అప్పుడు నా స్టైల్‌లో నేనేంటో చూపిస్తా! | Gopichand Special Interview | Sakshi
Sakshi News home page

అప్పుడు నా స్టైల్‌లో నేనేంటో చూపిస్తా!

Published Sun, Dec 20 2015 11:56 PM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

అప్పుడు నా స్టైల్‌లో నేనేంటో చూపిస్తా! - Sakshi

అప్పుడు నా స్టైల్‌లో నేనేంటో చూపిస్తా!

- గోపీచంద్
  యాక్షన్.. రొమాన్స్... ఫ్యామిలీ ఎమోషన్స్.. కామెడీ.. ఇలా ఏ జానర్‌కైనా పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అవ్వగల స్టార్ గోపీచంద్. తాజాగా ‘సౌఖ్యం’తో తన స్టయిలాఫ్ మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో గోపీచంద్, రెజీనా జంటగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్‌ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా గోపీచంద్‌తో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
 
 నలుగురి కోసం ఆలోచించే వ్యక్తిగా ‘సౌఖ్యం’లో నటించారు. మరి విడిగా?
 నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. నా ఆలోచనలన్నీ దాదాపు పాజిటివ్‌గానే ఉంటాయి. ఎదుటి వ్యక్తిలో నెగటివ్ చూడడం నాకు నచ్చదు. వాళ్లల్లో ఉన్న పాజిటివ్‌ని చూస్తాను. వీలైనంత ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటాను. అందరూ బాగుండాలనుకుంటాను.
 
 ఆనంద్‌ప్రసాద్‌గారి భవ్య బేనర్లో ఇది మీకు నాలుగో సినిమా. ఆయనతో వేవ్ లెంగ్త్ బాగా కుదిరినట్లుంది?
 ఈ బేనర్లో సౌకర్యంగా ఉంటుంది. ఏదైనా సరే ఓపెన్‌గా చర్చించుకునే వీలుంటుంది. ఆనంద్‌ప్రసాద్‌గారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవిల ప్లానింగ్ బాగుంటుంది.
 
 ‘నేను ఎవరితోనూ పెట్టుకోను. పెట్టుకుంటే ఆ పని తప్ప వేరే పని పెట్టుకోను...’ అని ఈ చిత్రంలో ఓ డైలాగ్ చెప్పారు. రియల్ లైఫ్‌లో కూడా అంతేనా?
 ఎవరైనా ఏదైనా కావాలని చేస్తే, మొహం మీద చెప్పేస్తా. సరదాగా జోక్స్ వేస్తే, వాటిని సీరియస్‌గా తీసుకోను. కావాలని చేస్తే డైలాగ్‌లో చెప్పినంత హార్ష్‌గా కాదు కానీ, నా స్టైల్‌లో నేనేంటో చూపిస్తా.
 
 హై ఓల్టేజ్ యాక్షన్ మూవీస్ చేసిన మీరు ఈ మధ్య కామెడీకీ ఎక్కువ స్కోప్ ఉన్న యాక్షన్ మూవీస్ చేస్తున్నారేంటి?
 ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో అది చేయడం బెటర్. ఇవాళ అందరూ హాయిగా నవ్వుకోవాలని థియేటర్‌కి వస్తున్నారు. అందుకే, ప్రతి సినిమాలోనూ దాదాపు కామెడీకే ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు. నేను కూడా అలానే చేస్తున్నాను. కాకపోతే నా తరహా యాక్షన్ ఉండాలి కాబట్టి, ఫైట్స్ కూడా ఉండేలా చూసుకుంటున్నాను.
 
 మరి మీ నుంచి అభిమానులు ఆశించే రిస్కీ ఫైట్స్ ‘సౌఖ్యం’లో ఉంటాయా?
 దర్శకుడు రవికుమార్ చౌదరి హీరో క్యారెక్టర్స్‌ను చాలా స్టైలిష్‌గా చూపిస్తాడు. మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా చూసుకుంటాడు. ఈ చిత్రంలో ప్రేక్షకులను థ్రిల్‌కి గురి చేసే ఫైట్స్ ఉన్నాయి.
 
 ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని లేదా?
 ఓ నటుడిగా ఉంటుంది. కానీ, నిర్మాతలనూ, బయ్యర్లను దృష్టిలో పెట్టుకుని అలాంటివి చేయడం లేదు. కమర్షియల్ సినిమా చేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. నా సంతృప్తి కోసం రిస్కులు చేస్తే నిర్మాత రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇతరుల జీవితాలతో ఆడుకునే ప్రయోగాలు ఎందుకు? సొంతంగా సినిమా తీద్దామంటే నాకు ఇంట్రస్ట్ లేదు. మా నాన్నగారిలా డెరైక్షన్ చేయలేను. ఎందుకంటే ఆసక్తి లేదు.
 
 పర్సనల్ లైఫ్‌కి వస్తే... తండ్రయ్యాక అప్పటివరకూ లేని సెంటిమెంట్స్ హఠాత్తుగా వచ్చేస్తాయ్. అలవాట్లూ మారిపోతాయ్. మీలో వచ్చిన మార్పు?
 కొత్తగా వచ్చిన సెంటిమెంట్ ఏంటంటే... మనం చేసే మంచి మన కొడుకు జీవితానికి మంచి అవుతుందని ఆలోచిస్తున్నా. అంతకు ముందు ఎలా పడితే అలా ఉండేవాణ్ణి. ఇప్పుడు ఇంట్లో జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తోంది (నవ్వుతూ). ఎందుకంటే, పిల్లలకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ. ఊహ తెలిసి, బయటికెళ్లడం మొదలుపెట్టాక ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలుసుకుంటారు. కానీ, క్రమశిక్షణ, ప్రవర్తన లాంటివన్నీ ఇంటి వాతావరణం నుంచే అలవాటవుతాయ్. అందుకే, జాగ్రత్తగా ఉండాలి.
 
 స్మోక్ చేసే అలవాటున్నవాళ్లు దాదాపు పిల్లల ముందు చేయరు...  మీరు?
 సిగరెట్లు కాల్చను. సో.. నో ప్రాబ్లమ్. స్మోకింగ్ అనే కాదు... ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి పిల్లల ముందు ప్రదర్శించకపోవడం బెటర్.
 
 మీ అబ్బాయి విరాట్ కృష్ణ గురించి కొన్ని ముచట్లు?
 ఇప్పుడిప్పుడే మా అబ్బాయికి నడక వస్తోంది. ఈ మధ్య ఓ కారు బొమ్మ కొన్నాను. ఆ కారును నెట్టుకుంటూ వెళుతుంటే ముచ్చటగా ఉంది. మావాడు ఏం చేసినా నాకు ముచ్చటగానే ఉంటుంది.
 
 మీ అబ్బాయి కోసం మార్చుకున్న అలవాటు గురించి?
 కోపం వచ్చినప్పుడు వాయిస్ పెంచి మాట్లాడతాను. మా అబ్బాయి పుట్టాక కోపం తగ్గిపోయింది. మా అబ్బాయి ముందు గట్టిగా మాట్లాడను.
 
 అమ్మకూ, భార్యకూ సమానమైన ప్రేమ పంచకపోతే తేడా వచ్చేస్తుంది కదా! మీ అనుభవం ఏంటి?
 అమ్మ పెంచి, పెద్ద చేస్తుంది. భార్య మిగతా జీవితాన్ని పంచుకుంటుంది. సో... ఇద్దరూ ఇంపార్టెంటే. బేసిక్‌గా అర్థం చేసుకునే మనుషులు ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఆ విషయంలో మా అమ్మ, నా భార్య  సూపర్. చాలా అర్థం చేసుకుంటారు.
 
 మీ అబ్బాయిని పెంచే క్రమంలో మీ అమ్మా, నాన్నల విలువ బాగా తెలుస్తోందా?
 చిన్నప్పుడు అమ్మా, నాన్న అన్ని విషయాలూ చెప్పి, పెంచినవన్నీ గుర్తొస్తుంటాయ్. పిల్లల జీవితం మీద తల్లిదండ్రులకు ఎన్ని కలలు ఉంటాయో తండ్రయ్యాక నాకు తెలుస్తోంది. అంతకు ముందు 50 శాతం తెలుసు. మా అబ్బాయి పుట్టాక 100 శాతం తెలుసుకున్నా. ఎలా పెంచాలి? ఎంత బాగా చదివించాలి? ఎంత మంచి జీవితం ఇవ్వాలి? అని మా అబ్బాయి గురించి ఆలోచిస్తుంటాను.
 
 లేడీస్ అంటే మీకు గౌరవం అనే అనిపిస్తుంది. మీ సినిమాల్లో హీరోయిన్లను అభ్యంతరకరంగా చూపించినప్పుడు అలా వద్దని చెబుతుంటారా?
 నీట్‌గానే చూపించమంటాను. అనవసర సన్నివేశాల్లో కూడా అభ్యంతర కరమైన దుస్తులు వేయించినప్పుడు ‘ఇది అవసరమా?’ అంటాను. కమర్షియల్‌కి అవసరమని దర్శక-నిర్మాతలు అన్నప్పుడు నేనేం చేయలేను! డైలాగ్స్‌లో కూడా ద్వంద్వార్థాలు వద్దనే అంటాను. నాకు తెలిసి హీరోయిన్లను గ్లామరస్‌గా చూపించినంత మాత్రాన టికెట్స్ తెగవు. లక్ష మంది ఆడియన్స్ లో హీరోయిన్స్ గ్లామర్‌ని చూడ్డానికి ఓ ఐదారు వేల మంది వస్తారేమో!
 - డి.జి. భవాని
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement