లౌక్యం గల కుర్రాడు
లౌక్యం, చాకచక్యం కలగలిస్తే ఆ కుర్రాడు. సాధ్యమైనంతవరకూ సమస్యను బుద్ధిబలంతోనే అధిగమించడం అతని స్టైల్. అలా సాధ్యం కాకపోతే... అప్పుడు అతనిలోని మరో మనిషి బయటకొస్తాడు. వాడికి బుద్ధిబలంతో పని లేదు. మదపుటేనుగులను సైతం మట్టి కరిపించగల కండబలం వాడి సొంతం. ఇక సమస్యలన్నీ పలాయనం చిత్తగించాల్సిందే. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రంలో గోపీచంద్ పాత్ర చిత్రణ ఇలాగే ఉంటుంది. ఈ సినిమాకు ‘లౌక్యం’ అనే పేరును ఖరారు చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్‌ని పూర్తి చేసుకుంది.
దర్శకుడు మాట్లాడుతూ-‘‘గోపీచంద్ ‘లక్ష్యం’తోనే నా కెరీర్ మొదలైంది. మళ్లీ ఆయనతో సినిమా అంటే.. అంచనాలు అధికంగా ఉంటాయి. దానికి తగ్గట్టే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాను. ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే స్థాయిలో ఈ సినిమా ఉంటుంది. హీరో పాత్రకు తగ్గట్టుగా ‘లౌక్యం’ అనే పేరును ఖరారు చేశాం. ఆగస్ట్ 5 నుంచి పాటల చిత్రీకరణ మొదలుపెట్టనున్నాం. గోపీచంద్, హంసానందినిపై ప్రత్యేక గీతంతో పాటు, హీరోహీరోయిన్లపై ఫారిన్‌లో పాటలను తీస్తాం. దీంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. అనూప్ రూబెన్స్ అద్భుతమైన బాణీలను అందించారు. సెప్టెంబర్ తొలివారంలో పాటలను, చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.