
సూటిగా..ధాటిగా...
భీముని కండబలం, కర్ణుని గుండెబలం, కృష్ణుని బుద్ధి బలం... ఈ మూడూ ఒక్కడిలోనే ఉంటే అతని విజయాల ధాటి ఏ స్థాయిలో ఉంటుంది? గోపీచంద్ హీరోగా భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం కథాంశం ఈ రీతిలోనే ఉంటుంది. ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘శౌర్యం’ చిత్రం... గోపీచంద్ కెరీర్‌లోనే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ విజయాన్ని అధిగమించాలనే పట్టుదలతో నిర్మాత వి.ఆనంద్‌ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్‌కి ‘లక్ష్యం’ లాంటి హిట్‌ని ఇచ్చిన శ్రీవాస్ ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక.
ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో నిర్విరామంగా జరుగుతోంది. ఈ నెల 29 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇందులో గోపీచంద్ పాత్ర చిత్రణను భిన్నంగా డిజైన్ చేశారు శ్రీవాస్. ఎక్కడ బుద్ధిబలం చూపించాలో, ఎక్కడ కండబలం చూపించాలో బాగా తెలిసిన స్థితప్రజ్ఞుడిగా ఇందులో గోపీచంద్ కనిపిస్తారు. ఏం చెప్పినా సూటిగా చెబుతాడు. ఎంతటి ప్రమాదాన్నయినా ధాటిగా ఎదిరిస్తాడు.. గోపీచంద్ పాత్ర చిత్రణ ఇలా ఉంటుంది. యువతరం మెచ్చే అంశాలతో పాటు, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: వెట్రి.