
సినిమా వివాదం.. యువతులపై లైంగిక వేధింపులు!
కోల్ కతా: సినిమా షూటింగ్ వివాదానికి తెరతీసింది. ఆపై యువతులపై లైంగిక వేధింపుల వరకు ఘటన వెళ్లింది. పశ్చిమబెంగాల్ లోని జాదవపూర్ యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ, లెఫ్ట్ వింగ్ మద్ధతుదారుల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో నలుగురు ఏబీవీపీ సభ్యులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం... వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ మూవీ 'బుద్ధా ఇన్ ఏ ట్రాఫిక్ జామ్' వివాదాస్పదమైంది. జాదవపూర్ వర్సిటీలో శుక్రవారం రాత్రి ఈ డైరెక్టర్ కు నల్లజెండాలతో నిరసన తెలిపడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోవాలని వామపక్ష వర్గానికి చెందినవారు నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ మూవీ యూనిట్ కు మద్ధతు తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తనపై కూడా దాడి జరిగిందని, తనపై కొందరు చెయ్యి చేసుకున్నారని డైరెక్టర్ అగ్నిహోత్రి ఆరోపించారు. ఇరువర్గాల మద్ధతుదారుల గొడవ మహిళలపై అసభ్యప్రవర్తను దారితీసింది. ప్రత్యర్థివర్గానికి చెందిన యువతులపై దురుసుగా ప్రవర్తించారని పోలీసులు చెబుతున్నారు. బీజేపీకి సపోర్ట్ చేసే అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటించడం కూడా వివాదానికి ఓ కారణమని పోలీసులు భావిస్తున్నారు. జేఎన్యూ వివాదంలో ఖేర్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ఆందోళనకు దిగారని వామపక్షాలపై ఏబీవీపీ సంఘాలు ఆరోపించాయి. అయితే దర్శకుడు, ఆ చిత్ర యూనిట్ పై తమకు ఎలాంటి కోపంలేదని.. అయితే మూవీ కథాంశంపైనే తమకు అభ్యంతరాలున్నాయని వామపక్ష సంఘాలు పేర్కొన్నాయి. నలుగురు విద్యార్థినులపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులు జరిగినట్లు వర్సిటీలో ప్రచారం జరుగుతోందని, తన వద్దకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని వైస్ చాన్సలర్ సురంజన్ దాస్ తెలిపారు.