సినిమా రివ్యూ: లౌక్యం | Movie Review: Loukyam - Another Run of the mill story from Tollywood Film makers | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: లౌక్యం

Published Fri, Sep 26 2014 3:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:00 PM

సినిమా రివ్యూ: లౌక్యం

సినిమా రివ్యూ: లౌక్యం

దసరా పండగ రేసులో పవర్, ఆగడు చిత్రాల తర్వాత అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు శుక్రవారం(సెప్టెంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘లౌక్యం’. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రం తర్వాత శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గోపిచంద్, రకుల్ ప్రీత్ సింగ్‌లు నటించారు. ప్రేక్షకుల ఆదరణను చూరగొనేందుకు దర్శక, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు తమ లౌక్యాన్ని ఎలా ప్రదర్శించారో తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం. 
 
వరంగల్‌లో బాబ్జీ(మిర్చి ఫేం సంపత్), కేశవరెడ్డి(ముఖేశ్ రుషి)లు బద్దశత్రువులు. వీళ్లు ఓ కారణంగా వీరి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్న కేశవ్ రెడ్డి... బాబ్జీ చిన్న చెల్లెలు చంద్రకళ(రకుల్ ప్రీత్ సింగ్)ను చంపాలని ప్లాన్ వేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా బాబ్జీ పెద్ద చెల్లెల్ని పెళ్లి పీటల మీద నుంచి ఎత్తుకెళ్లిన వెంకీ(గోపిచంద్) హైదరాబాద్ చేరుకుంటాడు. హైదరాబాద్‌లో చంద్రకళను తొలి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే తాను ప్రేమించింది బాబ్జీ చిన్న చెల్లెల్ని అని వెంకీ తెలుసుకోవడం ఈ కథలో ట్విస్ట్. అయితే చంద్రకళతో ఉన్న ప్రేమను పెళ్లిగా మార్చడానికి బాబ్జీ ఎలా ఒప్పించాడు?  పెద్ద చెల్లెలి పెళ్లి చెడగొట్టాడానే పీకల్లోతు కోపంలో ఉన్న బాబ్జీని వెంకీ ఎలా కన్విన్స్ చేశాడు? బాబ్జీని ఒప్పించడానికి ఎలాంటి డ్రామా ప్లే చేశాడు? బాబ్జీ, కేశవరెడ్డిల మధ్య శత్రత్వానికి కారణమేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే లౌక్యం చిత్ర కథ. 
 
 డైలాగ్స్
 రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్
 బ్రహ్మానందం, పృథ్వీ కామెడి
 సెకండాఫ్
 
 మైనస్ పాయింట్స్:
 రొటిన్ కథ, కథనాలు
 మ్యూజిక్
 
 నటీనటుల పెర్ఫార్మెన్స్:
 గోపిచంద్‌కు వెంకీ పాత్ర  రొటిన్ కారెక్టరే. కాని చాలా వేరియేషన్స్, ఎక్స్‌ప్రేషన్స్ పలికించడానికి స్కోప్ లభించింది. తన ప్రత్యేకతను ప్రదర్శించడానికి స్కోప్ లేకపోవడంతో కథతోపాటు ప్రయాణించి.. అక్కడక్కడ తన మార్కును వదిలి.. అవసరమైన పాటలు, ఫైట్లతో గోపిచంద్ పనికానిచ్చాడు. హీరోయిజం చుట్టే కథ తిరిగినా.. మిగిత పాత్రల మాటున గోపిచంద్ ప్రత్యేకత కనిపించదు.
 
 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన గ్లామర్‌తోనే కొంత నటనతోనూ ఆకట్టుకున్నారు. స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన హంసానందిని ప్రదర్శించిన గ్లామర్ డోస్ అతిగానే ఉంది. ఐటమ్ సాంగ్స్‌కు పాపులర్‌గా, తెలుగు సినిమాలకు లక్కీ మస్కట్‌గా మారిన హంసానందిని ఈచిత్రంలో కొంత హుందాతనాన్ని కొంత తగ్గించుకుందా అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగడం సహజం.
 
 సిప్పీ పాత్రలో బ్రహ్మనందం, బాయిలింగ్ స్టార్‌గా పృథ్వీలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్ర భారాన్నంత బ్రహ్మనందం, పృథ్వీలు తమ భుజాలపై వేసుకుని ప్రేక్షకులను ఆలరించడానికి చేసిన ప్రయత్నం సఫలమైంది. 
 
 సాంకేతికవర్గాల పనితీరు:
 అనూప్ రూబెన్ సంగీతంలో ప్రత్యేకత ఏమి కనిపించలేదు. ‘సుర్ సుర్ సూపర్..’, ‘నిన్ను చూడగానే’ పాటలు రొటిన్‌గానే ఉన్నా.. పర్వాలేదనిపించాయి.
 
 శ్రీధర్ సీపాన రోటిన్ కథనే అందించాడు. గురువు కోన వెంకట్ ప్రభావం నుంచి ఇంకా శ్రీధర్ బయటకు రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది. కోన వెంకట్ అందించిన విజయవంతమైన చిత్రాల కథల్ని, స్క్రీన్‌ప్లే ఫార్మూలానే నమ్ముకున్నాడు. కొత్తదనం కోసం ప్రయత్నిస్తే ఫలితం ఏలా ఉంటుందనే భయం అణువణువునా వెంటాడిని కనిపిస్తుంది. అయితే రొటిన్ కథకు కోన వెంకట్, గోపి మోహన్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొంత ఊరట లభించింది. 
 
 మూస చిత్రాలకే ఓటేసినట్టు దర్శకుడి తీరు ఉంది. టాలీవుడ్ సక్సెస్ ఫార్ములా తప్ప కొత్తగా ఆలోచించకుండా కోన వెంకట్, గోపి మోహన్‌ల మార్కు కామెడీతో శ్రీవాసు లౌక్యాన్ని ప్రదర్శించాడు. ఎలాంటి ప్రత్యేకతలేని ఈ చిత్రంలో బ్రహ్మనందం, పృథ్వీల కామెడీయే విజయరహస్యంగా దర్శకుడు భావించారు. అయితే దర్శకుడి నమ్మకాన్ని నిలబెట్టడంలో బ్రహ్మనందం రొటిన్ కామెడీకి, పృథ్వీ సరికొత్త యాంగిల్‌లో హాస్యం బాగానే సహాయపడ్డాయి. 
 
 ముగింపు: 
కొత్త కథలపై నమ్మకం లేని టాలీవుడ్ ఫిల్మ్‌మేకర్స్ పాతకథనే అటు ఇటు మార్చి కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారనేది ఇటీవల కాలంలో విడుదలైన  చిత్రాలు చెబుతున్నాయి. కథ అదే కాని టైటిల్, హీరో మారాడనే టాక్ లౌక్యంపై బాహాటంగా విమర్శలు వినిపించడం ఖాయం. అయితే రొటిన్ కథకు వినోదాన్ని జోడించి కమర్షియల్ సక్సెస్ చేయాలని చేసిన ప్రయత్నంగా 'లౌక్యం' రూపొందింది.  బ్రహ్మనందంను కాస్తా వెనక్కినెట్టి బాయిలింగ్ స్టార్ పాత్రలో పృథ్వీ చేసిన కామెడీ బ్రహ్మండంగా పేలింది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, హంసానందిని ఎపిసోడ్ లౌక్యం చిత్రానికి బలంగా మారాయి. పాత చింతకాయ పచ్చడేనా అని అనిపించే ప్రతిసారి వినోదంతో ఆ సంతృప్తిని తగ్గించేలా కథనం సాగింది. ఓవరాల్ గా తొలి భాగంలో నిరసపడ్డ ప్రేక్షకుడికి సెకండాఫ్ లో పృథ్వీ, బ్రహ్మనందంల కామెడీ సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేసింది.  పండుగ సెలవుల్లో లౌక్యం చిత్రానికి పెద్దగా పోటీ కనిపించకపోవడం పాజిటివ్‌గా కనిపిస్తోంది. బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరించడంపైనే ఈ చిత్ర కమర్షియల్ సక్సెస్ ఎంత అనేది ఆధారపడి ఉంటుంది. 
-రాజబాబు అనుముల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement