ఘంటసాలకు భారతరత్న కోసం కలిసి పోరాడుదాం | Bharatratna-Ghantasala-Signature-Campaign Roja | Sakshi
Sakshi News home page

ఘంటసాలకు భారతరత్న కోసం కలిసి పోరాడుదాం: మంత్రి రోజా

Published Wed, Jul 6 2022 10:40 PM | Last Updated on Thu, Jul 7 2022 1:23 PM

Bharatratna-Ghantasala-Signature-Campaign Roja  - Sakshi

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావుకు భారతరత్న పురస్కారం తెలుగువారంతా కలిసి ప్రయత్నించాలని టూరిజం, సంస్కృతి, యువజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకరనేత్రాలయ యూఎస్‌ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఘంటసాల పేరు వినపడగానే మన అందరికి సుమధురమైన పాటలు గుర్తుకువస్తాయని అన్నారు. ఘంటసాల గాయకుడు మాత్రమే కాదని స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితం గడిపిన విషయాన్ని గుర్తుచేశారు. ఘంటసాల శతజయంతి సందర్భంగా ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవాలని తెలుగువారంతా కోరుకుంటున్నారని చెప్పారు. 

మరొక ముఖ్య అతిథి తనికెళ్ల భరణి మాట్లాడుతూ..  ఘంటసాల అమర గాయకుడని, భగవద్గీతని వింటున్నప్పుడు భగద్గీతని గానం చేయడం కోసమే ఆయన జన్మించినట్టుగా అనిపిస్తుందన్నారు. తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహాదీక్ష చేస్తూ చనిపోయినపుడు వారికి అంత్యక్రియలు జరపడానికి ఎవరు ముందుకు రాని సందర్భంలో తన ఉత్తేజమైన పాటలతో మద్రాస్‌ లో వున్నా తెలుగువారందని రప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. యావత్ భూగోళంలో నివసిస్తున్న తెలుగు వారందరు ఏకతాటిపై వచ్చి ఘంటసాలకు భారతరత్న కోసం చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందించారు. 

మరొక విశిష్ట అతిధి రామజోగయ్య శాస్త్రిమాట్లాడుతూ.. ఘంటసాలను కారణజన్ముడిగా వర్ణించారు. శత జయంతి సందర్భంగా వారికి భారతరత్న ఇవ్వాలనే ఒక నినాదంతో చేస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. చాలామందికి మరణాంతరం భారతరత్న ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నామని, అలాంటి వాళ్ళలో ముందువరుసలో ఉండే వారు ఘంటసాల అని పేర్కొన్నారు. ఘంటసాల విశిష్టత, బహుముఖప్రజ్ఞ గురించి ఎంత చెప్పిన తనివితీరదని, ఆయనకు కచ్చితంగా భారతరత్న ఇవ్వాలని కోరుకున్నారు. 


చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి మాట్లాడుతూ.. నిర్వాహకులను అభినందించారు. ఇటీవల మంత్రి రోజాను కలిసినట్టు వెల్లడించారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని కలిసే అవకాశం కల్పించి ఈ మహాయజ్ఞాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి తనవంతు కృషి చేస్తానని రోజా హామీ ఇచ్చారని తెలిపారు. సింగపూర్ నుంచి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ.. ఇప్పటిదాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న 33 దేశాల సేవలను కొనియాడారు. 

యూఎస్‌ఏ నుంచి నాటా మాజీ అధ్యక్షుడు, ఫిలడెల్ఫియా డా. రాఘవ రెడ్డి గోసాల, శంకర నేత్రాలయ  బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, అట్లాంటా , శ్రీని వంగిమల్ల,  కలైవాణి డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్, అట్లాంటా,  శ్రీమతి  పద్మజ కేలం, శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, రాక్‌విల్లే ఉదయ్ భాస్కర్ గంటి,  శంకర నేత్రాలయ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆస్టిన్, డాక్టర్ జగన్నాథం వేదుల, జర్మనీ నుంచి రాజా రమేష్ చిలకల, భారతదేశం నుంచి బ్యాంక్ ఆఫ్ శ్రీ ఘంటసాల (స్థాపించినది. 1974) మచిలీపట్నం, కోలపల్లి విఆర్ హరీష్ నాయుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఘంటసాలకి భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడుతూ, ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలని అందరూ ముక్తకంఠంతో కోరారు. విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా ఏకతాటిపై తెచ్చి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రామ్ దుర్వాసుల(యూఎస్‌ఏ) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 

ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికా లోని పలు తెలుగు జాతీయ సంస్థల సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, తైవాన్ , ఐర్లాండ్, జపాన్  స్విట్జర్లాండ్, నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 143 టీవీ కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (change.org/BharatRatnaForGhantasalaGaru) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాల ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటే ఈమెయిల్‌కు ghantasala100th@gmail.com వివరాలు పంపవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement