
అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నా!
నయనతార సినిమాల్లో తప్ప, బయట ఫంక్షన్లలోనూ ఇతర వేడుకల్లోనూ ఎక్కడా కనబడరు. ఏడాదికి మహా అయితే ఒకటి రెండు సార్లు ఏదైనా అవార్డు ఫంక్షన్‌లోనో, ఆడియో ఫంక్షన్‌లోనో మెరుస్తారు. అంతకు మించి పబ్లిక్‌గా ఆమె దర్శనాలు ఉండవు. ఆమెకు స్నేహితులు కూడా చాలా చాలా తక్కువ. ఇంత పెద్ద సినీ ప్రపంచంలో తక్కువ మంది స్నేహితులు ఉండటమేంటి? నయనతారకు ఫ్రెండ్‌షిప్ చేయడం ఇష్టం ఉండదా?... ఈ విషయం గురించి ఓ సందర్భంలో నయనతార మాట్లాడుతూ -‘‘స్నేహితులు ఉండాలని అందరికీ ఉంటుంది. స్నేహం చేయడం నాకిష్టమే. కానీ, కొంతమంది స్నేహితుల కారణంగా బాధపడ్డాను. నా ముందు ఒకలా.. నా వెనకాల మరోలా మాట్లాడేవాళ్లు. అలాంటి స్నేహితుల అవసరం లేదనిపించింది.
అందుకే వాళ్లకు దూరంగా ఉంటున్నాను. నేను ముక్కుసూటిగా మాట్లాడతాను. నిజాయతీగా వ్యవహరిస్తాను. నాతో స్నేహం చేసేవాళ్లు కూడా అలానే ఉండాలని ఆశిస్తాను. లేకపోతే బాధపడిపోతాను. చివరకు వాళ్లతో స్నేహాన్ని వదిలేసుకుంటాను’’ అన్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఒక విధంగా వరం.. మరో విధంగా శాపం అని కూడా నయనతార అన్నారు. ‘‘నాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉండేవాళ్లు నన్ను ఇష్టపడతారు. లేనివాళ్లు తిట్టుకుంటారు. అందుకే, ముక్కుసూటితనం వరం.. శాపం.. అంటున్నా’’ అని పేర్కొన్నారామె.