గుండేరులో ఇద్దరు గల్లంతు
గుండేరులో ఇద్దరు గల్లంతు
Published Sun, Sep 4 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
ఘంటసాల :
గుండేరు డ్రెయిన్‌లో ఇద్దరు విద్యార్థినులు గల్లంతైన ఘటన అన్నదమ్ముల ఇళ్లలో విషాదం నింపింది. ఈ ఘటన మండల కేంద్రమైన ఘంటసాలలో ఆదివారం సాయంత్రం జరిగింది.
గ్రామంలోని జ్ఞానోదయకాలనీకి చెందిన చెందిన చేనేత కార్మికులు మునగాల సాంబశివరావు, మునగాల శ్రీనివాసరావు అన్నదమ్ములు. సాంబశివరావు, శైలజ దంపతులకు కుమార్తె నళిని, కుమారుడు గోపి ఉన్నారు. నళిని బీఎస్సీ ద్వితీయ చదువుతూనే ఇంటి వద్ద 20 మంది విద్యార్థులకు ట్యూషన్ చెబుతోంది. ఆమె కాలేజీ టాపర్. గోపి పదోతరగతి చదువుతున్నాడు. శ్రీనివాసరావు, శశిరేఖ దంపతుల పెద్ద కుమార్తె శ్రీలత బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, రెండో కుమార్తె చైతన్య బీఎస్సీ మొదటిసంవత్సరం చదువుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో నళిని, చైతన్య తమ సోదరుడు గోపి, స్నేహితులు కె.మౌనిక, తులసితో కలసి ఆటోలో గ్రామ శివారులోని ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి గుండేరు బెడ్ రెగ్యులేటర్‌ను చూడటానికి వచ్చారు. అక్కడ కాళ్లు కడుక్కుందామని మెట్లు దిగారు. అయితే కాళ్లు జారి చైతన్య, నళిని నీటిప్రవాహంలో కొట్టుకెళ్లారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హుటాముటిన గుండేరు బెడ్ రెగ్యులేటర్ వద్దకు వచ్చి పిల్లల కోసం గాలించారు. అయినా ఫలితం కనిపించలేదు. ఘంటసాల ఎస్‌ఐ కె.వి.జి.వి.
సత్యనారాయణ ప్రమాద స్థలానికి చేరుకుని స్థానిక ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులతో పాటు మొవ్వ అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలపడంతో వారు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా గాలింపు చర్యలు చేపట్టారు. సాంబశివరావు, శైలజ శ్రీనివాసరావు, శశిరేఖ దంపతులు తమ కుమార్తెల కోసం కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు విద్యార్థినులు నీటిలో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement