
భగవంతుడు వాయిదా వేశాడు
భగవంతుడు వాయిదా వేశాడు అంటోంది నటి రెజీనా. ఈ అమ్మడు అచ్చ తమిళ ఆడపడుచు. కేడీబిల్లా కిల్లాడిరంగా చిత్రంతో నాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఆ చిత్రం సక్సెస్ అయినా ఇక్కడ అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్‌ను ఆశ్రయించింది. అక్కడ మంచి విజయాలనే అందుకుంటోంది. అయితే తమిళ అమ్మాయినై ఉండి తమిళంలో విజయాలను అందుకోలేకపోతున్నాననే మథన పడుతూనే ఉందట. అందుకని మధ్య మధ్యలో తమిళ చిత్రాల అవకాశాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉందట. ఆ మధ్య రాజతందిరం అనే చిత్రం బాగానే ఆడింది. అయినా రెజీనాను కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. అలాంటిది చాలా కాలం తరువాత మానగరం చిత్రం రూపంలో ఈ అమ్మడి ఖాతాలో ఇటీవల మంచి విజయం నమోదైంది.
అంతే కాదు ఇప్పుడు ఇక్కడ రెజీనా టైమ్ బాగుంది. ఎస్‌జే. సూర్యతో నెంజం మరప్పదిల్‌లై, అధర్వతో జెమినీగణేశనుం సురళీరాజానుం, ఉదయనిధిస్టాలిన్‌కు జంటగా సరవణన్ ఇరుక్క భయమేన్‌తో పాటు రాజతందిరం– 2, సిలుక్కువార్‌పట్టి సింగం మొదలగు ఐదు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. వీటిలో సరవణన్ ఇరుక్క భయమేన్ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. ఈ చిత్రంలో ఉదయనిధిస్టాలిన్ సిక్స్‌ప్యాక్‌తో నటిస్తున్నాడు. ఈయన పక్కన నటిస్తున్న తమిళ హీరోయిన్ అనే ప్రశంసలు అందుకుంటున్నానని రెజీనా తెగ మురిసిపోతోంది. ఈ చిత్రం పాటల్లో అందాలను వెండితెరపై పరిచిందట.
ఈ సందర్భంగా ఈ అమ్మడు మనసులోని మాటను బయట పెడుతూ మాతృభాషలో విజయం సాధించాలన్న ఆశ చాలా కాలంగా ఉందని అంది. నిజానికి తాను ఇక్కడ ఎప్పుడో సక్సెస్‌ను అందుకోవాల్సిందని, ఆ భగవంతుడు కాస్త వాయిదా వేశాడని పేర్కొంది. ఇప్పుడు తన టైమ్ బాగుందని, త్వరలోనే కోలీవుడ్‌లో తాను ఆశించిన స్థాయికి చేరుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలన్నిటిలోనూ తన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది. మరిన్ని అవకాశాలు వస్తున్నాయని, మంచి పాత్రలను ఎంచుకుని నటిస్తున్నానని రెజీనా పేర్కొంది.