
చిన్నప్పుడే ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడు!
ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడని నటి హన్సిక అంది.
ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలోనే ఓ కుర్రాడు ఐ లవ్ యూ చెప్పాడని నటి హన్సిక అంది. ఈ ఉత్తరాది భామ ఇటీవల చాలా కసరత్తు చేసి తన అందాలను మరింత మెరుగు పరచుకుంది. చిత్రాల ఎంపికలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ సెలెక్టెడ్ చిత్రాలనే చే సుకుంటూ పోతున్నారు. హన్సిక నటించిన పోకిరిరాజా చిత్రం ఇటీవలే విడుదలైంది.ప్రస్తుతం ఉయిరే ఉయిరే, మనిదన్ చిత్రాల్లోనటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న భేటీ...
పోకిరిరాజా చిత్రంలో సన్నగా మరింత అందంగా కనిపించారు. శారీరక సౌందర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టున్నారే?
థ్యాంక్స్. శారీరక అందంపైనే కాదు, చిత్రాల ఎంపికపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. జీవాకు జంటగా నటించిన పోకిరిరాజా చిత్రంలో స్వచ్ఛ భారత్ పథకాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా మంచి కథా పాత్రలో నటించాను. ఇది తన నిజజీవితానికి దగ్గరగా ఉండడంతో పత్యేక దృష్టి పెట్టి నటించాను.
ఈ మధ్య మీ మార్కెట్ తగ్గిందనే ప్రచారం గురించి?
నేను నటించిన చిత్రాలన్నీ విడుదలయ్యాయి. ప్రస్తుతం సెలెక్టెడ్ చిత్రాలనే చేస్తున్నాను. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదు. రజనీకాంత్, కమలహాసన్, అజిత్, విక్రమ్ వంటి ప్రముఖ నటుల సరసన నటించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను.
నటుడు శింబుతో నటించడానికి నిరాకరించారట?
ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇదునమ్మఆళు చిత్రంలో నటించనున్నానని అసత్య ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆ చిత్రంలో నటించమని నన్ను ఎవరూ అడగలేదు. సినిమాను తప్ప నేనెవరినీ ప్రేమించలేదు. నాకు మగ స్నేహితులు అధికంగా లేరు. ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఒక కుర్రాడు ప్రేమిస్తున్నానని చెప్పాడు.ఆ తరువాత ఎవరూ ప్రేమిస్తున్నానని నాతో చెప్పలేదు.
నా ప్రశ్నకు మీరేదేదో చెబుతున్నారే?
మీరడిగిన ప్రశ్నలో దాగి ఉన్న నిగూడార్థాన్ని నేను తెలుచుకోగలను. నేనేమీ చిన్న పిల్లనా? అర్థంకాక పోవడానికి.
మీరు నంబర్ ఒన్ నటి పోటీలో ఉన్నారనుకోవచ్చా?
నానుంచి మీరేమి ఆశిస్తున్నారో అర్థమైంది.ఆ తరువాత మీకు నయనతార పోటీయా? అని అడుగుతారు. నా జవాబుతో సంచలనం కలిగించి ఏ వివాదానికో దారి తీసేలా ప్రయత్నం చేస్తారు. నిజానికి మీరో, నేనో అంటే నంబర్ ఒన్ నటి అయిపోరు. దాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారు.నా వరకూ నేను మంచి కథా పాత్రలు ఎంపిక చేసుకుని శక్తి వంచన లేకుండా నా పని నేను చేసుకుపోతాను. ఈ నా నిర్ణయం నన్ను ఏ స్థాయిలో కూర్చోపెడుతుందో అదే జరుగుతుంది.
ఈ మధ్య హారర్ చిత్రాల్లో నటించారు. దెయ్యాలంటే భయపడతారా?
భయమా? గియమా? నిజానికి అసలు దెయ్యాలుంటేగా. వాటికి భయపడడానికీ. ఏదో ఒక శక్తి ఉందని నమ్ముతాను. అదే మన జీవితాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఇక దెయ్యాలు, భూతాలు అనేవి సినిమాలకే పరిమితం. అరణ్మణై సిరీస్ చిత్రాల్లో అలాంటి పాత్రలు పోషించాను. అదో మంచి అనుభవం.
మీ చిత్ర లేఖనాలను వేలం వేస్తానన్నారు?
నేను వేసిన పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని వేలం చేసి నేను దత్తత తీసుకున్న 31 మంది పిల్లల సంరక్షణ కోసం నిధిని చేకూర్చాలనుకుంటున్నాను. ఇప్పటికే ఒక సారి ముంబైలో నా పెయింటింగ్‌లను వేలం వేశాను. త్వరలోనే చెన్నైలోనూ పెయింటింగ్స్‌ను వేలం వేయాలనుకుంటున్నాను.