
ఉత్తరాది భామ హన్సిక(Hansika Motwani) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2003లో తన నట జీవితానికి శ్రీకారం చుట్టిన ఈ ఉత్తరాది బ్యూటీ 2007లో దేశముదురు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. తెల్లగా, బొద్దుగా, ముద్దుముద్దుగా ఉన్న ఈ భామ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకొని అందరి దృష్టిలోనూ పడింది. ఆ తర్వాత 2011లో ధనుష్‌కు జంటగా మాప్పిళై చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రం సక్సెస్ అవడంతో హన్సికకు వరుసగా అవకాశాలు ఎక్కువగా తలుపుతట్టాయి.
అలా తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు బొద్దుగా ఉండడంతో మొదట్లో కోలీవుడ్‌లో చిన్న కుష్బూ అనే ముద్రను కూడా వేసుకుంది. కాగా పలు భాషల్లో కథానాయకిగా నటించి 50 చిత్రాల మైలురాయి అధిగమించిన హన్సిక ఆ మధ్య పెళ్లి చేసుకుంది. దీంతో అమ్మడికి అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇంట్లో ఖాళీగా మాత్రం కూర్చోవడం లేదు. వాణిజ్య ప్రకటనల్లో నటించడం, టీవీ షోలకు అతిథిగా పాల్గొనడం అంటూ బిజీగానే ఉంటూ, సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటోంది.

ఇంతకుముందు బొద్దుగా ఉండే హన్సిక ఇప్పుడు చాలా స్లిమ్‌గా తయారైంది. తాను అలా తయారు కావడానికి ఉపయోగించిన టిప్స్‌ను కూడా చెప్పుకొచ్చింది. అందులో మంచినీళ్లు ఎక్కువగా తాగడం ముఖ్యకారణం అని పేర్కొంది. అదేవిధంగా యోగా, ధ్యానం, వంటి శారీరక కసరత్తులు చేస్తానని కేలరీలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వనని ఈ టిప్స్ బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తాయని చెప్పుకొచ్చింది. మొత్తం మీద ఈ బొద్దుగుమ్మ చిక్కినా సక్కగానే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment