శాతకర్ణి కుమారుడి సినిమా కూడా తీస్తా!
‘‘వందో సినిమా ఏది చేస్తే బాగుంటుందని ఆకలి మీదున్న సింహానికి (బాలకృష్ణ) వేట (కథ) దొరికింది. అప్పుడా కథని ఎంత గొప్పగా తీయాలని ఆలోచించాను తప్ప, ఒత్తిడికి లోను కాలేదు. బాలకృష్ణగారి నూరవ చిత్రానికి దర్శకత్వం వహించడం ఓ గౌరవం’’ అన్నారు దర్శకుడు క్రిష్. బాలకృష్ణ హీరోగాఆయన దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ 12న విడుదలవుతోంది. క్రిష్ చెప్పిన విశేషాలు...
► ‘యుద్ధం నుంచి మీ నాన్న ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నావా?’ అని చిన్నప్పుడు శాతకర్ణిని తల్లి అడుగుతుంది. అప్పుడు ‘ప్రజలెందుకు కొట్టుకుంటున్నారమ్మా?’ అనడుగుతాడు. తల్లి గౌతమి ‘ప్రజలు కొట్టుకోవడం లేదు. అధికారం చలాయించడానికి పాలకులు కొట్టుకుంటున్నారు’ అని బదులిస్తుంది. ‘ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యంగా ఉంటే గొడవలు ఉండవు కదా’ అనే ఆలోచన శాతకర్ణిలో వస్తుంది. ‘గణ రాజ్యాలను ఒక్కటిగా చేసే వీరుడు పుట్టాలి కదరా’ అన్నప్పుడు ‘నేను పుట్టాను కదా’ అని శాతకర్ణి గర్జిస్తాడు. సినిమా ప్రారంభ సన్నివేశమిది. 33 గణ రాజ్యాలుగా ఉన్న భారతాన్ని ఏకం చేసిన యుద్ధ పిపాస, గ్రీకులు, పర్షియన్లు తదితరులను ఎదిరించిన గొప్ప చక్రవర్తి కథే – ఈ సినిమా.
► ‘భైరవద్వీపం’, ‘ఆదిత్య 369’ చిత్రాల్లోని గెటప్స్‌లో బాలకృష్ణగారి హుందాతనం చూశాం. 99 సినిమాల అనుభవాన్ని రంగరించి బాలకృష్ణగారు చేసిన చిత్రమిది. కథ చెబుతున్నప్పుడే ఆయన హావభావాల్లో నేను శాతకర్ణిని చూశా. బాలయ్యlతప్ప ఈ పాత్రను ఎవరూ చేయలేరు. ఆయనలా ఎవరూ డైలాగులు చెప్పలేరు. అద్భుతంగా నటించారు. హేమమాలిని, శివ రాజ్‌కుమార్, శ్రియ, కబీర్‌బేడీ.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు.
► ‘యుద్ధాన్ని గెలిచేది సైన్యం కాదు, వ్యూహం’ అని బాలయ్య డైలాగ్ చెబుతారు. మేమూ పక్కా వ్యూహంతో పని చేశాం. ఏదో తెలియని శక్తి మమ్మల్ని నడిపించింది. అమ్మ తోడు... ఈ మాట మా టీమ్‌తో వందసార్లు చెప్పా. ఈ చిత్ర ప్రకటన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ మా తప్పులన్నీ ఒప్పులయ్యాయి.
► రాజమౌళి సృష్టించిన ఓ ఫ్యాంటసీ సినిమా ‘బాహుబలి’. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో చరిత్ర చెప్తున్నా. రెండిటికీ పోలిక పెట్టకూడదు. మొరాకోలో షూటింగ్‌కి వెళ్లడానికి ముందు రాజమౌళికి కథ చెప్పగానే.. ‘గ్రాఫిక్స్ తక్కువ ఉండేలా చూసుకో. గ్రాఫిక్స్ వర్క్ నీ చేతిలో ఉండదు. వీలైనంత లైవ్‌లో షూటింగ్ చెయ్’ అన్నారు. ట్రైలర్ రిలీజ్ కాగానే ఫోన్ చేసి ‘ఎలా తీసేశావ్?’ అనడిగారు. ‘నీ సలహా పాటిం చా’ అన్నాను. ‘గొప్ప సినిమా తీశావ్. టైమ్‌కి రిలీజ్ చేయాలంటే ఇప్పట్నుంచీ నువ్వు పడుకోవద్దు. ఎవ్వర్నీ పడుకోనివ్వకు’ అన్నారు. ఈ రెండు సలహాలూ నాకు ఎంతో సహాయపడ్డాయి. దేశమంతా చెప్పదగిన చారిత్రక కథను తెలుగు ప్రేక్షకుల కోసం కాస్త ప్రాంతీయ అభిమానంతో తీశా. దానికి తోడు హిందీలో ప్రమోట్ చేసే, తీసే టైమ్ లేదు. అందుకే బాలీవుడ్ మీద దృష్టి పెట్టలేదు.
►శాతకర్ణి కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి కథను సినిమాగా తీసే ఆలోచన ఉంది. అదెప్పుడో చెప్పలేను.
‘ఖైదీ నంబర్ 150’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ మధ్య యుద్ధమంటూ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య నడుస్తున్న యుద్ధంపై క్రిష్ స్పందిస్తూ – ‘‘అభిమానం వేరు. మూర్ఖాభిమానం వేరు. ట్విట్టర్‌లో కొన్ని పోస్టులు ఎంత దారుణంగా ఉంటున్నాయో చెప్పలేను. పైగా, వాళ్లంతా చదువుకున్నవారు. పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. చిన్న పిల్లలకు కులం ఎందుకు? అసలు చిరంజీవి, బాలకృష్ణగార్ల గురించి వాళ్లకు ఏం తెలుసు? మా సినిమా ప్రారంభానికి బాలకృష్ణగారు ఆప్యాయంగా చిరంజీవిగారిని ఆహ్వానించారు. అప్పుడు నేను అరగంట కథ చెప్పా. బాలయ్య భలే కథ చేస్తున్నాడని చిరు చెప్పారు. మెగాభిమానులు ఎవరైనా... తమ అభిమాన హీరో శుభాకాంక్షలు అబద్ధం అవ్వాలని కోరుకోకూడదు. నిజమైన బాలకృష్ణ అభిమానులు శుభాకాంక్షలు అందజేసిన చిరంజీవి సినిమా పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించకూడదు. ఒకరు ఓడితే మరొకరు గెలవడానికి ఇవి ఎన్నికలు కావు. ఏ సినిమాను అయినా కళాత్మక దృష్టితో చూడాలి’’ అన్నారు.