‘‘గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్యం, లౌక్యం’ సూపర్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల తరహాలోనే ఫ్యామిలీ, యాక్షన్, బ్రదర్ సెంటి మెంట్ నేపథ్యంలో ‘రామబాణం’ ఉంటుంది. ఈ చిత్రంతో గోపీచంద్– శ్రీనివాస్ హ్యాట్రిక్ హిట్ కొడతారు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా జగపతిబాబు, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ చెప్పిన విశేషాలు.
► సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో సాఫ్ట్‌వేర్ రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడానికి ముందే ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి పరిశోధన చేసి, ఫ్యాక్టరీ మోడల్‌లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం. మిగతా కొత్త నిర్మాతల్లాగా ఒకట్రెండు సినిమాలు కాకుండా ఎక్కువ తీస్తున్నాం. మంచి విజయాలతో విజయవంతమైన సంస్థగా ఎదగడం హ్యాపీ.
► శ్రీవాస్ ‘రామబాణం’ కథ చెప్పినప్పుడు ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అవుతుందనిపించింది. క్రియేటివ్ సైడ్ ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. మంచి ఔట్‌పుట్ తీసుకొచ్చారు.
► కాన్సెప్ట్ నచ్చితే చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు నిర్మిస్తున్నాం. అయితే సినిమా విజయం అనేది మన చేతుల్లో ఉండదు.. కానీ వంద శాతం మన ప్రయత్నం చేయాలి. మేం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో విజయాల శాతం ఎక్కువగానే ఉంది. మా అబ్బాయి వ్యాపారం చూసుకుంటున్నాడు. మా అమ్మాయికి సినిమాపై ఆసక్తి ఉంది. శర్వానంద్‌తో చేస్తున్న సినిమా విషయంలో తన ప్రమేయం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి, అల్లు అర్జున్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు నిర్మించాలనుంది.. ఆ ప్రయత్నాలు చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment