ఖుష్బూ
‘‘నా కెరీర్ ప్రారంభంలో రాఘవేంద్రరావు, పి. వాసు, భారతీరాజా, బాలచందర్, జంధ్యాల, గోపాల్ రెడ్డి వంటి ఎందరో గొప్ప దర్శకులతో పని చేశాను. నా పాత్ర బాగుందన్నా, బాగా లేదన్నా ఆ క్రెడిట్ దర్శకులదే. ఎందుకంటే వారు చెప్పినట్టే నేను చేస్తాను. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానంటే కారణం నా పనిని ప్రేమిస్తాను.. అదే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని నటి ఖుష్బూ అన్నారు. గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన చిత్రం ‘రామబాణం’. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమా మే 5న రిలీజవుతోంది. ఈ చిత్రంలో కీలక పాత్ర చేసిన ఖుష్బూ చెప్పిన విశేషాలు.
► ‘రామబాణం’ ప్రధానంగా కుటుంబ బంధాల నేపథ్యంలో ఉంటుంది. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఉన్నత స్థాయికి చేరినా కుటుంబ బంధం అనేది చాలా ముఖ్యం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబమంతా కలిసి ఉండాలని ఈ సినిమా చెబుతుంది. ప్రస్తుతం మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ మూవీలో నేను చేసిన భువనేశ్వరి పాత్ర మనం మరిచిపోతున్న సంప్రదాయాలు, ఆహార వ్యవహారాలను గుర్తు చేసేలా ఉంటుంది.
► మొదట్లో తెలుగు సినీ పరిశ్రమ చెన్నైలోనే ఉండేది.. ఆ తర్వాత హైదరాబాద్‌కి తెలుగు ఇండస్ట్రీ వచ్చింది. అయితే నా కుటుంబం కోసం నేను అక్కడే ఉండిపోయాను. అప్పుడు తమిళ్‌లో ఎక్కువ చాన్సులు వచ్చాయి. డేట్స్ సర్దుబాటు కాక తెలుగులో ‘చంటి’ వంటి సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. ఆ విషయంలో ఇప్పటికీ బాధ ఉంది.
► గోపీచంద్‌తో మొదటిసారి ‘రామబాణం’లో నటించాను. జగపతిబాబుగారు నటుడు కాకముందు నుంచే నాకు తెలుసు. ఆయన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్‌గారు నిర్మించిన రెండు సినిమాల్లో నేను బాలనటిగా చేశాను. జగపతిగారు మంచి మనసున్న వ్యక్తి. నేను చౌ మామా అని పిలుస్తాను.
► ప్రస్తుత కాలంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలాంటి గొప్ప నిర్మాణ సంస్థను చూడటం చాలా కష్టం. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారు సెట్స్‌కి పెద్దగా వచ్చేవారు కాదు. వారు వరుస హిట్స్ అందుకోవడం సంతోషంగా ఉంది. శ్రీవాస్‌తో మొదటిసారి పని చేస్తున్నట్లు అనిపించలేదు. తనతో పని చేయడం చాలా సౌకర్యంగా అనిపించింది.
► అప్పటికి, ఇప్పటికి మేకింగ్ పరంగా, నటన పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. నేనే ఇప్పటి తరం నుంచి కొన్ని నేర్చుకోవాలి. హీరోయిన్ డింపుల్ హయతి మేకప్, హెయిర్ స్టైల్ చేసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. నటనలోనూ మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు సెటిల్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో లొకేషన్‌లో సరైన వసతులు లేకపోయినా ఎలా మేకప్ వేసుకోవాలి? ఎలా కాస్ట్యూమ్ మార్చుకోవాలి? అనే ట్రిక్స్ మాకు తెలిసేవి. ఈ తరానికి అలాంటివి తెలీదు.
► కెరీర్‌లో గ్లామర్ రోల్స్ చేశాను, డ్యాన్స్‌లు చేశా. ఇప్పుడు అవన్నీ అయిపోయాయి. ప్రేక్షకులు సినిమా చూసే కోణం కూడా మారింది. వారి మనసుల్లో స్థానం సంపాదించుకునే పాత్రలు చేయాలి. అలాంటి పాత్రనే ‘రామబాణం’లో చేశాను. తెలుగులో ఇంకా మంచి పాత్రలు చేయాలని ఉంది. పాత్రకిప్రాధాన్యత ఉంటే నిడివి తక్కువ అయినా చేస్తాను. ప్రస్తుతం మనసుకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నాను.. అందుకే తక్కువ సినిమాలు చేస్తున్నా. విజయ్ హీరోగా చేసిన ‘వారసుడు’లో నాది 18 నిమిషాల పాత్ర.. అయితే సినిమా నిడివి ఎక్కువ కావడంతో నా పాత్ర సన్నివేశాలు తొలగించారు.
► సినిమాల్లో డైరెక్టర్స్ సృష్టించిన పాత్రకి తగ్గట్లు చేయాలి. కానీ, టీవీ షోల్లో నాకు నచ్చినట్టు ఉండొచ్చు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నాను. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓడిపోయాను. అధిష్టానం ఆదేశిస్తే ఎంపీగానో, ఎమ్మెల్యేగానో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
Comments
Please login to add a commentAdd a comment