ముంబై: విడుదలైనప్పుడే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన కశ్మీర్ ఫైల్స్ సినిమా ఇఫీ ఉదంతం పుణ్యమా అని మరోసారి దేశవ్యాప్తంగా మంటలు రేపుతోంది. అదో చెత్త సినిమా అంటూ సోమవారం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ముగింపు వేడుకల్లో ఇజ్రాయెల్‌కు చెందిన జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ చేసిన వ్యాఖ్యలపై ఇంటా బయటా విమర్శలు రేగుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇది పెద్ద చర్చకు తెర తీసింది.
నదవ్ వ్యాఖ్యలను భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి నవోర్ గిలాన్ తీవ్రంగా ఖండించారు. ‘‘అతిథిని దైవంగా భావించే దేశానికి వచ్చి అలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలి. ఇఫీ జడ్జీల ప్యానల్‌కు సారథ్య స్థానంలో కూచోబెట్టిన ఆతిథ్య దేశాన్ని నదవ్ తన వ్యాఖ్యలతో దారుణంగా అవమానించారు’’ అంటూ మంగళవారం బహిరంగ లేఖలో దుయ్యబట్టారు. ‘‘హిట్లర్ సారథ్యంలోని నాజీల చేతుల్లో లక్షలాది మంది యూదులు హోలోకాస్ట్ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో నిస్సహాయంగా ఊచకోతకు గురయ్యారు.
అదృష్టం కొద్దీ ఆ మారణహోమం నుంచి తప్పించుకున్న వారి వారసున్ని నేను. నీ వ్యాఖ్యలనే గీటురాయిగా తీసుకునే పక్షంలో హోలోకాస్ట్ దారుణాలపై హాలీవుడ్ దర్శక దిగ్గజం స్పీల్‌బర్గ్ తీసిన షిండ్లర్స్ లిస్ట్ కూడా చెత్త సినిమాయేనా అని భారతీయులు ప్రశ్నిస్తుంటే నా మనసెంతో గాయపడుతోంది. కశ్మీర్ ఫైల్స్‌పై నీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. వాటిని నువ్వు ఏ విధంగానూ సమర్థించుకోలేవు’’ అంటూ తూర్పారబట్టారు. నదవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కశ్మీరీ పండిట్ల మండిపాటు
బీజేపీతో పాటు కశ్మీర్ ఫైల్స్ సినిమా రచయిత, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, అందులో ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నదవ్ విమర్శలను తీవ్రంగా ఖండించారు. ‘‘భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాన్ని ఉగ్రవాదుల వాదనకు మద్దతిచ్చేందుకు వాడుకున్న తీరు ఆశ్చర్యకరం. కశ్మీర్ ఫైల్స్ ప్రచారం కోసం తీసిందని, అందులో ఒక్క సీన్ గానీ, డైలాగ్ గానీ అవాస్తవమని నిరూపించినా ఇకపై సినిమాలే తీయను. నదవ్‌తో పాటు ప్రపంచ మేధావులకు, అర్బన్ నక్సల్స్‌కు ఇది నా సవాలు’’ అని అగ్నిహోత్రి అన్నారు. నవద్‌ను తక్షణం భారత్ నుంచి పంపించేయాలని కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ కాన్సులర్ జనరల్ కొబ్బీ షొషానీ కూడా నదవ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment