రణబీర్, కత్రినా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా!?
బాలీవుడ్ హాట్ ఫేవరేట్ జోడి రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల ప్రేమ, పెళ్లి గురించి మీడియాలో రూమర్లు కావల్సిన దానికంటే ఎక్కువగానే షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ ఇటీవల విదేశాల కు హాలిడే ట్రిప్‌కు వెళ్లి మీడియాకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అడపాదడపా ఎక్కడో ఓ దగ్గర మీడియాకు చిక్కుతునే ఉన్నారీ జంట. తాజాగా ‘ది వూల్ఫ్ ఆఫ్ ది వాల్ స్ట్రీట్’ సినిమా ప్రత్యేక ప్రదర్శన సందర్భంగా రణబీర్, కత్రినాలు చెట్టాపట్టాలేసుకుని కనిపించడం మీడియాను ఆకర్షించింది.
అయితే మునుపటి తరహాలో కాకుండా వీరిద్దరూ మీడియాను తప్పించుకోవడానికి ప్రయత్నించకపోవడం ఇక్కడ గమనార్హం. దీనికి కారణం వీరిద్దరి పెళ్లి వ్యవహారం ఓ కొలిక్కి రావడమేనట. ఈ వార్తకు రణబీర్ కజిన్ కరీనా కపూర్ వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల ఓ టాక్ షోలో కరీనా మాట్లాడుతూ.. త్వరలోనే రణబీర్, కత్రినాల పెళ్లి వార్త వినవచ్చని వెల్లడించింది. సో.. త్వరలోనే కత్రినా, రణబీర్‌ల పెళ్లి బాజాలు మోగనున్నాయన్నమాట!