ప్రతి సినిమా భయంతో చేస్తా!
‘‘ప్రతి సినిమాను తొలి చిత్రంలానే భావించి, వంద శాతం కష్టపడి పని చేస్తా. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నమ్ముకున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే భయంతో సినిమా తీస్తా. మినిమమ్ గ్యారంటీ సినిమా అనిపిస్తేనే చేస్తా’’ అని గోపీచంద్ మలినేని అన్నారు. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మించిన ‘విన్నర్’ నేడు రిలీజవుతోంది. దర్శకుడు చెప్పిన విశేషాలు.
⇔ నల్లమలుపు బుజ్జి బ్యానర్‌లో ‘లక్ష్యం’, ‘ఠాగూర్’ మధు బ్యానర్‌లో ‘స్టాలిన్’ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా చేశా. వారిద్దరూ కలిసి నిర్మించిన ‘విన్నర్’ చిత్రానికి నేను డైరెక్టర్ అవడం హ్యాపీగా ఉంది. సాయిధరమ్ తేజ్‌తో సినిమా చేద్దామని నిర్మాతలు చెప్పారు. వెలిగొండ శ్రీనివాస్ చెప్పిన కథ నిర్మాతలకు, నాకు, తేజుకు కొత్తగా అనిపించడంతో ముందుకెళ్లాం.
⇔ ఇది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. మంచి ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ ఉంటాయి. సాయిధరమ్ తేజ్, జగపతిబాబు మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉంటాయి. ఇందులో తేజు లుక్స్, డైలాగ్ డెలివరీ, ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ కొత్తగా ఉంటాయి.
⇔ గుర్రాలు, రేసులు, తన తండ్రి అంటే ఇష్టపడని హీరో.. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ప్రేయసి ఛాలెంజ్ కోసం తండ్రిని ఇష్టపడి, గుర్రాల రేసులో ఎలా గెలిచాడు? అన్నదే ‘విన్నర్’ కథ. ఈ పాత్ర కోసం వారం పాటు తేజు హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.
⇔ క్లయిమాక్స్‌లో భాగంగా టర్కీలో హార్స్ రైడింగ్ చిత్రీకరించాం. ఇందుకోసం హాలీవుడ్ ఫైట్‌మాస్టర్ కలయన్‌ను బల్గేరియన్ నుంచి పిలిపించాం. తేజు స్వారీ చేసిన గుర్రానికి నటించే విషయంలో ఇరవై ఏళ్ల అనుభవం ఉంది. యాక్షన్ అనగానే పరిగెడుతుంది. కట్ చెప్పగానే ఆగిపోతుంది. అది భలే ఎక్స్‌పీరియన్స్.
⇔ అనసూయ తో ఐటమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుందనిపించింది. ముందు తను ఒప్పుకోలేదు. సుమతో పాడించాలనే ఆలోచన తమన్‌దే. అనసూయ ఆట, సుమ పాట అలరిస్తాయి.