మూడో తరం మెరుపులు | The third-generation lightning | Sakshi
Sakshi News home page

మూడో తరం మెరుపులు

Published Wed, Mar 26 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

మూడో తరం మెరుపులు

మూడో తరం మెరుపులు

ఒకరేమో మధుర గాయకుడు ఘంటసాల మనుమరాలు, ఇంకొకరేమో ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మనుమడు. వీరిద్దరూ తమదైన శైలిలో చిత్రసీమలో మెరుపులు మెరిపిస్తున్నారు. ఘంటసాల మనుమరాలైన వీణా ఘంటసాల కూడా తాతగారి లానే నేపథ్య గాత్రధారిణి అయింది. అనువాద చిత్రాలకు గాత్రదానమూ చేస్తోంది. ఇక, సాలూరు రాజేశ్వరరావు మనుమడైన మునీష్ కూడా అచ్చం తన తాతగారి లానే నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తమిళంలో రెండు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇద్దరు సినీ, సంగీత ప్రముఖుల కుటుంబంలో మూడో తరం వారైన వీరిద్దరూ తమ గురించి ఏం చెబుతున్నారంటే...
 
 అజిత్ తమ్ముడని పిలుస్తున్నారు - మునీష్

 నేను సాలూరు రాజేశ్వరరావు గారి మనుమణ్ణి.. ఇది నేను చాలా గర్వంగా చెప్పుకునే అంశం. తాతయ్య సంగీత దర్శకుడు కాకముందు హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మా నాన్నగారు సాలూరు వాసూరావు కూడా సంగీత దర్శకులుగా ఫేమస్. మా కుటుంబంలో అందరూ సంగీతాన్నే నమ్ముకున్నారు. నేను కూడా ఆడియో ఇంజినీరింగ్ చదివాను. పియానో నేర్చుకున్నాను. అనుకోకుండా మోడలింగ్ చేసే అవకాశం వచ్చింది. మొత్తం 12 యాడ్స్ చేశాను.  అలా నాకు నటనపై ఆసక్తి మొదలైంది. సినిమాల్లో నటిస్తానని నాన్న గారికి చెబితే బాగా ప్రోత్సహించారు. నటనను సీరియస్‌గా తీసుకొమ్మని సలహా ఇచ్చారు. అందుకే కొన్నాళ్ళు యాక్టింగ్ కోర్సు చేశా. మొదట ‘నాంగ’ అనే తమిళ సినిమాలో ఐదుగురు హీరోల్లో ఒకరిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత ‘వీరమ్’లో అజిత్ తమ్ముడిగా ఆఫర్ వచ్చింది. ఈ సినిమా కూడా  పెద్ద హిట్ కావడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. నేను బయట కనబడితే ‘తలై తంబీ’ అని పిలుస్తున్నారు. తమిళనాట అభిమానులు అజిత్‌ని ‘తలై’ (నాయకుడు) అని పిలుస్తుంటారు. షూటింగ్ సమయంలో అజిత్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరిచిపోలేను. ‘వీరమ్’ను తెలుగులో ‘వీరుడొక్కడే’గా అనువదించారు. తెలుగులో కూడా నా పాత్రకు మంచి పేరొచ్చింది. తమిళంతో పాటు తెలుగులో కూడా నటిస్తాను. కథానాయక పాత్రలనే కాకుండా గుర్తింపు ఉండే పాత్ర ఏది అయినా చేస్తాను.
 
 
 తాతగారే ఇన్‌స్పిరేషన్ - వీణ


 ఘంటసాల పేరు చెబితే చాలు ఇప్పటికీ తెలుగు ప్రజలు పులకరించిపోతారు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఆయన మనుమరాలిగా పుట్టాను. తాతయ్య ఇన్‌స్పిరేషన్ తోనే నేను నేపథ్య గాయనిని కావాలనుకున్నాను. కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. వీణ కూడా వాయిస్తాను. మా నాన్నగారు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పాపులర్. చిన్నప్పుడు నాన్నగారు నాతో కొన్ని కార్టూన్ సీరియల్స్‌కు డబ్బింగ్ చెప్పించారు. అందుకే పాట పాడడం, డబ్బింగ్ చెప్పడం నాకు రెండు కళ్ళు అయిపోయాయి. ‘ఉరిమి’ (మలయాళ చిత్రం తెలుగు డబ్బింగ్)లో ‘చిన్ని చిన్ని’ పాట, ‘అందాల రాక్షసి’ చిత్రంలో  ‘నే నిన్ను చేరా’ పాటలతో గాయనిగా నా ప్రయాణం మొదలైంది. ఓ పక్క పాటలు పాడుతూనే, డబ్బింగ్ కూడా చెబుతున్నాను. కార్తీ నటించిన ‘బిర్యానీ’ తెలుగు అనువాదంలో హాన్సికకు డబ్బింగ్ చెప్పింది నేనే. మొన్న నితిన్ ‘హార్ట్ ఎటాక్’లో హీరోయిన్ అదా శర్మకు నేనే గాత్రదానం చేశాను. నాకెంత పేరొచ్చిందో! దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా మెచ్చుకున్నారు.

రాబోయే బాలకృష్ణ ‘లెజెండ్’లో కథానాయిక రాధికా ఆప్టేకు నా గళమిచ్చా. సింగింగ్, డబ్బింగ్... రెండూ చేయడాన్ని రెండు పడవల మీద కాళ్ళు అనుకోవడం లేదు. రెండూ నాకిష్టమే. రెండింటికీ న్యాయం చేయగలను.  ఈ విషయంలో అటు గాయనీమణులుగా, ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్‌లుగా రాణిస్తున్న చిన్మయి, సునీతలు నాకు ఆదర్శం. నా చదువు సంగతికొస్తే, ఇటీవలే ఏంబీఏ పూర్తి చేశా. కానీ నాకు సినిమా రంగంలోనే స్థిరపడాలని ఉంది. దేవుడి దయ వల్ల, తాతగారి అభిమానుల ఆశీర్వాద బలం వల్ల మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement