
స్మయిలే అతని స్టయిల్!
ఈ ప్రపంచంలో స్మయిల్‌కి ఉన్నంత పవర్ ఇంక దేనికీ ఉండదు. చిన్నపాటి చిరునవ్వుతో ఎదుటివారిలో కొండలా పేరుకున్న కోపాన్ని దూదిపింజెలా చేసిపారేయొచ్చు. అది ఆ యువకునికి బాగా తెలుసు. స్మయిలే అతని స్టయిల్. లౌక్యం, చాకచక్యం మిక్స్ చేస్తే పుట్టినట్టుండే అతగాడు తన స్మయిల్‌తో ఎన్నో అవరోధాల్ని ఎదుర్కొన్నాడు. ఎన్నో విజయాలను సాధించాడు. అలాంటి కుర్రాడిగా గోపీచంద్ కనిపించబోతున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మిస్తోన్న తాజా చిత్రంలో గోపీచంద్ పాత్ర చాలా శక్తిమంతంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుందట.
ఆ విశేషాలను శ్రీవాస్ తెలియజేస్తూ -‘‘పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే గోపీచంద్ శైలిలో యాక్షన్ ఉంటుంది. బ్రహ్మానందం పాత్ర కూడా మెయిన్ హైలైట్‌గా ఉంటుంది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ నెల 17 నుంచి మరో షెడ్యూల్ చేస్తున్నాం. దాంతో టాకీ పూర్తవుతుంది. ఆగస్టులో పాటలను చిత్రీకరించి, సెప్టెంబర్ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రకుల్ ప్రీత్‌సింగ్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్-గోపీమోహన్, కెమెరా: వెట్రి, సంగీతం: అనూప్ రూబెన్స్.
రెగ్యులర్ షూటింగ్‌లో యువి క్రియేషన్స్ చిత్రం: ప్రభాస్‌తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన యువి క్రియేషన్స్ సంస్థ అధినేతలు వి. వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి తాజాగా గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు. రాధాకృష్ణకుమార్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఇటీవలే ప్రారంభ వేడుక జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని నిర్మాతలు నమ్మకం కనబరిచారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శక్తి శరవణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: ఎమ్. అశోక్‌కుమార్ రాజు, ఎన్.సందీప్.ఇవాళ గోపీచంద్ పుట్టిన రోజు కావడంతో, సెట్స్ మీద ఉన్న ఈ రెండు చిత్రాల దర్శక, నిర్మాతలు తమ సినిమాల్లోని గోపీచంద్ ఫస్ట్ లుక్ స్టిల్స్‌ను విడుదల చేశారు.