లక్ష్యం కోసం లౌక్యం
‘‘కృష్ణుడి బుద్ధిబలం, కర్ణుడి గుండెబలం, భీముడి కండబలం... ఈ మూడూ ఒక్కడిలోనే ఉంటే వాడెలా ఉంటాడో, ‘లౌక్యం’లో గోపీచంద్ అలా ఉంటాడు. సందర్భానుసారం స్పందించడం ఇందులో గోపీచంద్ పాత్ర ప్రత్యేకత. ఆ స్పందించే తీరులోని విభిన్న అంశాలే ఈ చిత్రానికి హైలైట్స్’’ అంటున్నారు దర్శకుడు శ్రీవాస్. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి వి.ఆనంద్‌ప్రసాద్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంతర దశలో ఉంది.
ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవాస్ మాట్లాడుతూ -‘‘గోపీచంద్‌లోని కొత్తకోణాన్ని ఇందులో చూస్తారు. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సినిమాలో యాక్షన్ అబ్బురపరిచేలా ఉంటుంది. క్లాస్, మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా అనూప్ రూబెన్స్ మంచి పాటలు ఇచ్చారు. వచ్చేవారం పాటల్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్‌పై స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించిన మూడు పాటలతో షూటింగ్ పూర్తయిందని, గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్యం’ చిత్రాన్ని మించే విజయాన్ని ఈ సినిమా సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, కథనం: కోన వెంకట్, గోపీమోహన్, కెమెరా: వెట్రి, కూర్పు: శేఖర్.