నంబర్‌ ఏదైనా ఎఫర్ట్‌ ఒకటే | Gopichand interview about Pantham | Sakshi
Sakshi News home page

నంబర్‌ ఏదైనా ఎఫర్ట్‌ ఒకటే

Published Thu, Jul 5 2018 12:22 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

Gopichand interview about Pantham - Sakshi

‘‘25వ సినిమా ఇలా ఉండాలని ప్లాన్‌ ఏం చేయలేదు. కథ నచ్చి ఒప్పుకున్నాను. ఆ తర్వాత లెక్కేస్తే ఇది 25వ సినిమా అని తెలిసింది. మైల్‌స్టోన్‌ సినిమా అనే కాదు ప్రతీ సినిమాకు ఎక్స్‌ట్రా కేర్‌ తీసుకుంటాం. ఇందులో నాన్న (దర్శకుడు టి.కృష్ణ) గారి సినిమాల్లా సామాజిక స్పృహ ఉన్న కథ చెప్పాం. 25 అనేది జస్ట్‌ నంబర్‌ అంతే. ప్రతీ సినిమా ఫస్ట్‌ సినిమాలానే భావించి, ఎఫర్ట్‌ పెడతా’’ అని గోపీచంద్‌ అన్నారు. కొత్త దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్‌ జంటగా కేకే రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘పంతం’. ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

► హీరో క్యారెక్టరైజేషన్‌ ఎలా ఉంటుందో ఫస్ట్‌ సాంగ్‌ ‘దేశమంటే మట్టికాదోయ్‌...’లోనే చెప్పేశాం. అందరూ బావుండాలి, తన చుట్టూ జరిగే సమస్యను తీర్చాలి అనుకునే మనçస్తత్వం ఉన్న హీరో. ప్రస్తుత సమాజంలో ప్రతీ కామన్‌ మ్యాన్‌ ఎదుర్కొంటున్న సమస్యను ప్రస్తావించాం. అలాగే మాకు తెలిసినంతలో దీనికో సొల్యూషన్‌ కూడా చెప్పే ప్రయత్నం చేశాం.

► అందరూ వ్యవస్థ అలా ఉంది. ఇలా ఉంది అని విమర్శిస్తారు. కానీ సక్రమంగా ఉండరు. ఒకర్ని వేలెత్తి చూపించినప్పుడు మిగతా నాలుగు వేళ్లు మనవైపే చూపిస్తాయి. అలాంటి కథ చెప్పాం.

► దర్శకుడు చక్రి కథ బాగా చెప్పాడు. అలానే తీశాడు. నిర్మాతగారు కూడా కొత్త డైరెక్టర్‌ అనేసరికి సంకోచించారు. కానీ అతన్ని నమ్మి ముందుకెళ్లాం. రాధామోహన్‌గారు జెంటిల్‌మ్యాన్‌. అనుకున్న బడ్జెట్‌లో సినిమా తీశాం. ఈ కథకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా ముఖ్యం. గోపీ సుందర్‌ అయితే బావుంటుందని అనుకొని తీసుకున్నాం.  మెహరీన్‌ చాలా బాగా యాక్ట్‌ చేసింది. కచ్చితంగా హైట్స్‌కి వెళ్తుంది.

► కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర ఆడొచ్చు.. ఆడకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. కానీ చెత్త సినిమా చేశాడు అని ఆడియన్స్‌ ఫీల్‌ అయ్యే సినిమా నేనెప్పుడూ చేయలేదు. హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా, నేనే బాధ్యత తీసుకుంటాను. సినిమా ఆడనప్పుడు అందులో ఎక్కడ తప్పు జరిగింది? అని చెక్‌ చేసుకొని మళ్లీ ఆ తప్పు జరగనివ్వను.

► ఈ  సినిమాలో చాలా పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ ఉన్నాయి. కొన్ని సీన్స్‌లో డైలాగ్స్‌ ఎప్పుడు చెబుతానా? అని ఎగై్జట్‌ కూడా అయ్యాను. రమేశ్‌ ప్రసాద్‌ డైలాగ్స్‌ చాలా బాగా రాశారు. కెమెరామేన్‌ ప్రసాద్‌ మూరెళ్ల గారు తన అనుభవాన్నంతా ఉపయోగించి ఈ సినిమాకు పని చేశారు.

► బీవీయస్‌యన్‌ ప్రసాద్‌గారి ప్రొడక్షన్‌లో కుమార్‌ అనే కొత్త డైరెక్టర్‌తో నా నెక్ట్స్‌ సినిమా ఉంటుంది. అది కంప్లీట్‌ లవ్‌ స్టోరీ. సంపత్‌ నందితో ఓ సినిమా కూడా డిస్కస్‌ చేస్తున్నాను.

► మా అబ్బాయి నా సినిమాలన్నీ చూస్తున్నాడు. వాడికి ఫైటింగ్‌ సినిమాలంటే ఇష్టం. నేను ఫైటింగ్‌ చేస్తా అంటాడు.

► నెగటీవ్‌ క్యారెక్టర్‌ ఆల్రెడీ టచ్‌ చేశాను కాబట్టి నాకు నచ్చినప్పుడు ఆ సైడ్‌ వెళ్తాను. ప్రస్తుతానికైతే హీరోగానే చేస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement