
హీరో హీరోయిన్లు లేని చిత్రం
నటి నయనతార దొరా అనే చిత్రంలో డ్యూయెట్లు, రొమాన్స్ సన్నివేశాలు లేని చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా డ్యూయెట్లు,రొమాన్స్ సన్నివేశాలే కాదు అసలు హీరోహీరోయిన్లు లేకుండా ఒక చిత్రం తెరకెక్కింది. దాని పేరు గిల్లి బంబరం గోలి. శ్రీ సాయి ఫిలింస్ పతాకంపై డి.మనోహరన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ్, ప్రసాద్, నరేశ్, సంతోష్‌కుమార్, దీప్తీశెట్టి ప్రధాన పాత్రలు పోషించారు.
నిర్మాత మనోహరన్‌నే కథ, దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రానికి వైఆర్.ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రం గురించి దర్శక నిర్మాత మనోహరన్ తెలుపుతూ విదేశాల్లో పనిచేసే ముగ్గురు యువకులు, ఒక యువతి కొన్ని వేర్వేరు సంఘటనల ద్వారా కలిసి స్నేహితులవుతారన్నారు.అక్కడ ఒక విలన్ కారణంగా వారు సమస్యలకు గురై ఆ ఊరునే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు.
అయితే వారు ఆ ఊరును వదిలి వెళ్ల కుండా, రక్తపాతం జరగకుండా చేపట్టిన ఆయుధమే గిల్లి బంబరం గోలి అని తెలిపారు. చిత్రాన్ని పూర్తిగా మలేషియాలో చిత్రీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం స్థానిక వడపళనిలోని కమల సినీ థియేటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు పాటలు, ప్రచార చిత్రం బాగున్నాయంటూ ప్రశంసించారు.