తమిళంలో గోపీచంద్ ఎంట్రీ
తమిళంలో గోపీచంద్ ఎంట్రీ
Published Sat, Aug 17 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
అనువాద చిత్రాల రూపంలోనో, ఏకకాలంలో తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తూనో తమిళ హీరోలు టాలీవుడ్‌లో మార్కెట్ పెంచుకుంటున్నారు. అలాగే తమిళ దర్శకులు ఇక్కడి చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు, దర్శకులు కూడా తమిళ పరిశ్రమలో తమ సత్తా చాటుకునే సమయం ఆసన్నమైంది. ఆల్రెడీ కొంతమంది హీరోలు తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రాలు చేస్తున్నారు.
ఇప్పుడా జాబితాలో గోపీచంద్ కూడా చేరారు. ఆయన తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. దీనికి బి.గోపాల్ దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం చెన్నయ్‌లో ప్రారంభమైంది. ‘జయం’ తమిళ రీమేక్‌లో విలన్‌గా నటించిన గోపీచంద్, ఆ తర్వాత పలు అనువాద చిత్రాల ద్వారా తమిళ తెరపై కనిపించారు. హీరోగా ఆయన చేస్తున్న స్ట్రయిట్ తమిళ చిత్రం ఇదే. ఇక, బి.గోపాల్ విషయానికొస్తే.. ఆయన దర్శకత్వం వహించిన లారీడ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తదితర చిత్రాలు తమిళంలోకి అనువాదమయ్యాయి.
ఇప్పుడీ స్ట్రయిట్ చిత్రంతో తమిళ ప్రేక్షకులను అలరించబోతున్నారాయన. ఇందులో గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్నారు. జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ స్వరకర్త. సెప్టెంబర్ 1న స్విట్జర్లాండ్‌లో తొలి షెడ్యూల్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు. కొసమెరుపు ఏంటంటే.. తమిళ వెర్షన్‌లో గోపీచంద్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోబోతున్నారు.
Advertisement