష్ణ కీర్తి ,హర్ష శిష్టా, దీప్తి,లాస్య, శ్రీకన్, జీఎస్కే సభ్యులు భక్తిగీతాలాపనలతో ఘంటసాలపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. జీఎస్‌కేఐ న్యూ జెర్సీ అడ్వైజర్స్ రఘు శర్మ శంకరమంచి, న్యూజెర్సీ మాజీ అసెంబ్లీ సభ్యులు ఉపేంద్ర చివుకుల ప్రత్యేకంగా ఈ సభలో పాల్గొని సభికులకు తమ సంస్థ గురించి తెలియజేశారు. GSKI హ్యూస్టన్ సభ్యుడు రవి మరింగంటి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతంగా జరిగింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన తెలుగు భవనం శ్రీరాజ్ పసల, తెలంగాణ అసోసియేషన్ గ్రేటర్ హ్యూస్టన్ ఆధ్యక్షులు నారాయణ్ రెడ్డి, ఆశా జ్యోతి దేవకి, రాంబాబు కట్టా తదితరులు GSKI చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఘంటసాల వర్ధంతిని శ్రద్దతో నిర్వహించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికీ GSKI ప్రెసిడెంట్ అన్నా మధు, రవి మరింగంటి కృతఙ్ఞతలు తెలియజేశారు. ‘తెలుగు భాషకు వరం.. ఘంటసాల స్వరం’ అన్న నినాదంతో ముందుకు సాగుతూ.. తెలుగు భాషను ముందు తరాలకు పదిలంగా అందించడమే తమ లక్ష్యమని GSKI సభ్యులు తెలియజేశారు. -
క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే ఘంటసాల: చంద్రబోస్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకలు సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదం ఊపందుకున్న విషయం విదితమే. శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో పలు టీవీ చర్చ కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇందులో భాగంగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమం, 10 మంది సహ నిర్వాహకులు కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులతో ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రెండు భాగాల్ని 21, 28 ఆగస్టు నాడు ప్రసారం చేయగా అనూహ్యమైన స్పందన వచ్చిందని, 4 సెప్టెంబర్ నాడు మూడవ భాగం ప్రసారం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. చంద్రబోస్ మాట్లాడుతూ.. మాస్టార్కి భారతరత్న కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఘంటసాల గురించి చెప్పే అర్హత గాని, అనుభవం కానీ తనకు చాలదని ఆయితే ఆయనపైన తనకున్న అపారగౌరవంతో కొన్ని విషయాలను పంచుకున్నారు. మాస్టార్ పాటలు పాడకముందు జాతీయోద్యమంలో పాల్గొన్నారని, ఓ సందర్భంలో జైలు జీవితం కూడా గడిపినట్లు తెలిపారు. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంకు సంగీతం తోడైతే అది ఘంటసాల మాస్టారని కొనియాడారు. 1944 వరకు పాత్రధారులే వారి వారి పాత్రలకు పాటలు పాడేవారని.. మొట్టమొదటి నేపధ్య గాయకుడు ఎమ్మెస్ రామారావు అయితే, వారి తరువాత 1945లో స్వర్గసీమ చిత్రంతో మొదలుపెట్టి - 1974 వరకు అలా అప్రతిహతంగా మాస్టారు ప్రయాణం సాగిందని చెప్పారు. శారద ఆకునూరి (హ్యూస్టన్, USA) బృందం, ఫణి డొక్కా (అట్లాంటా, USA) బృందం, డాక్టర్ రెడ్డి ఉరిమిండి (డల్లాస్, USA) బృందం ఈ కార్యక్రమంలో ఘంటసాల పాటలు పాడి, చక్కటి వ్యాఖ్యానంతో ఆయనను స్మరించుకున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అందరిని అలరించారు. శతగళార్చన చివరి భాగంలో ముఖ్య అతిథిగా అనంత శ్రీరామ పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. శతగళార్చనకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోందని చాలా మంది ప్రముఖులు "ఘంటసాలకి భారతరత్న" విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నారని నిర్వాహకులు తెలియజేశారు. -
సంగీత దర్శకుడిగా ఘంటసాల ఒక చరిత్ర: దేవిశ్రీ ప్రసాద్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర నేత్రాలయ యు.ఎస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యములో 165 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు కూడా ఇటీవలే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా ప్రముఖ దర్శకులు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయరచయితలు చంద్రబోస్ అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం 10 మంది సహ నిర్వాహకులతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయనీగాయకులతో కలిసి ఘంటసాల శత గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి భాగాన్ని 21 ఆగస్టు నాడు ప్రసారం చేయడం, దానికి అనూహ్యమైన స్పందన వచ్చిందని నిర్వాహుకులు తెలియజేశారు. 28 ఆగష్టు నాడు రెండవ భాగం ప్రసారం చేశారు. మిగతా రెండు భాగాలు 4 సెప్టెంబర్, 11 సెప్టెంబర్ లో ప్రసారం చేయనున్నారు. శత గళార్చన రెండవ భాగంలో పాల్గొన్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. ఘంటసాల గొప్ప గాయకులూ అని చెబుతూ, అదే సమయంలో గొప్ప సంగీత దర్శకుడిగా అంతే గొప్ప విజయం సాధించారని, తరతరాలుగా గుర్తుండి పోయే వ్యక్తి ఘంటసాల అని కొనియాడారు. అలాగే వారి పాడిన భగవద్గీత మన అందరి హృదయాలలో ఇప్పటికి ఎప్పటికి మరిచిపోలేనంత ముద్ర వేసిందని చెప్పుకొచ్చారు. అంతటి గొప్ప అవకాశం రావడం అంటే వారు నిజంగా కారణజన్ములు అని.. అలాగే వారి పాడిన భగవద్గీతని వినడం మనమందరము, రాబోయే తరాలు కూడా చేసుకున్న అదృష్టమని చెప్పారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. రామ్ దుర్వాసుల (అట్లాంటా, యూఎస్ఏ) బృందం నుంచి దర్భా భాస్కర్, కృష్ణమాచారి కారంచేడు, మోహన్ దేవ్, రాధికా నోరి, స్రవంతి కోవెల, శ్రీయాన్ కోవెల, దుర్గ గోరా పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి చక్కటి వ్యాఖ్యానంతో ఘంటసాలని స్మరించుకున్నారు. దేశవిదేశాల నుంచి పాల్గొన్న కొందరు ప్రముఖులు: ఇండోనేషియా నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ ఇండోనేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు టీవీయస్ ప్రవీణ్, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షుడు అనిల్ కుమార్ కడించర్ల. -
ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ కళాకారుల శతగళార్చన!
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా 100 మందికి పైగా గాయకులతో ఘంటసాల శతగళార్చన చేశారు. వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతల తో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులు తో ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. శతజయంతి ఉత్సవాలపై ఘంటసాల సతీమణి సావిత్రమ్మ, కోడలు కృష్ణ కుమారులు సంతోషం వ్యక్తం చేశారు. శ్యాం అప్పాలి బృందం నుంచి (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా) నుంచి సంధ్య ఈశ్వర, కళ్యాణి వల్లూరి, లలిత చింతలపాటి, కిరణ్ కొక్కిరి, ఫణి డొక్కా బృందం,దర్భా, మృదురవళి దర్భా, జయ పీసపాటి బృందం నుంచి హర్షిణీ పచ్చంటి, సుసర్ల సాయి జయంత్, నారాయణి గాయత్రి ఇయుణ్ణి, డా. సతీష్ కుమార్ పట్నాల, రోహన్ మార్కాపురం నుంచి రోహిత్ విస్సంశెట్టి ,ఏకాంబర నెల్లూర్ ప్రకాష్, డా.సత్య చందు హరిసోమయాజుల, కన్నెగంటి వాసంతి దేవి పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలు పాడి శ్రోతల్ని అలరించారు. -
ఘంటసాలకు భారతరత్న.. 33 దేశాల తెలుగు సంస్థల విన్నపం
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శతజయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యములో ఇప్పటివరకు 150 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డాదాపు ఒక సంవత్సరం పాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎంతో మంది సినీ ప్రముఖులు 33 దేశాల తెలుగు స్మస్థల నాయకులు, తెలుగేతర ప్రముఖులు కూడా పాల్గొన్నారని తెలిపారు. గత 6 నెలలుగా రత్నకుమార్ (సింగపూర్), ఘంటసాల కుటుంబ సభ్యుల సహకారం చాలా ఉందని తెలియచేశారు. ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి ప్రముఖ గాయకుడు, రచయిత ఫణి డొక్క వ్యాఖ్యాతగా 24 జులై 2022 నాడు జరిగిన ఆన్లైన్ జూమ్(Zoom) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అమరగాయకుడు, సంగీత దర్శకుడు, పదివేలకు పైగా పాటలు పాడి భారతదేశం, ముఖ్యంగా దక్షిణ భారతదేశం గర్వించతగునటువంటి మహాగాయకుడని కొనియాడారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని ఎందరో కళాకారులు ఆకాంక్షతో తాను కూడా ఏకీభవిస్తూ, భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నానని తెలిపారు. మరొక విశిష్ట అతిథి ప్రముఖ గాయకుడు, నటుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఘంటసాల గురించి మాట్లాడే అర్హత గాని, ఆయన గాన వైభవాన్ని గురించి చర్చించే అంత శక్తి గాని తనకు లేదని చెప్పారు. అయితే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి గాయకుడికిగా ఆయనను సంగీత విద్వాంసుడాగానే కాకుండా, స్వాతంత్ర సమరయోధుడిగా కూడా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన గాంధర్వ గానం ప్రస్తుత రోజుల్లో చాలా మంది అనుసరించడంతో పాటు అనుకరిస్తున్నారని అన్నారు. ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్, నంది, మా మ్యూజిక్ అవార్డు గ్రహీత (చెన్నై, ఇండియా) గోపిక పూర్ణిమ మాట్లాడుతూ, మహాగాయకులు, సంగీత దర్శకులు ఘంటసాలకు భారతరత్న పురస్కారంతో సత్కరించాలని ఒక ఆశయం కోసం కృషిచేస్తున్న దాదాపు 33 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సభ్యులు ఆనంద్ దాసరి (డల్లాస్), రవి రెడ్డి మరకా (నెవార్క్), టీఏఎస్‌సీ అధ్యక్షుడు రావు కల్వకోట (లాస్ ఏంజిల్స్), అకాడమీ ఆఫ్ కూచిపూడి డాన్స్ రవి, శశికళ పెనుమర్తి (అట్లాంటా), తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవమని అభిప్రాయపడుతూ ఆయనకి భారతరత్న అవార్డుతో సత్కరించాల్సిందే ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారం భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జెర్మనీ, నెథర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 150 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ లింక్‌ని నొక్కి సంతకాల సేకరణకు మీ మద్దతు తెలియ చేయండి: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ చిరునామాకి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు. -
ఘంటసాలకు భారతరత్న కోసం కలిసి పోరాడుదాం
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న పురస్కారం తెలుగువారంతా కలిసి ప్రయత్నించాలని టూరిజం, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘంటసాల పేరు వినపడగానే మన అందరికి సుమధురమైన పాటలు గుర్తుకువస్తాయని అన్నారు. ఘంటసాల గాయకుడు మాత్రమే కాదని స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవాలని తెలుగువారంతా కోరుకుంటున్నారని చెప్పారు. మరొక ముఖ్య అతిథి తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఘంటసాల అమర గాయకుడని, భగవద్గీతని వింటున్నప్పుడు భగద్గీతని గానం చేయడం కోసమే ఆయన జన్మించినట్టుగా అనిపిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహాదీక్ష చేస్తూ చనిపోయినపుడు వారికి అంత్యక్రియలు జరపడానికి ఎవరు ముందుకు రాని సందర్భంలో తన ఉత్తేజమైన పాటలతో మద్రాస్ లో వున్నా తెలుగువారందని రప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. యావత్ భూగోళంలో నివసిస్తున్న తెలుగు వారందరు ఏకతాటిపై వచ్చి ఘంటసాలకు భారతరత్న కోసం చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందించారు. మరొక విశిష్ట అతిధి రామజోగయ్య శాస్త్రిమాట్లాడుతూ.. ఘంటసాలను కారణజన్ముడిగా వర్ణించారు. శత జయంతి సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలనే ఒక నినాదంతో చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చాలామందికి మరణాంతరం భారతరత్న ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి వాళ్ళలో ముందువరుసలో ఉండే వారు ఘంటసాల అని పేర్కొన్నారు. ఘంటసాల విశిష్టత, బహుముఖప్రజ్ఞ గురించి ఎంత చెప్పిన తనివితీరదని, ఆయనకు కచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కోరుకున్నారు. చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి మాట్లాడుతూ.. నిర్వాహకులను అభినందించారు. ఇటీవల మంత్రి రోజాను కలిసినట్టు వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించి ఈ మహాయజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు కృషి చేస్తానని రోజా హామీ ఇచ్చారని తెలిపారు. సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ.. ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 33 దేశాల సేవలను కొనియాడారు. యూఎస్ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు, ఫిలడెల్ఫియా డా. రాఘవ రెడ్డి గోసాల, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అట్లాంటా , శ్రీని వంగిమల్ల, కలైవాణి డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్, అట్లాంటా, శ్రీమతి పద్మజ కేలం, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, రాక్‌విల్లే ఉదయ్ భాస్కర్ గంటి, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆస్టిన్, డాక్టర్ జగన్నాథం వేదుల, జర్మనీ నుంచి రాజా రమేష్ చిలకల, భారతదేశం నుంచి బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, కోలపల్లి విఆర్ హరీష్ నాయుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలని అందరూ ముక్తకంఠంతో కోరారు. విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా ఏకతాటిపై తెచ్చి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రామ్ దుర్వాసుల(యూఎస్ఏ) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్ స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 143 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (change.org/BharatRatnaForGhantasalaGaru) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈమెయిల్‌కు ghantasala100th@gmail.com వివరాలు పంపవచ్చు. -
ఘంటసాలకు ‘భారతరత్న’ ఇవ్వాలంటూ సిగ్నేచర్ క్యాంపెయిన్
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికిభారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకరనేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 130 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగుసంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి విజు చిలువేరు, మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, వ్యాఖ్యాతగా 26 జూన్ 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో గీతరచయిత, టాలీవుడ్ ఫిల్మ్‌ఫేర్,SIIMA, నంది, మిర్చి మ్యూజిక్, మా మ్యూజిక్ అవార్డుల విజేత అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. అమరగాయకుడు, ప్రముఖ సంగీతదర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారికోసం 32 దేశాల పైగా తెలుగు సంస్థల ప్రతినిధులు అందరు కలసి ఏకతాటిపై వచ్చి వారికి భారతరత్న పురస్కార కోసం చేయడం అభినందనీయం అని తెలిపారు. ఘంటసాల గారు గొప్ప జాతిరత్నం అని చెపుతూ, కళేజీవితంగా భావించి, ఆ కళే వృత్తిగా జీవించి, తన చివరి క్షణం వరుకు తన జన్మను కళకే అర్పించిన గొప్ప వ్యక్తి అని తెలిపారు... గాయకుడికా పదివేల పాటలకు పైగా పాడి, 110 పైగాచిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి మహా కవులను గౌరవిస్తూ కుంతి విలాపమ, పుష్పవిలాపము లాంటి అరుదైన కావ్యాలను అందించి ఈ సంగీతానికి, తనను నమ్ముకున్నకళలకు, తన పూర్వజన్మ ఋణం అన్నట్లుగా ఆ కళ కోసం తన జన్మనే అర్పించారు, అటువంటి వ్యక్తికి భారతరత్న రావడం ఎంతో సమంజసం అని చెప్పారు. అడిలైడ్ ఆస్ట్రేలియా నుంచి ఘంటసాల శ్యామల అతిథిగా పాల్గొని వారి నాన్నగారితో చిన్ననాటి రోజులును ప్రేక్షకులతో పంచుకున్నారు. అలాగే నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంభం తరుపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మనందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతికకళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతు ఇప్పటిదాక ఈకార్యక్రమలో పాల్గొన్న 32 దేశాల సేవలను కొనియాడారు. యూఎస్ఏ నుండి అంజయ్య చౌదరి లావు, తానా అధ్యక్షుడు, యు.యెస్.ఏ శంకరనేత్రాలయ బోర్డు సభ్యులు పార్థ చక్రవర్తి, సోమ జగదీష్, రమేష్ వల్లూరి వ్యవస్థాపక అధ్యక్షుడు, అట్లాంటా తెలుగు సంస్కృతి, శ్రీనివాస్ దుర్గం గాయకుడు, అట్లాంటా, నెదర్లాండ్స్ నుండి సురేందర్ బోడకుంట అధ్యక్షుడు నెదర్ల్యాండ్సు తెలుగు అసోసియేషన్, తైవాన్ నుండి డా. దామోదర్ జన్మంచి, అధ్యక్షుడు తైవాన్ తెలుగు అసోసియేషన్, కోలపల్లి వీఆర్ హరీష్ నాయుడు బ్యాంక్ ఆఫ్శ్రీ ఘంటసాల (స్థాపించబడింది. 1974) మచిలీపట్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు నెథర్లాండ్స్, తైవాన్, స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 133 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, వివరాలు మీఅందరి మద్దతు కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ అడ్డ్రస్సు కి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు. -
ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలి
అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారి శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యములో ఇప్పటివరకు 90 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 1 మే 2022 నాడు జరిగిన అంతర్జాల కార్యక్రమములో పూజ్య బ్రహ్మశ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భార్య భర్తని ఎలా పేరు పెట్టి పిలవదో, గురువుని కూడా పేరు పెట్టి పిలవరని, ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మనందరికీ గురువు అని చెపుతూ, వారు ఒక కర్మయోగి, మహాజ్ఞానీ, తపశ్వి అని, వారి జీవితం ఒక తపస్సు అని చెప్పారు... నేను ఒక స్వామిజి అయినా మీరు అందరు చేస్తున్న ప్రయత్నాలకు నేను నమస్కరిస్తున్నాను అని చెపుతూ ఎందుకంటె మీరందరు ఒక తపస్వికి, జ్ఞానికి, కర్మయోగికి భారతరత్న కోసం చేస్తున్న కృషిని కొనియాడారు... భారతరత్నకి ఘంటసాల గారు పూర్తిగా అర్హులు అని చెపుతూ గారి గొప్పతనాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు... ఒక అమరగాయకుడుగా మరియు సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ మరియు తులు బాషలలో పాటలుతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు పాడటం మరియు వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత ఇప్పటికి తెలుగువారి ఇళ్లలో మారుమోగుతోందని అని చెప్పారు. అలాగే స్వీయ సంగీత దర్శకుడుగా 110 కంటే ఎక్కువ సినిమాలుకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాలాంటి పాటలను, వాగ్గేయకారుడుగా పాటలను రచించి, సంగీత స్వర కల్పన కూర్చి మరియు వారి అమృత గాత్రంతో ఆ పాటలకు జీవం పోశారు అని చెప్పారు, అలాగే 15వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడు అని తెలియచేస్తూ... వీటన్నటితోపాటు పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షని అనుభవించిన గొప్ప దేశభక్తుడని అని కొనియాడారు. ఘంటసాల గారికి భారతరత్న కోసం change.org లో నేను సంతకం చేస్తున్నాని చెపుతూ మీరందరు కూడా సంతకాల సేకరణను ఇంకా ఉదృతం చేయాలనీ కోరారు. 15 కోట్ల మంది తెలుగు వారి ఆకాంక్షని కేంద్ర పాలకులకు చేరేంతవరకు అందరు కలసి కృషి చేయాలనీ దిశా నిర్దేశము చేసారు... యూఎస్ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు డా. రాఘవ రెడ్డి గోసాల, నాట్స్ అధ్యక్షుడు విజయ శేఖర్ అన్నే, ధర్మయోగి ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాంకుమార్ యడవల్లి, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు రమేష్ బాబు చాపరాల, నారాయణరెడ్డి ఇందుర్తి, భారతదేశం నుండి సంకలనకర్త, ఘంటసాల గాన చరిత, చల్లా సుబ్బారాయుడు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.., పరిపూర్ణానంద స్వామి పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి ఒక కొత్త ఉత్సాహాం వచ్చిందన్నారు. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు, ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాల కి కేంద్ర ప్రభుత్వం తగిన రీతిన గుర్తించి భారతరత్న అవార్డు తో సత్కరించాలి అని అభ్యర్ధించారు, అందుకు విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 93 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు, -
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి!
ప్రముఖ సంగీత దర్శకులు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకి భారతరత్న ఇవ్వాలంటూ ప్రవాస భారతీయులు డిమాండ్ చేశారు. ఘంటసాల శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శంకర నేత్రాలయ (యూఎస్ఏ) అధ్యక్షులు బాల ఇందుర్తి ఆధ్వర్యములో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో 2022 ఏప్రిల్ 3న జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా బాల ఇందుర్తి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 48 మంది భారతరత్న అవార్డుకి ఎంపిక అవ్వగా, అందులో ఒక్క తెలుగువారు లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయత భువనచంద్ర, ఘంటసాల కుమార్తె శ్యామలలు ఖ్యఅతిధులుగా పాల్గొన్నారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ న్యూస్ ఎడిటర్ అఫ్ ఇండియా ట్రిబ్యూన్ రవి పోనంగి (యూఎస్), న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పూర్వ అధ్యక్షురాలు శ్రీలత మగతల, తెలుగు అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియా అధ్యక్షులు రుద్ర కొట్టు, ఇండోనేషియా తెలుగు అసోసియేషన్ ఉపాధ్యక్షులు శివరామ కృష్ణ బండారులతో పాటు ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో అనేక 53 టీవీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ టీవీ చర్చా కార్యక్రమాలకు ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలకి అనుసంధాన కర్తగా రత్న కుమార్ కవుటూరు (సింగపూర్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), ఆదిశేషు (ఆస్ట్రేలియా) వ్యవహరిస్తున్నారు. -
ఘంటశాలకి భారతరత్న ఇవ్వాలి
అమర గాయకుడు ఘంటసాలకి భారతరత్న పురస్కారం ఇవ్వాలని అమెరికాకి చెందిన శంకర నేత్రాలయ అధ్యక్షులు బాల ఇందుర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగా రెడ్డి ఊరిమిండి నిర్వహణలో 2022 మార్చి 20న మరొకసారి వర్చువల్ సమావేశం నిర్వహించారు. అన్నమాచార్య భువనవాహిని సంస్థ అధ్యక్షురాలు పద్మశ్రీి శోభారాజు మాట్లాడుతూ ఘంటసాలకి భారతరత్న ఇవ్వడం అంటే ఆయనకు ఘనమైన నివాళి అందివ్వడమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్, అట్లాంటా నుండి శంకర నేత్రాలయ పాలక మండలి సభ్యులు శ్రీనిరెడ్డి వంగిమళ్ళ, దక్షిణ ఆఫ్రికా నుండి దక్షిణాఫ్రికా తెలుగు కమ్యూనిటీ అధ్యక్షులు విక్రమ్ పెట్లూరు, ఒమాన్ నుంచి తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ కడించెర్ల, ఖతార్ నుంచి తెలుగు కళా సమితి అధ్యక్షులు ఉసిరికల్ల తాతాజీ, నార్వే నుంచి వీధిఅరుగు అధ్యక్షులు వెంకట్ తరిగోపుల, యూఏఈ నుంచి తెలుగు తరంగిణి అధ్యక్షులు వెంకట సురేష్, లండన్ నుంచి తెలుగు అసోసియేషన్ అఫ్ లండన్ ఉపాధ్యక్షులు రాజేష్ తోలేటి తదితరులు పాల్గొన్నారు. -
ఘంటసాల రత్నకుమార్‌కు ఘన నివాళి
కొరుక్కుపేట(తమిళనాడు): అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్‌కు పలువురు తెలుగు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.నవసాహితీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి వర్చువల్ విధానం ద్వారా ఘంటసాల రత్నకుమార్ సంస్మరణ సభను నిర్వహించారు. తనకంటూ ప్రత్యేకత స్థానాన్ని సంపాదించుకున్న రత్నకుమార్ దూరం కావడం తెలుగువారికి, సినీ పరిశ్రమకు తీరనిలోటని వ్యాఖ్యానించారు. ఘంటసాల జయంతి, వర్ధంతిని అధికారికంగా రెండు తెలుగు రాష్ట ప్రభుత్వాలు, పొట్టి శ్రీరాములు మెమోరియల్ కమిటీ జరపాలని కోరారు. అలాగే తెలుగువారికి చారిత్రాత్మక చిరునామాగా నిలిచిన ఆంధ్రాక్లబ్ ఆవరణంలో ఘంటసాల విగ్రహం స్థాపించాలన్నారు. వచ్చే డిసెంబర్లో ప్రారంభమయ్యే ఘంటసాల శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆ మహనీయునికి మనం అర్పించగల నివాళి ఇదే అని నవ సాహితీ ఇంటర్నేషనల్ తీర్మాణం చేసింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో నవ సాహితీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సూర్యప్రకాష్‌రావు, ఝాన్సీ లక్ష్మి, శ్రీలక్ష్మి, ఏపీ చాప్టర్ అధ్యక్షులు పద్మశ్రీ డాక్టర్ కూటి కుప్పల సూర్యారావు, చెన్నైలోని తెలుగు ప్రముఖులు జేకే రెడ్డి, సీఎంకే రెడ్డి, మాధవపెద్ది సురేష్, శ్రీదేవి రమేష్ లేళ్లపల్లి, మాధురి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, గుడిమెట్ల చెన్నయ్య, కందనూరు మధు, మాధవపెద్ది మూర్తి, భువనచంద్ర, డాక్టర్ మన్నవ గంగాధరప్రసాద్ పాల్గొన్నారు. -
ఘంటసాల రత్నకుమార్ కన్నుమూత
మధురమైన గానం, సంగీతంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత ఘంటసాల వెంకటేశ్వరరావు రెండో కుమారుడు ఘంటసాల రత్నకుమార్ (63)కన్నుమూశారు. చాలా రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రత్నకుమార్ పరిస్థితి విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా ఇటీవల కరోనా బారిన పడిన ఆయనకు రెండు రోజుల క్రితమే నెగటివ్ వచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు... ఘంటసాల వెంకటేశ్వరరావు అమర గాయకుడిగా పేరు గడిస్తే, రత్నకుమార్ మాత్రం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలనుకున్నా, సరైన బ్రేక్ రాలేదు రత్నకుమార్‌కి. ఆ సమయంలో తమిళ చిత్రం ‘కంచి కామాక్షి’కి తెలుగులో డబ్బింగ్ చెప్పారాయన. అప్పటినుంచి నాలుగు దశాబ్దాల కెరీర్లో వెయ్యికిపైగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, సంస్కృత చిత్రాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. పదివేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్‌కు గాత్రాన్ని ఇచ్చారు. 50కి పైగా డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ అందించారు. ఓ సందర్భంలో ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి, ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకున్నారు. అదే విధంగా ‘అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ ఆయన పేరు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ‘ఉత్తమ అనువాద కళాకారుడి’గా ‘తాత–మనవడు’ చిత్రంలో వినోద్‌కుమార్ పాత్రకు చెప్పిన డబ్బింగ్‌కి నంది అవార్డును అందుకున్నారు. ఇంకా తెలుగులో రోజా, బొంబాయి సినిమాల్లో అరవింద్ స్వామి పాత్రలకు, ‘పుణ్యస్త్రీ, అభినందన’ చిత్రాల్లో కార్తీక్ పాత్రలకు, ‘అన్నమయ్య’ తమిళ డబ్బింగ్ ‘అన్నమాచార్య’లో నాగార్జున పాత్రకు... ఇలా తన గాత్రంతో ఆ పాత్రలు హైలైట్ అయ్యేలా చేశారు రత్నకుమార్. ‘డాక్టర్ అంబేద్కర్’ చిత్రంలో టైటిల్ రోల్ చేసిన ఆకాష్ ఖురానాకి చెప్పిన డబ్బింగ్ తనకు చాలా సంతృప్తినిచ్చిందని పలు సందర్భాల్లో రత్నకుమార్ పేర్కొన్నారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ వంటి 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు. అలాగే ఒక మెగా సీరియల్, ఒక సినిమాకి దర్శకత్వం వహించాలనుకున్నారు. తన తండ్రి ఘంటసాల జ్ఞాపకార్థం ఓ భారీ సినిమా తీయాలనుకున్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే తుది శ్వాస విడిచారు. రత్నకుమార్‌కి భార్య కృష్ణకుమారి, కుమార్తెలు వీణ, వాణి ఉన్నారు. తల్లి సావిత్రమ్మ కూడా కొడుకు వద్దే ఉంటున్నారు. రత్నకుమార్ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖలు సంతాపం తెలిపారు. ఘంటసాల రత్నకుమార్ మరణం దక్షిణ భారత చలన చిత్ర రంగానికి తీరని లోటు అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగ¯Œ మోహ¯Œ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ఘంట సాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూత
-
నేనేప్పుడూ ఘంటసాల కాలేను: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
సాక్షి, విజయనగరం : ఘంటసాల గానం అజరామరమనీ... ఆయన నోట జాలువారిన ప్రతీపాట నాటికీ నేటికీ అందరినోట ఎక్కడో ఒక దగ్గర పలుకుతూనే ఉన్నాయనీ ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తెలుగు సంస్కృతిని, ఖ్యాతిని ప్రతిబింబించిన వారిలో ఆదిభట్ల, ద్వారం వెంకటస్వామినాయుడు ఆ తర్వాత స్థానంలో మహనీయుడు ఘంటసాలేనని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్, కిన్నెర కల్చరల్, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వహణలో 24 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవాలు ఆనందగజపతి కళాక్షేత్రంలో బుధవారం రాత్రి ముగిశాయి. కార్యక్రమంలో ముందుగా ఘంటసాల చిత్రపటం వద్ద ముఖ్యఅతిథి బాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘంటసాల చిరంజీవి అని, ఆయన పాటల ద్వారా మనందరిలోనూ జీవించే ఉన్నాడన్నారు. విజయనగరం కేవలం కళలకు మాత్రమే కాదనీ, పాటల పూదోట ఘంటసాల వంటి మహనీయులు నడయాడిన నేలఅనీ అభివర్ణించారు. నేటితరానికి ఆయన పాటలు, ఆ అక్షరాలను, పదాలను ఎలా పలకాలో, వాటి అర్థాలేంటో తల్లిదండ్రులు, పెద్దలు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. హరిత విజయనగరంగా జిల్లాను తీర్చిదిద్దిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎమ్.హరిజవహర్‌లాల్‌ను అభినందించారు. తానెప్పుడూ ఘంటసాలను కాలేనని, ఎస్పి బాలుగానే ఉండిపోతానన్నారు. కాలానికి తగ్గట్టుగా అనేక మార్పులొస్తాయని, కొన్నింటిని మార్చకూడదని అన్నారు. అమ్మ అమ్మే... అక్షరం అక్షరమే. ఘంటసాల కూడా అంతేనని తెలిపారు. ఈ గడ్డపై పుట్టిన వారెందరో మహనీయులు చిత్రపరిశ్రమలో మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారన్నారు. విజయనగరం కేవలం కళలకు మాత్రమే కాదని, ఎన్నో విషయాలకు ఇది పుట్టినిల్లు అని కొనియాడారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ రాష్ట్రకార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. నిత్యయవ్వనుడు బాలు అని, ఆయన 50ఏళ్లుదాటినప్పటికీ, వందేళ్లకి పైగా ఆయన సంగీత సరస్వతికి సేవలందించాలని కోరారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ.. ప్రవహిస్తున్న పాటల గంగాప్రవాహం ఎస్పి బాలు అని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిని దుశ్సాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీబీ పాడిన శివస్తుతి ఆద్యంతం ఆకట్టుకుంది. సంస్ధ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రంగస్ధల , టీవీ, సినిమా నటుడు యు.సుబ్బరాయశర్మ, మేకా కాశీవిశ్వేశ్వరుడు, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి రామకృష్ణ, భీష్మారావు, అధిక సంఖ్యలో సంగీతాభిమానులు పాల్గొన్నారు. -
కోడ్‌కు అడ్డంగా సవారీ
సాక్షి, ఘంటసాల : ఎన్నికల నిబంధనలు గాలిలో కలిసిపోతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఆ మాకేం పట్టిందంటూ వారి పనులు వారు చేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్‌ను పాటించాల్సిన అధికారులు మాత్రం కేవలం తమ కార్యాలయాలకు పరిమితం అవుతున్నారు. మండల కేంద్రమైన ఘంటసాల హైస్కూల్లో విద్యార్థినులకు పంపిణీ చేసేందుకు సైకిళ్లను సిద్ధం చేస్తున్నారు. మండలంలో 8, 9 తరగతులు చదువుతున్న 212 మందికి పంపిణీ చేసేందుకు కొత్త సైకిళ్లను ఇటీవల తీసుకువచ్చారు. స్కూల్లోనే రహస్యంగా పార్టులు అమర్చుతున్నారు. స్థానిక హైస్కూల్ వద్ద సైకిళ్లు బిగించే విషయమై ఎంఈఓ బీహెచ్‌సీ సుబ్బారావును సాక్షి వివరణ కోరగా సైకిళ్ల పంపిణీ విషయంలో తమకు సంబంధం లేదని, సంబంధిత కాంట్రాక్టర్‌కు షెల్టర్ కల్పించడం వరకే తమ పని అని మండలంలోని అన్ని హైస్కూల్స్‌కు సంబంధిత కాంట్రాక్టరే సైకిళ్లు పంపిణీ చేస్తాడని చెప్పారు. -
ఘంటసాలగారిలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు
‘‘ఘంటసాలగారికి సంబంధించిన నిజాలు చాలామందికి తెలియవు. ఆయన పాటలే కాదు.. ఆయన వ్యక్తిత్వం గురించి ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది’’ అని గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా సి.హెచ్.రామారావు దర్శకత్వంలో ‘ఘంటసాల’ సినిమా తెరకెక్కుతోంది. గాయకుడు కృష్ణ చైతన్య ఘంటసాల పాత్రలో, ఆయన సతీమణి మృదుల ఘంటసాల సతీమణి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సంగీతంలో పద్యాలు ఎలా పాడాలో నాకు నేర్పించింది ఘంటసాలగారే. వృత్తిపరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ఎంత వినయంగా ఉండాలి, ఎలా సంస్కారంగా ఉండాలనే విషయాలను ఆయన దగ్గరే నేర్చుకోవాలి. కృష్ణుడంటే భారతం.. రామాయణం అంటే రాముడు.. పాటలంటే అందరికీ ఘంటసాలగారు గుర్తొస్తారు. సినిమాల్లోకి రాక మునుపు ఆయన స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొన్నారు. ఆయనతో కలిసి ఆరేళ్ల పాటు జర్నీ చేసి, ఐదారు సినిమాలకు పనిచేశా. ఘంటసాలగారిని నా తండ్రి సమానుడిగా భావిస్తా. ఆయన విగ్రహావిష్కరణ సమయంలో నేను పడ్డ కష్టాలెన్నో నాకే తెలుసు. ఆయనలా పాడటం ఎవరికీ సాధ్యం కాదు. ఘంటసాల తర్వాతే.. ఎవరైనా గొప్పగా పాడుతున్నారని అంటారు. కానీ.. ఆయనంత గొప్పగా పాడుతున్నారని చెప్పరు. చెప్పలేరు.. చెప్పకూడదు కూడా. ఈ చిత్రం సెన్సార్ కావడానికి ముందే ఘంటసాలగారి భార్య సావిత్రమ్మకు సినిమా చూపించి ఏమైనా మార్పులుంటే చేస్తే మంచిది’’ అన్నారు. ‘‘ఘంటసాలగారి బయోపిక్ ఘన విజయం సాధించాలి’’ అని మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ‘‘ఘంటసాలగారిపై సినిమా చేస్తే నేనే చేయాలనే స్వార్థంతోనే ఈ సినిమా చేశా. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు సి.హెచ్.రామారావు. ‘‘ఘంటసాలగారితో పోల్చదగ్గ వ్యక్తి బాలసుబ్రహ్మణ్యంగారు మాత్రమే’’ అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. -
గుండెను తడిమేలా ఘంటసాల ది గ్రేట్
‘‘ఘంటసాల అంటే పాట. పాట అంటే ఘంటసాల అని మనందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియజేసేదే ఈ చిత్రం’’ అని ‘ఘంటసాల ది గ్రేట్’ చిత్రబృందం పేర్కొంది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. ఘంటసాల పాత్రను గాయకుడు కృష్ణచైతన్య పోషించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో ఆయన సతీమణి లక్ష్మీ నీరజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పోస్టర్స్‌ను దర్శకుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. డిసెంబర్లో రిలీజ్ కానున్న ఈ చిత్రం గురించి తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘‘రామారావు చేసిన ఈ సాహసాన్ని అభినందించాలి. పాత్రల గురించి బాగా స్టడీ చేసి సినిమా తీశారు’’ అన్నారు. ‘‘బయోపిక్‌లు తీయడం చాలా కష్టం. గట్స్ ఉండాలి. ఇందులో హీరోగా ఓ పాత్ర చేశాను. చాలా అనుభవం ఉన్న దర్శకుడిలా రామారావు వర్క్ చేశారు’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గొప్ప విజయాలను నమోదు చేయడమే కాకుండా గుండె తడి చేసి, గుండెను తడిమేసే సన్నివేశాలు ఈ కథలో ఉన్నాయి’’ అన్నారు సుదర్శన్. ‘‘నేను చాలా చిన్నవాణ్ని. మొదట ఈ సినిమా చేయకూడదనుకున్నా. ఇప్పుడు అలా ఎందుకు అన్నానా అనిపిస్తోంది. ఘంటసాలగారి పాటలు విన్నాం. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసు. ఈ సినిమాలో ఆయన వ్యక్తిత్వం తెలియజేస్తున్నాం’’ అన్నారు కృష్ణ చైతన్య. ‘‘ఘంటసాలగారి మీద ఆరాధనతో ఈ సినిమా తీశాను. మా కష్టాన్ని అభినందిస్తారనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: సాలూరి వాసూరావు, కెమెరా: వేణు వాదనల. -
నేను పుట్టింది నీ కోసం...
ఉర్దూ గజళ్లలో భాషా సౌందర్యం కవిత్వంతో పెనవేసుకుని ఉంటుంది. గాలిబ్ భాషా సౌందర్యాన్ని దాశరథి మాటల్లో చెప్పాలంటే, ‘ప్రతిదీ సులభమ్ముగా సాధ్యపడదులెమ్ము, నరుడు నరుడౌట యెంతొ దుష్కరమ్ము సుమ్ము’ వంటì ది. భాషలోని అతి లలిత పదాలని భావానికి తగినట్లుగా ఎన్నుకోవడమే గజల్ ప్రక్రియలోని ప్రతిభ. ప్రేయసి మీద విరహంతో తిరుగాడే ప్రేమికుల్ని గురించి ఒకే అక్షరాన్ని సైతం పదునుపెట్టిన బాణంలా వదలగలిగిన భాషా దురంధరుడు దాశరథి. గజల్ ప్రక్రియలో ‘షేర్’అనేది ముఖ్యం. రెండు పాదాలుండే షేర్ అంటే ‘పూలు’ అని అర్థం. అందుకే గులాబీపూవును దాశరథి ఈ పాటలో కవితా వస్తువుగా తీసుకున్నారు. అటువంటి ఒక అద్భుత గజల్‌ను తెలుగు సినిమాకు ఆయన రాయడం, ఆ గజల్‌ను హిందోళరాగంలో మా నాన్నగారు (మాస్టర్ వేణు) స్వరపరచి ఘంటసాలగారి మధురగళంలో రికార్డు చేయడం... అన్నింటికీ మించి ఎప్పుడూ మా నాన్నగారి రికార్డింగుకి వెళ్లని నేను ఆ పాట రికార్డింగుకు వెళ్లడం... అదే ఘంటసాలగారు పాటలు పాడిన చివరి సినిమా కావడం యాదృచ్ఛికం. ఘంటసాల గారు స్వయంగా మా ఇంటికి వచ్చి, నాన్నగారి దగ్గర కూర్చుని ఈ పాట నేర్చుకున్నారు. ఆ రోజులలో కమిట్మెంట్ అలా ఉండేది. ‘మధురమైన ఈ మంచి రేయిని వృథా చేయకే సిగ్గులతో’ అనే చరణంలో కాని, ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీ కోసం’ అనే చరణంలో కాని కొన్ని అన్య స్వరాలు అనివార్యమైనా, వాటి ఛాయలు కనపడనీయకుండా, ‘హిందోళ’ రాగంలో అద్భుతంగా స్వరపరచడం మాస్టర్వేణుగారి ప్రతిభకు తార్కాణం అని నేను భావిస్తాను. తెలుగు చలనచిత్రసీమకు పరిచయం కాని తొలిరోజుల్లో బొంబాయిలో మేస్ట్రో నౌషాద్ అలీ వద్ద గడపడం, బేగమ్ అఖ్తర్, మెహదీ హసన్‌ల గజల్ ప్రక్రియలను దగ్గరగా పరిశీలించడం నాన్నగారికి గజల్ ప్రక్రియ మీద మోజును పెంచింది. తెలుగులో గజళ్లు వినిపించగలిగే అవకాశం వారికి రాలేదు. యువ నిర్మాతలు మహమ్మద్ రంజాన్ అలీ, మహమ్మద్ ఖమరుద్దీన్లు హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వంలో నిర్మించిన ‘మా ఇంటి దేవత’ చిత్రంతో ఆ ఆశ తీరింది. దురదృష్టవశాత్తు ఈ చిత్ర నిర్మాణం ఒడిదొడుకులకు లోనైంది. 1973లో మొదలుపెట్టిన సినిమా 1980 దాకా విడుదలకు నోచుకోలేదు. ఘంటసాల 1974లో కాలం చేసిన తరవాత ఆరేళ్లకు గానీ ఈ సినిమా విడుదల కాలేదు. కలర్ సినిమాలు ఊపందుకున్న తరవాత ఈ సినిమా విడుదల కావడంతో దీనికి గుర్తింపు రాలేదు. ఇది హిందీ సినిమా కాజల్‌కు రీమేక్. దాశరథి రచించిన ఈ పాటలో పల్లవితోనే అడుగడుగునా మీర్జాగాలిబ్ కళ్లలో మెదలుతాడు. ‘విందులు చేసే నీ అందాలు నా మదిలోనే చిందాలి’ అంటూనే ‘నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి’ అంటాడు. కానీ ‘తాగాలి’ అనడు. అదే దాశరథి సున్నితమైన కవితా దృక్కోణం. ‘చంద్రుని ముందర తార వలె నా సందిట నీవే వుండాలి’ అంటూ ‘ఈ మధువంతా నీ కోసం, పెదవుల మధువే నా కోసం’ అని మధువును, మగువను ఏకదృష్టితో సంబోధిస్తాడు. ఇటువంటి అద్భుత రచనకు సంగీతం నిర్వహించే అదృష్టం నాన్నగారికి దక్కడం అదృష్టమే. నిర్మాతలు ఉర్దూ సంప్రదాయాలు తెలిసినవారు కావడం, గజల్ సంస్కృతి మీద మక్కువ వుండడం ఈ పాట సృష్టికి దోహదం చేసిన అంశాలు. మరో చరణంలో ‘మధువు పుట్టింది నా కోసం, నేను పుట్టింది నీకోసం’ అంటారు దాశరథి. ఇది ఒక అద్భుతమైన పోలిక. అందుకే గజల్ భాషా సంపద గొప్పది. అటువంటి పాట తెలుగులో రాసిన దాశరథి కూడా గొప్పవారు. అంతటి గొప్ప పాటకు స్వరపరచిన మా నాన్నగారు అదృష్టవంతులు. అందుకే ఈ పాట నాకు చాలా ఇష్టమైనది. సినిమా విజయవంతం కాకపోవడంతో ఈ పాట మరుగున పడిన మణిపూసైపోయింది. ఈ చిత్రానికి నిర్మాతలు రిజిస్టర్ చేసిన అసలు పేరు ‘కంటికి కాటుక – ఇంటికి ఇల్లాలు’. విడుదల ఆలస్యం కావడం వలన దానిపేరు ‘మా ఇంటి దేవత’ గా మారిపోయింది. కృష్ణ నటించిన ఆఖరి బ్లాక్ అండ్ వైట్ చిత్రమిది. హరనాథ్ తను కోల్పోయిన స్టార్‌డమ్‌ను తిరిగి సాధించేందుకు హాస్యనటుడు పద్మనాభం, కృష్ణ, జమునల సహకారంతో నిర్మాతలు వెనక ఉండి నటించిన చిత్రం. జాతీయాలు ఉంగరాల చేతి మొట్టికాయ ఎవరైనా పిడికిలి బిగించి నెత్తి మీద లాగిపెట్టి మొట్టికాయ వేస్తే నొప్పి పుడుతుంది. మామూలు చేతి మొట్టికాయకే అంత నొప్పి పుడితే, అలాంటిది వేళ్ల నిండా ఉంగరాలు తగిలించుకున్న ధన మదాంధుడెవడైనా కసిదీరా మొట్టికాయ వేశాడనుకోండి ఆ దెబ్బకి ఎలాంటి వాళ్లకైనా కళ్లు బైర్లు కమ్ముతాయి. ఉంగరాల తాకిడికి నెత్తి బొప్పి కడుతుంది. సాదాసీదా మనుషులు ఎవరైనా ధనబలం, అధికార బలం గల వారితో అనవసర వైరం పెట్టుకుని, వాళ్ల ద్వారా కీడు కొని తెచ్చుకునే సందర్భాల్లో ఉంగరాల చేతి మొట్టికాయలు తిన్నారనడం పరిపాటి. ఐదు పది చేయడం ఐదు పది చేయడమంటే ఐదో ఎక్కం చదవడం కాదు. ఒక్కో చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. రెండు చేతులూ జోడిస్తే రెండు చేతుల వేళ్లూ కలిపి పది వేళ్లవుతాయి. ఇలా రెండు చేతులూ జోడించడాన్నే ఐదు పది చేయడం అంటారు. గౌరవంతోనో, భక్తి ప్రపత్తులతోనో చేతులు జోడించే సందర్భాల్లో ఈ మాట అనరు. ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు, అధికార నిరంకుశుడైనప్పుడు వానితో తలపడటం సాధ్యం కాదని తలచినప్పుడు, లొంగుబాటే శరణ్యమనే పరిస్థితుల్లో చేతులు జోడించినప్పుడే ఐదు పది చేశాడంటారు. కాకదంతపరీక్ష కాకులకు దంతాలు ఉండవు. లేని దంతాలను పరీక్షించాల్సిన అగత్యం కూడా ఎవరికీ ఉండదు. అయితే, తమను తాము మేధావులుగా తలచే కొందరు ఏమీ లేని విషయమై గంభీర పరిశోధనలు సాగిస్తుంటారు. ఫలితమివ్వని పరీక్షలు చేస్తూ అనవసరంగా ప్రయాస పడుతూ అందరిలో నవ్వుల పాలవుతుంటారు. పనికి మాలిన విషయమై ఎవరైనా గంభీరంగా పరీక్షలు, పరిశోధనలు చేస్తున్నట్లు కనిపిస్తే, అలాంటి వాళ్లను కాకదంత పరీక్షలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తుంటారు. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి -
గాలి పెదవులే మెల్లగ సోకిన...
చాలాసార్లు సినిమా పాటకు నేపథ్య సంగీతం, పాడినవారి సామర్థ్యం, నటీనటుల అభినయం తోడవడంవల్ల ఆ పాట మరో స్థాయికి వెళ్తుంది. అలా వెళ్లిన ప్రతిపాటలోనూ సాహిత్య విలువ ఉందని చెప్పలేం. కానీ కొన్ని పాటల్లో పైని సానుకూలతలన్నీ ఉంటూనే గొప్ప పంక్తులు పలుకుతాయి. ఉదాహరణకు 1955లో వచ్చిన ‘సంతానం’ సినిమాలోని చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో పాట తీసుకోండి. పాట మధ్యలో– గాలి పెదవులే మెల్లగ సోకిన పూలు నవ్వెనే నిద్దురలో అని వస్తుంది. ఎంత సున్నితమైన వ్యక్తీకరణ! ఆ మృదుత్వం చెవులకు తెలుస్తుంది. ఆ కవిత్వం హృదయాన్ని తాకుతుంది. ఈ గీతరచన అనిసెట్టి. సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. పాడింది ఘంటసాల. అభినయించింది అక్కినేని, సావిత్రి. ఇన్ని మేలిమి గుణాలన్నీ కలిసి ఈ పాటను ఎన్నో మెట్లు ఎక్కించాయి. -
గుండేరులో ఇద్దరు గల్లంతు
-
గుండేరులో ఇద్దరు గల్లంతు
ఘంటసాల : గుండేరు డ్రెయిన్‌లో ఇద్దరు విద్యార్థినులు గల్లంతైన ఘటన అన్నదమ్ముల ఇళ్లలో విషాదం నింపింది. ఈ ఘటన మండల కేంద్రమైన ఘంటసాలలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామంలోని జ్ఞానోదయకాలనీకి చెందిన చెందిన చేనేత కార్మికులు మునగాల సాంబశివరావు, మునగాల శ్రీనివాసరావు అన్నదమ్ములు. సాంబశివరావు, శైలజ దంపతులకు కుమార్తె నళిని, కుమారుడు గోపి ఉన్నారు. నళిని బీఎస్సీ ద్వితీయ చదువుతూనే ఇంటి వద్ద 20 మంది విద్యార్థులకు ట్యూషన్ చెబుతోంది. ఆమె కాలేజీ టాపర్. గోపి పదోతరగతి చదువుతున్నాడు. శ్రీనివాసరావు, శశిరేఖ దంపతుల పెద్ద కుమార్తె శ్రీలత బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, రెండో కుమార్తె చైతన్య బీఎస్సీ మొదటిసంవత్సరం చదువుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో నళిని, చైతన్య తమ సోదరుడు గోపి, స్నేహితులు కె.మౌనిక, తులసితో కలసి ఆటోలో గ్రామ శివారులోని ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి గుండేరు బెడ్ రెగ్యులేటర్‌ను చూడటానికి వచ్చారు. అక్కడ కాళ్లు కడుక్కుందామని మెట్లు దిగారు. అయితే కాళ్లు జారి చైతన్య, నళిని నీటిప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాముటిన గుండేరు బెడ్ రెగ్యులేటర్ వద్దకు వచ్చి పిల్లల కోసం గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. ఘంటసాల ఎస్ఐ కె.వి.జి.వి. సత్యనారాయణ ప్రమాద స్థలానికి చేరుకుని స్థానిక ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు మొవ్వ అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలపడంతో వారు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సాంబశివరావు, శైలజ శ్రీనివాసరావు, శశిరేఖ దంపతులు తమ కుమార్తెల కోసం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు విద్యార్థినులు నీటిలో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మూడో తరం మెరుపులు
ఒకరేమో మధుర గాయకుడు ఘంటసాల మనుమరాలు, ఇంకొకరేమో ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మనుమడు. వీరిద్దరూ తమదైన శైలిలో చిత్రసీమలో మెరుపులు మెరిపిస్తున్నారు. ఘంటసాల మనుమరాలైన వీణా ఘంటసాల కూడా తాతగారి లానే నేపథ్య గాత్రధారిణి అయింది. అనువాద చిత్రాలకు గాత్రదానమూ చేస్తోంది. ఇక, సాలూరు రాజేశ్వరరావు మనుమడైన మునీష్ కూడా అచ్చం తన తాతగారి లానే నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తమిళంలో రెండు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు సినీ, సంగీత ప్రముఖుల కుటుంబంలో మూడో తరం వారైన వీరిద్దరూ తమ గురించి ఏం చెబుతున్నారంటే... అజిత్ తమ్ముడని పిలుస్తున్నారు - మునీష్ నేను సాలూరు రాజేశ్వరరావు గారి మనుమణ్ణి.. ఇది నేను చాలా గర్వంగా చెప్పుకునే అంశం. తాతయ్య సంగీత దర్శకుడు కాకముందు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మా నాన్నగారు సాలూరు వాసూరావు కూడా సంగీత దర్శకులుగా ఫేమస్. మా కుటుంబంలో అందరూ సంగీతాన్నే నమ్ముకున్నారు. నేను కూడా ఆడియో ఇంజినీరింగ్ చదివాను. పియానో నేర్చుకున్నాను. అనుకోకుండా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. మొత్తం 12 యాడ్స్ చేశాను. అలా నాకు నటనపై ఆసక్తి మొదలైంది. సినిమాల్లో నటిస్తానని నాన్న గారికి చెబితే బాగా ప్రోత్సహించారు. నటనను సీరియస్‌గా తీసుకొమ్మని సలహా ఇచ్చారు. అందుకే కొన్నాళ్ళు యాక్టింగ్ కోర్సు చేశా. మొదట ‘నాంగ’ అనే తమిళ సినిమాలో ఐదుగురు హీరోల్లో ఒకరిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘వీరమ్’లో అజిత్ తమ్ముడిగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను బయట కనబడితే ‘తలై తంబీ’ అని పిలుస్తున్నారు. తమిళనాట అభిమానులు అజిత్‌ని ‘తలై’ (నాయకుడు) అని పిలుస్తుంటారు. షూటింగ్ సమయంలో అజిత్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరిచిపోలేను. ‘వీరమ్’ను తెలుగులో ‘వీరుడొక్కడే’గా అనువదించారు. తెలుగులో కూడా నా పాత్రకు మంచి పేరొచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా నటిస్తాను. కథానాయక పాత్రలనే కాకుండా గుర్తింపు ఉండే పాత్ర ఏది అయినా చేస్తాను. తాతగారే ఇన్స్పిరేషన్ - వీణ ఘంటసాల పేరు చెబితే చాలు ఇప్పటికీ తెలుగు ప్రజలు పులకరించిపోతారు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఆయన మనుమరాలిగా పుట్టాను. తాతయ్య ఇన్స్పిరేషన్ తోనే నేను నేపథ్య గాయనిని కావాలనుకున్నాను. కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. వీణ కూడా వాయిస్తాను. మా నాన్నగారు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పాపులర్. చిన్నప్పుడు నాన్నగారు నాతో కొన్ని కార్టూన్ సీరియల్స్‌కు డబ్బింగ్ చెప్పించారు. అందుకే పాట పాడడం, డబ్బింగ్ చెప్పడం నాకు రెండు కళ్ళు అయిపోయాయి. ‘ఉరిమి’ (మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్)లో ‘చిన్ని చిన్ని’ పాట, ‘అందాల రాక్షసి’ చిత్రంలో ‘నే నిన్ను చేరా’ పాటలతో గాయనిగా నా ప్రయాణం మొదలైంది. ఓ పక్క పాటలు పాడుతూనే, డబ్బింగ్ కూడా చెబుతున్నాను. కార్తీ నటించిన ‘బిర్యానీ’ తెలుగు అనువాదంలో హాన్సికకు డబ్బింగ్ చెప్పింది నేనే. మొన్న నితిన్ ‘హార్ట్ ఎటాక్’లో హీరోయిన్ అదా శర్మకు నేనే గాత్రదానం చేశాను. నాకెంత పేరొచ్చిందో! దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా మెచ్చుకున్నారు. రాబోయే బాలకృష్ణ ‘లెజెండ్’లో కథానాయిక రాధికా ఆప్టేకు నా గళమిచ్చా. సింగింగ్, డబ్బింగ్... రెండూ చేయడాన్ని రెండు పడవల మీద కాళ్ళు అనుకోవడం లేదు. రెండూ నాకిష్టమే. రెండింటికీ న్యాయం చేయగలను. ఈ విషయంలో అటు గాయనీమణులుగా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా రాణిస్తున్న చిన్మయి, సునీతలు నాకు ఆదర్శం. నా చదువు సంగతికొస్తే, ఇటీవలే ఏంబీఏ పూర్తి చేశా. కానీ నాకు సినిమా రంగంలోనే స్థిరపడాలని ఉంది. దేవుడి దయ వల్ల, తాతగారి అభిమానుల ఆశీర్వాద బలం వల్ల మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి.