పైళ్లె ఏడు నెలలే అయ్యింది. ఒక పక్క వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరో పక్క హీరోయిన్‌గా బిజీగా ఉంది హన్సిక. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయికగా అర్ధ సెంచరీ దాటేసింది. కాగా హన్సిక హీరో ఆదిపినిశెట్టితో కలిసి నటించిన పార్ట్‌నర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి చైన్నెకి వచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆదివారం మీడియాతో ముచ్చటించారు.
ఆమె మాట్లాడుతూ వివాహ జీవితం చాలా హ్యాపీగా సాగుతోందని, నట జీవితానికి తన భర్త ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారని చెప్పింది. తన తల్లి అంతకుమించి అండగా ఉంటున్నారని పేర్కొంది. తనకు నటించడం చాలా ఇష్టమని చెప్పిన ఆమె నటిగా చాలా డ్రీమ్స్ ఉన్నాయంది. అయితే లక్ష్యం అంటూ ఏమీలేదని మంచి నటిగా అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే తన ఆశ అని చెప్పుకొచ్చింది. పలు భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఆ అనుభవం చాలా నేర్పిందని పేర్కొంది.
50వ చిత్రం మహాలో కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడంతో ఆ తరహా పాత్రలోనే నటించాలని కోరుకోవడం లేదని, పాత్ర నచ్చితే ఎలాంటి చిత్రంలోనైనా నటించడానికి రెడీ అంది. ఇండస్ట్రీలో జయాపజయాలు అన్నవి గ్యాంబ్లింగ్ అని.. సీనియర్ దర్శకులైనా, వర్ధమాన దర్శకులైనా కథ నచ్చితే నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించింది. పార్ట్‌నర్ చిత్రంలో పురుషుడిగా మారే పాత్రను పోషించానని, ఇది పూర్తిగా విలువైన కథా చిత్రంగా ఉంటుందని తెలిపింది.
తాను ఎప్పుడు చాలా జాలీగా ఉంటానని, అందుకే ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చింది. మీరు నిజజీవితంలో ఎవరుగా మారాలనుకుంటున్నారన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌గా మారాలని కోరుకుంటానంది. భవిష్యత్తులో చిత్ర నిర్మాణం చేపట్టే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు అందుకు అవకాశమే లేదని, అదేవిధంగా దర్శకత్వం వహించే ఆలోచన కూడా లేదని స్పష్టం చేసింది. నటిగా చాలా హ్యాపీగా ఉన్నట్లు హన్సిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment