రజనీకాంత్‌లో మంచి దర్శకుడు ఉన్నాడు!
డెబ్భై ఏళ్ల ఇళయరాజా తాజాగా వెయ్యో చిత్రానికి సంగీతం అందించి, సినీ సంగీత చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెర తీశారు. సంగీతాభిమాని అయిన దర్శకుడు ఆర్. బల్కికి గతంలో ‘చీనీ కవ్’, ‘పా’, తాజాగా ‘షమితాబ్’ చిత్రాలకు సంగీతమిచ్చారు ఇళయరాజా. ‘‘బల్కి నాకు వీరాభిమాని. నా పాటలన్నీ ఆయనకు బాగా తెలుసు. అయితే, అచ్చంగా నా పాత హిట్ పాటల లాంటివే కావాలని అడగడం మాత్రం నచ్చదు’’ అని నవ్వేశారు ఇళయరాజా.
తనను తాను రిపీట్ చేసుకోవడం కూడా ఇష్టపడని ఇళయరాజా, అమితాబ్ నటిస్తున్న ‘షమితాబ్’కు పూర్తిగా కొత్త బాణీలే అందించారు. ‘‘అమితాబ్ చాలా అద్భుతమైన వ్యక్తి. మంచి గాయకుడు కూడా. గతంలో ఆయన పాడినవి బల్కి నాకు వినిపించారు. శ్రుతి మీద మంచి పట్టున్న అమితాబ్ కోసం ‘షమితాబ్’లో పాట చేసి, ఆయన శ్రుతికి తగ్గట్లుగా మార్చి, పాడించా. ఆయన చాలా బాగా పాడారు’’ అని రాజా చెప్పుకొచ్చారు. కమలహాసన్ సంగతి చెప్పుకొస్తూ, ‘‘ఆయన చాలా మంచి గాయకుడు.
అతనిది బ్రహ్మాండమైన గొంతు. సంగీతంలోనూ, నటనలోనూ ఆయన గ్రహణశక్తి కూడా అద్భుతం. అప్పటి దాకా జోకులు వేస్తూ ఉండే కమల్, దర్శకుడు యాక్షన్ చెప్పగానే పూర్తిగా ఆ పాత్రలోకి మారిపోయి అపూర్వంగా నటిస్తాడు’’ అని ఇళయరాజా తన అనుభవాన్ని వివరించారు. మరి, రజనీకాంత్ మాటేమిటంటే, ‘‘రజనీ మంచి దర్శకుడు. అద్భుతమైన స్క్రీన్‌ప్లే రచయిత. ఆ మాటే ఆయనతో అంటూ, మీ సినిమాలకు మీరే ఎందుకు రాయకూడదంటే, ఆ పని భిన్నమైనది స్వామీ అంటూ నవ్వేశాడు’’ అని ఈ సంగీత జ్ఞాని గుర్తుచేసుకున్నారు.