ముఖేశ్‌భట్ నా మార్గదర్శి | Gurmeet Choudhary signs three-film deal with Vishesh Films | Sakshi
Sakshi News home page

ముఖేశ్‌భట్ నా మార్గదర్శి

Published Thu, May 1 2014 10:28 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 AM

Gurmeet Choudhary signs three-film deal with Vishesh Films

నిర్మాత ముఖేశ్‌భట్‌ను తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తానని, ఆయన తన మార్గదర్శి అని చెబుతున్నాడు వర్ధమాన నటుడు గుర్మీత్ చౌదరి. విశేష్ ఫిల్మ్స్ సంస్థతో మూడు చిత్రాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడాడు. బాలీవుడ్‌లో కెరీర్‌ను ఎలా నిర్మించుకోవాలనే విషయంలో ముఖేశ్‌భట్ తనకు మార్గదర్శిగా నిలుస్తున్నారని చెప్పాడు. ఆయన సూచనలు, సలహాలతోనే బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టానన్నాడు. ముఖేశ్‌తో మూడు చిత్రాల ఒప్పందం ఎలా కుదిరింది? అని అడిగిన ప్రశ్నకు గుర్మీత్ సమాధానమిస్తూ... ‘ముఖేశ్‌భట్‌ను అనేక సినిమా అవార్డుల ఫంక్షన్‌లో కలిసేవాడిని.
 
 ఆయన కూడా నన్ను గమనిస్తున్నాడనిపించేది. అనుకున్నట్లుగానే ఓ రోజు.. దక్షిణాఫ్రికాలో ఓ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. వెండితెర ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్‌కు, బుల్లితెర ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వచ్చింది. ఆ రోజు ముఖేశ్‌జీ నా దగ్గరకు వచ్చి... ‘నీతో కలిసి పనిచేయాలనుంది..!’ అని చెప్పారు. నా నోట మాట రాలేదు. ఆ తర్వాత మరుసటి రోజే ఆయన ఆఫీస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసు..’ అని చెప్పారు. ముఖేశ్ తనను సొంత కొడుకులా చూస్తాడని, అందుకే తన సంస్థలోని చిత్రాలతోపాటు మిగతా సంస్థల చిత్రాలను అంగీకరించే ముందు కూడా గుర్తుంచుకోవలసిన విషయాల గురించి చెబుతారన్నారు.
 
 ఇక ఆయనతో తొలి చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం జిమ్‌కు వెళ్లడం, స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం, నటనకు సంబంధించి మరిన్ని మెళకువలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నాను. ‘అసలు నటనను కెరీర్‌గా ఎంచుకోవడమే విచిత్రంగా జరిగిపోయింది. అనుకోకుండా నాన్నతో కలిసి ఓసారి యశ్‌చోప్రాను కలిశాను. అప్పుడు ఆయన బుల్లితెరపై మొదట ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. షారుఖ్‌ఖాన్ వంటి  పెద్ద పెద్ద స్టార్లు కూడా ముందు బుల్లితెర మీదే అనుభవం సంపాదించుకున్నారని, ఆ దారిలోనే నడవాలని సూచించారు. దీంతో రామాయణ్‌లో రాముడి పాత్ర దక్కింది. ఆ తర్వాత ముఖేశ్‌భట్ కారణంగా సినిమాల్లో అడుగుపెట్టాన’ంటూ తన తెరంగేట్రం గురించి చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement